బౌద్ధం ఓ ప్రత్యేక మతం

 Buddhism is a unique religion– అందులో చేరాలంటే ముందస్తు అనుమతి తప్పనిసరి
– సర్క్యులర్‌ జారీ చేసిన గుజరాత్‌ ప్రభుత్వం
అహ్మదాబాద్‌ : బౌద్ధం ఓ ప్రత్యేక మతమని గుజరాత్‌ ప్రభుత్వం తెలిపింది. ఎవరైనా హిందూ మతం నుండి బౌద్ధ మతం, జైన మతం, సిక్కు మతంలోకి మారాలంటే సంబంధిత జిల్లా మెజిస్ట్రేట్‌ నుంచి ముందస్తు అనుమతి పొందాలని స్పష్టం చేసింది. ఈ మేరకు ఓ సర్క్యులర్‌ జారీ చేసింది. గుజరాత్‌ మత స్వేచ్ఛ చట్టం-2003 ప్రకారం ముందుగా అనుమతి పొందడం తప్పనిసరి అని రాష్ట్ర హోం మంత్రిత్వ శాఖ జారీ చేసిన ఆ సర్క్యులర్‌ తెలిపింది. బౌద్ధ మతంలోకి మారేందుకు సమర్పిస్తున్న దరఖాస్తులు నిబంధనలకు అనుగుణంగా ఉండడం లేదని ప్రభుత్వ దృష్టికి వచ్చిందని వివరించింది. కాగా సర్క్యులర్‌పై డిప్యూటీ సెక్రటరీ (హోం) విజరు బధేకా సంతకం చేశారు.
మత మార్పిడుల నిరోధానికే
గుజరాత్‌లో ప్రతి సంవత్సరం దసరా, ఇతర పండుగల సందర్భంగా జరిగే కార్యక్రమాలలో పలువురు దళితులు మూకుమ్మడిగా బౌద్ధ మతంలో చేరుతున్నారు. ఈ నేపథ్యంలో మత మార్పిడులను నిరోధించేందుకు ప్రభుత్వం తాజాగా సర్క్యులర్‌ జారీ చేసింది. గుజరాత్‌ మత స్వేచ్ఛ చట్టాన్ని జిల్లా మెజిస్ట్రేట్ల కార్యాలయాలు తమ ఇష్టానుసారం అన్వయించుకుంటున్నాయని అందులో తెలిపింది. ‘హిందూ మతం నుండి బౌద్ధ మతంలోకి మారడానికి అనుమతి కోరుతూ సమర్పించే దరఖాస్తుల విషయంలో నిబంధనలను పాటించడం లేదని ప్రభుత్వం దృష్టికి వచ్చింది. అదీకాక కొన్ని సందర్భాలలో హిందూ మతం నుండి బౌద్ధంలోకి మారేటప్పుడు ముందస్తు అనుమతి అవసరం లేకుండా చూడాలని కొందరు దరఖాస్తుదారులు, స్వతంత్ర సంస్థలు కోరుతున్నాయి. రాజ్యాంగంలోని ఆర్టికల్‌ 25 (2) ప్రకారం సిక్కులు, జైనులు, బౌద్ధులు హిందూ మతానికి చెందిన వారేనని, మత మార్పిడుల కోసం వారు అనుమతి తీసుకోవాల్సిన అవసరం లేదని దరఖాస్తులను పరిష్కరించే సమయంలో సంబంధిత అధికారులు చెబుతున్నారు. మత మార్పిడుల వంటి సున్నితమైన అంశాలపై దరఖాస్తుదారులకు సమాధానం ఇచ్చే ముందు న్యాయపరమైన నిబంధనలను సరిగా అధ్యయనం చేయకపోతే చట్టపరమైన వివాదాలు తలెత్తుతాయి’ అని ఆ సర్క్యులర్‌లో తెలియజేశారు.
ప్రత్యేక మతంగా పరిగణించాలి
గుజరాత్‌ మత స్వేచ్ఛ చట్టం ప్రకారం బౌద్ధాన్ని ప్రత్యేక మతంగా పరిగణించాలని సర్క్యులర్‌ స్పష్టం చేసింది. చట్టపరమైన నిబంధనలను కూలంకషంగా అధ్యయనం చేయాలని, అలాగే రాష్ట్ర ప్రభుత్వం ఎప్పటికప్పుడు జారీ చేస్తున్న ఆదేశాలను పాటించాలని, ఆ తర్వాతే మత మార్పిడుల దరఖాస్తులపై నిర్ణయం తీసుకోవాలని తెలిపింది.
ఆ రాష్ట్రంలో పరిపాటే
గుజరాత్‌లో దళితులు బౌద్ధ మతంలోకి మారడం సర్వసాధారణంగా జరుగుతున్నదే. గుజరాత్‌ బౌద్ధ అకాడమీ (జీబీఏ) వంటి సంస్థలు ప్రతి ఏటా మత మార్పిడుల కార్యక్రమాలు నిర్వహిస్తుంటాయి. కాగా తాజా సర్క్యులర్‌పై జీబీఏ కార్యదర్శి రమేష్‌ బంకర్‌ హర్షం వ్యక్తం చేశారు. బౌద్ధం అనేది హిందూమతంలో భాగం కాదని అది స్పష్టం చేసిందని చెప్పారు. గత సంవత్సరం రెండు వేల మంది ప్రజలు బౌద్ధ మతాన్ని స్వీకరించారని ఆయన తెలిపారు. 2011 జనాభా లెక్కల ప్రకారం గుజరాత్‌లో 30,483 మంది బౌద్ధులు ఉన్నారు. రాష్ట్ర జనాభాలో ఇది 0.05% మాత్రమే. అయితే జనగణన చేసిన అధికారులు బౌద్ధులను హిందువులుగా పరిగణించారని, దీంతో ఆ గణాంకాల్లో బౌద్ధుల వాస్తవ సంఖ్య ప్రతిబింబించలేదని రమేష్‌ తెలిపారు. గత సంవత్సరం అక్టోబరులో అహ్మదాబాద్‌లో 400 మంది ప్రజలు బౌద్ధ మతాన్ని స్వీకరించారు. 2022 అక్టోబరులో గిర్‌ సోమనాథ్‌లో 900 మంది బౌద్ధ మతంలో చేరారు.

Spread the love