ఫుడ్‌ పాలిట్రిక్స్‌

Food Politics– లోక్‌సభ ఎన్నికల వేళ వెజ్‌..నాన్‌ వెజ్‌ రాజకీయం
సార్వత్రికంలో గెలవటానికి బీజేపీ ఎన్నో అడ్డదారులు వెతుకుతోంది. మతంతో రెచ్చగొడుతున్నా.. ఆశించిన మేర ఫలితాలు కనిపించటం లేదన్న భావన ఆ పార్టీ నేతల్లో వ్యక్తమవుతోంది. ఇప్పుడు తినే తిండిలోనూ రాజకీయ కోణంతో ఓట్లు రాల్చుకునే ప్రయత్నాలు చేస్తోంది. ఇందులో భాగంగానే వెజిటేరియన్‌, నాన్‌ వెజిటేరియన్‌ అంటూ కమలం పార్టీ చేస్తున్న ఫుడ్‌ పాలిట్రిక్స్‌ హాట్‌ టాపిక్‌గా మారాయి.
నవతెలంగాణ-న్యూఢిల్లీ బ్యూరో
తినే తిండి విషయంలో ఎవరి ఇష్టాయిష్టాలు వారివి. అయితే ఇటీవల ఆర్జేడీ నేత తేజస్వీ యాదవ్‌ చేపల వీడియో పోస్టు చేస్తే.. దాన్ని బీజేపీ రాజకీయ అస్త్రంగా మలుచుకునే ప్రయత్నం చేస్తోంది. తాను స్వచ్ఛ వెజిటేరియన్‌ అంటూ ఉప్మా తింటూ ప్రధాని మోడీ ఫోజులివ్వగా…బీజేపీ ఐటీసెల్‌ తెగ ప్రచారం చేస్తోంది. దేన్నైనా రాజకీయం చేయాలనే ధోరణి కమలం పార్టీలో కనిపించటంతో.. ఈ లోక్‌సభ ఎన్నికల సీజన్‌లో ఆహారం కూడా రాజకీయ చర్చగా మారింది.. అయితే ఈ ఫుడ్‌ పాలిటిక్స్‌ ఓటర్లను ఏమేరకు ప్రభావితం చేస్తాయన్న టాక్‌ అందరినోళ్లలో నానుతోంది.
లాలూ నుంచి షురూ..
రాజకీయ నాయకులు ఓటర్లతో కనెక్ట్‌ కావడానికి ఆహార రూపకాలను ఉపయోగిస్తు న్నారు. బీహార్‌ మాజీ ముఖ్యమంత్రి లాలూ ప్రసాద్‌ యాదవ్‌ దశాబ్దాల నాటి ”జబ్‌ తక్‌ సమోసా మే రహేగా ఆలూ, బీహార్‌ మే రహేగా లాలూ” నినాదం ఇప్పటికీ మన చెవుల్లో మారుమోగుతూనే ఉంది. ప్రధాని మోడీ తన ”చారు వాలా” (టీ అమ్మేవాడు) మూలాలను ప్రయోగించారు. వాస్తవానికి, 2014 లోక్‌సభ ఎన్నికల సమయంలో, ఆయన ‘చారు పే చర్చా’ ప్రచారం ద్వారా ఓటర్లతో కనెక్ట్‌ అయ్యారు. ఇపుడు చారు వాలా సంగతి మర్చిపోయారు. అవసరాన్ని బట్టి పూటకో గెటప్‌లో ప్రచారం చేయటమే కాదు… ప్రతిపక్షాలపై అదుపులేనట్టుగా ప్రసంగాలు చేస్తూనే ఉన్నారు.
ఉప్మా సే మైసూర్‌పాక్‌
దక్షిణాది ఓటర్లను ప్రభావితం చేసేందుకు ఉప్మా అంటే ఎక్కడా లేని ఇష్టమున్నట్టు మోడీ ఫోజులిచ్చారు. ఉప్మా తనకు ఇష్టమైన తమిళ ఆహారం అని, పొట్టలో తేలికగా, సులభంగా జీర్ణం కావడానికి అతను పొంగల్‌ను కూడా ఇష్టపడతానని చెప్పారు. దీన్ని బట్టి చూస్తే..నార్త్‌, ఈస్ట్‌లో బీజేపీలో సీట్లు తగ్గే ఛాన్స్‌ ఉండటంతో..దక్షిణాది ఓటర్లను బుట్టలో వేయటానికి ఉప్మా టేస్టు గురించి ప్రచారం చేసుకుంటున్నారనిపిస్తోంది.
స్టాలిన్‌కు అప్యాయంగా..
స్టాలిన్‌కు రాహుల్‌ మైసూర్‌ పాక్‌ బహుమతిగా ఇవ్వటం తమిళనాడులో విపరీతమైన ప్రచారంలో ఉన్నది. తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకె స్టాలిన్‌ కోసం ప్రధానంగా నెయ్యి, శెనగపిండితో తయారు చేసిన ప్రముఖ స్వీట్‌ మైసూర్‌ పాక్‌ను కొనుగోలు చేయడానికి కాంగ్రెస్‌ నాయకుడు రాహుల్‌ గాంధీ రోడ్డు డివైడర్‌పై నుండి దూకినట్లు చూపించిన వీడియో ఒకటి వెలువడింది. ఈ వీడియోను తన హ్యాండిల్‌లో పోస్ట్‌ చేస్తూ, జూన్‌ 4న ఇండియా ఫోరం మరింత ”తీపి విజయాన్ని” అందజేస్తుందని వ్యాఖ్యను జోడించారు. ఈ వీడియో వైరల్‌ కావడంతో ఒక వినియోగదారుడు ”ఎంకె స్టాలిన్‌ కోసం మైసూర్‌ పాక్‌ కొనుగోలు చేసిన వీడియోతో మోడీ విభజన ఆహార రాజకీయాలకు రాహుల్‌ గాంధీ చెక్‌ పెట్టారు” అని వ్యాఖ్యానించారు.బీహార్‌ మాజీ ఉప ముఖ్యమంత్రి తేజస్వి యాదవ్‌ ప్రచారంలో రోటీ, చేపలు తింటున్న వీడియోను పోస్ట్‌ చేయడంపై బీజేపీ విమర్శలు చేసింది. నవరాత్రులలో మాంసాహారం తిన్నందుకు ఆయనపై బీజేపీ దాడి చేసింది. అయితే నవరాత్రికి ముందు ఈ వీడియో చిత్రీకరించినట్లు తేజస్వి స్పష్టం చేశారు.బెంగాల్‌ ప్రజల ఆహారంలో చేపలు ప్రధాన అంతర్భాగం. దీనిని తృణమూల్‌ కాంగ్రెస్‌ ఎన్నికల ప్రణాళికలలో ఒకటిగా మార్చింది. బీజేపీ మళ్లీ అధికారంలోకి వస్తే ఆహార ప్రాధాన్యతలపై ప్రభావం చూపుతుందని ఓటర్లను హెచ్చరించిన బెంగాల్‌ సీఎం మమతా బెనర్జీ, చేపలు తినే ఎవరికైనా బీజేపీతో ఇబ్బంది అని తెలిపారు. ”ఎవరైనా చేపలు తింటే కూడా బీజేపీకి సమస్యే. మేము ఏమి తినాలో, ధరించాలో నిర్ణయించడానికి మీరు ఎవరు?” అని మమతా బెనర్జీ అన్నారు.
హిమాచల్‌ ప్రదేశ్‌ మండి లోక్‌సభ బీజేపీ అభ్యర్థి కంగన రనౌత్‌ తాను గొడ్డు మాంసం తింటానని గతంలో ప్రకటించారు. ఇప్పుడు మాట మార్చేసి ‘ నేనెప్పుడు అన్నాను’ అని అంటున్నారు. వాస్తవానికి ఈశాన్య రాష్ట్రాల్లోని బీజేపీ నేతలంతా గొడ్డు మాంసాన్ని తెగ లాగేస్తారు. అందువల్ల ఆ మాంసం జోలిపై బీజేపీ హైకమాండ్‌ నోరు విప్పదు. వెజిటేరియన్‌ ఫుడ్‌ గురించి కేంద్రమంత్రులంతా ఫుడ్‌ సెంటిమెంట్‌ (వెజిటేరియన్‌)ను జోడించేలా ఓటరన్నపై వల విసురుతున్నారు.రాజకీయ విశ్లేషకుడు అమితాబ్‌ తివారీ మాట్లాడుతూ ”ప్రత్యర్థులను హిందూ వ్యతిరేకులుగా చిత్రీకరించేందుకు బీజేపీ ఈ అంశాన్ని లేవనెత్తుతోంది. ప్రధాని మోడీ, అమిత్‌ షా జుమ్లా మాస్టర్లు. నిరుద్యోగం, ధరల పెరుగుదల వంటి సమస్యల నుండి దృష్టిని మరల్చడానికి బీజేపీ చేస్తున్న స్పష్టమైన ప్రయత్నం ఇది. బీజేపీని ఎదుర్కోవడంలో ప్రతిపక్షం ఇరుక్కుపోతుంది. ప్రధాన సమస్యలు తెరమరుగవుతున్నాయి” అని తివారీ అన్నారు.

Spread the love