ప్రతీదీ మా నుంచి లాక్కున్నారు, ఓటును కూడా లాక్కోవద్దు

ప్రతీదీ మా నుంచి లాక్కున్నారు, ఓటును కూడా లాక్కోవద్దు– బీజేపీ ఎన్నికల వాయిదా సూచనలపై ఈసీకి మెహబూబా ముఫ్తి లేఖ
శ్రీనగర్‌ : అనంత్‌నాగ్‌-రాజౌరి లోక్‌సభ సీటుకు ఎన్నికలను వాయిదా వేయాలని ఎన్నికల కమిషన్‌ను కోరుతూ బిజెపి సహా కొన్ని పార్టీలు కోరడంపై జమ్మూ కాశ్మీర్‌ మాజీ ముఖ్యమంత్రి, పీపుల్స్‌ డెమోక్రటిక్‌ పార్టీ (పీడీపీ) అధ్యక్షురాలు మెహబూబా ముఫ్తి తీవ్రంగా మండిపడ్డారు.
”అనంత్‌నాగ్‌-రాజౌరిలో అవకాశాలు, పరిస్థితులను అంచనా వేయాల్సిందిగా కోరుతూ జమ్మూ కాశ్మీర్‌ పాలనా యంత్రాంగానికి ఎన్నికల కమిషన్‌ ఆదేశాలు జారీ చేయడం దిగ్భ్రాంతి కలిగించింది. చాలా కాలం తర్వాత జమ్మూ కాశ్మీర్‌ ప్రజలు ప్రజాస్వామ్యం పట్ల నమ్మకం పెట్టుకున్నారు. ఈ ప్రభుత్వం మా నుండి అన్నీ లాగేసుకుంది. కానీ ఈ బ్యాలెట్‌ను కూడా లాక్కోకండి. కాశ్మీర్‌ను మండిపోయేలా చేసిన, తరతరాలను ప్రభావితం చేసిన 1987ను పునరావృతం చేయొద్దు.” అని ముఫ్తి కోరారు. మే 7న ఇక్కడ ఎన్నికలు జరగాల్సి వున్నాయి. బీజేపీ, జమ్మూ కాశ్మీర్‌ పీపుల్స్‌ కాన్ఫరెన్స్‌, జెఅండ్‌ కె అప్నీ పార్టీ, ఇండిపెండెంట్లు సహా పలువురు ఎన్నికను వాయిదా వేయాలని కోరారు. మంచు విపరీంగా కురుస్తుండడంతో ముఘల్‌ రోడ్డును మూసివేశారని, దాంతో రాజౌరి, పూంచ్‌లకు చెందిన అభ్య ర్ధులు నామినేషన్‌ పత్రాలు కూడా దాఖలు చేయలేకపో యారని వారు తమ వినతి పత్రాల్లో పేర్కొన్నారు. ఈ సీటు నుండి బిజెపి పోటీ చేయడం లేదనేది ఆసక్తికరమైన అంశం.

Spread the love