పోటీదారే రిఫరీనా?!

Is the competitor the referee?!– ఎన్నికల వేళ మోడీ ఎత్తుగడలు
– మత విభజనకు శ్రీకారం
– కోరలు తీసిన పాములా ఈసీ
– పతిపక్ష నేతలపై వేధింపులు, అరెస్టులు
– బీజేపీలో చేరగానే పరిశుద్ధులు
– కాషాయ పార్టీ కొమ్ముకాస్తున్న కార్పొరేట్‌ మీడియా
– ప్రత్యామ్నాయ మీడియాకు బెదిరింపులు
కోరలు లేని ఈసీ : ఎన్నికల తేదీల ప్రకటనకు ముందే కేంద్ర ప్రభుత్వం ఎలక్షన్‌ కమిషన్‌ సభ్యుల ఎంపికకు సంబంధించిన నిబంధనను మార్చేసింది. గతంలో ఎంపిక కమిటీలో భారత ప్రధాన న్యాయమూర్తి, ప్రధాని, ప్రతిపక్ష నేత ఉండేవారు. ప్రభుత్వం ఈ నిబంధనను మార్చేసి, ప్రధాన న్యాయమూర్తిని ఎంపిక కమిటీ నుండి తప్పించింది. ఆయన స్థానంలో కేంద్ర మంత్రిని చేర్చింది. అంటే దీనర్థం ఎన్నికల కమిషన్‌ నియామకంలో ప్రభుత్వం మాటే చెల్లుబాటు అవుతుంది. ప్రతిపక్ష నేత అభిప్రాయానికి విలువే ఉండదు. పోటీ పడే అనేక జట్లలో ఒక జట్టు కెప్టెనే అంపైర్‌ను నియమిస్తే ఏమవుతుంది? అప్పుడు ఆయన నిస్పాక్షికత గురించి ఇక చెప్పేదేముంటుంది?
అరెస్టుల పర్వం : ఎన్నికల ప్రకటన తర్వాత ఢిల్లీ ముఖ్యమంత్రి, అమ్‌ఆద్మీ పార్టీ నేత అరవింద్‌ కేజ్రీవాల్‌ను అరెస్ట్‌ చేశారు. దానికి ఒక నెల రోజుల ముందే జార్ఖండ్‌ ముఖ్యమంత్రి హేమంత్‌ సొరేన్‌ను కటకటాల వెనక్కి నెట్టారు. బీఆర్‌ఎస్‌ నాయకురాలు కల్వకుంట్ల కవిత ఇప్పటికే జైలులో ఉన్నారు. అమ్‌ఆద్మీ పార్టీకే చెందిన మరో ముగ్గురు నేతలు… ఢిల్లీ మాజీ ఉప ముఖ్యమంత్రి మనీష్‌ సిసోడియా, ఆరోగ్య శాఖ మాజీ మంత్రి సత్యేందర్‌ జైన్‌, రాజ్యసభ సభ్యుడు సంజరు సింగ్‌ కూడా జైలు జీవితం గడుపుతున్నారు.
ఐరాస వ్యాఖ్యలు
ప్రపంచదేశాలన్నీ ఈ పరిణా మాలను గమనిస్తున్నాయి. సార్వత్రిక ఎన్నికలపై ఐక్యరాజ్య సమితి సెక్రటరీ జనరల్‌ ప్రతినిధి వ్యాఖ్యానాలు చేయడం స్వతంత్ర భారత చరిత్రలో ఇదే మొదటిసారి. భారత్‌లోని ప్రతి ఒక్కరి పౌర, రాజ్యాంగ హక్కులకు రక్షణ లభిస్తుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. ఎన్నికల ప్రక్రియలో భారత ప్రజలందరూ స్వేచ్ఛగా భాగస్వాములు కావాలన్న ఆకాంక్షను వ్యక్తం చేశారు. ఆయన ఆందోళన నిరాధారమా? ఏదేమైనా ఈ ఎన్నికలు దేశ భవిష్యత్తుకు ఎంతో ముఖ్యమైనవి. బీజేపీ పక్షాన పని చేయాలని దేశంలోని రాజ్యాంగ సంస్థలన్నీ నిర్ణయించు కున్నాయి. కార్పొరేట్‌ మీడియా ఏమో బీజేపీ ప్రచారకురాలి పాత్ర స్వీకరిం చింది. ప్రతిపక్షాల చేతులు, కాళ్లు కట్టేశారు. ఇలాంటి పరిస్థితుల్లో ప్రజలే ఓ నిర్ణయానికి రావాల్సి ఉంది. వారికి అన్నీ తెలుసు. తమ పాత్ర ఏమిటో కూడా బాగా తెలుసు.
న్యూఢిల్లీ : 2012లో వచ్చిన కామెడీ చిత్రం ‘ది డైరెక్టర్‌’ గుర్తుందా? అందులో బాగా ప్రాచుర్యం పొందిన ఓ సన్నివేశం ఉంది. వంద మీటర్ల పరుగు పందెంలో డైరెక్టర్‌ పాల్గొంటున్నారు. పోటీ ప్రారంభమైందని చెప్పే ఓ పిస్టల్‌ ఆయన వద్ద ఉంటుంది. ముందు పరుగు మొదలెట్టి ఆ తర్వాత ఆయన ఆ పిస్టల్‌ పేలుస్తాడు. పోటీదారుల్లో ఒకరి తర్వాత ఒకరిని కాల్చుకుంటూ పరిగెత్తుతుంటాడు. వారేమో కిందపడతారు. చివరికి ఆయన ఒక్కడే పోటీలో నిలుస్తాడు. రేసులో చివరి పాయింట్‌ వద్ద రిబ్బను పట్టుకొని నిలుచుకున్న వారు దానిని తీసుకొని ముందుకు వస్తారు. ఆ రిబ్బనును దాటేసిన డైరెక్టర్‌ విజేతగా నిలుస్తాడు. ఈ విధంగా తానే నిర్వహించిన ఒలింపిక్స్‌లో డైరెక్టర్‌ అలాడిన్‌ 14 పతకాలు గెలుచుకుంటాడు !
18వ లోక్‌సభ షెడ్యూలు విడుదలైన తర్వాత ‘ది డైరెక్టర్‌’ చిత్రంలోని ఆ సన్నివేశం సోషల్‌ మీడియాలో బాగా వైరల్‌ అవుతోంది. భారత్‌లో ఇదే జరుగుతోందంటూ ప్రజలు వ్యాఖ్యలు రాస్తున్నారు. అలా చెప్పడానికి ఓ కారణం ఉంది మరి. భారత్‌ను నియంతృత్వ దేశం అని పిలవలేము. అయితే ఎన్నికలకు ముందు జరుగుతున్నది చూస్తుంటే ఆ సినిమాలోని సన్నివేశం గుర్తుకు వస్తోంది. ఎందుకంటే ఎన్నికల తేదీలు ప్రకటించడానికి ముందే మోడీ ప్రభుత్వం పెద్ద ఎత్తున సర్కారు సొమ్ముతో ప్రచారం ప్రారంభించింది. ఫలితంగా ప్రచారంలో ప్రత్యర్థుల కంటే ముందుంది. ఎన్నికలు ప్రకటించడానికి ముందు జరిగిన పరిణామాలను గమనిస్తే ఈ విషయం అర్థమవుతుంది.
ఇదేమి న్యాయం?
వీరిలో సంజరు సింగ్‌కు ఇటీవలే సుప్రీంకోర్టు బెయిల్‌ ఇచ్చింది. ఇక్కడ ఆసక్తికరమైన విషయమేమంటే సంజరు సింగ్‌ బెయిల్‌ అభ్యర్థనను తోసిపుచ్చిన ఢిల్లీ హైకోర్టు న్యాయమూర్తే కేజ్రీవాల్‌ అరెస్టును సమర్ధించారు. సంజరు తన వాదనలను సుప్రీంకోర్టులో పునరుద్ఘాటిం చారు. హైకోర్టు ఆదేశాలను తోసిపుచ్చిన సుప్రీంకోర్టు ఆయనకు బెయిల్‌ మంజూరు చేసింది. కేజ్రీవాల్‌ ముఖ్యమంత్రి అని, ఆయన ముఖ్యమైన రాజకీయ నాయకుడని అంటూ వెసులుబాటు కల్పించేందుకు ఢిల్లీ హైకోర్టు నిరాకరించింది. అయితే అదే న్యాయమూర్తి మరో నాయకుడు దిలీప్‌ రే శిక్షను వాయిదా వేశారు. దిలీప్‌ ముఖ్య రాజకీయ నేత అని, ఆయన ఎన్నికల్లో పోటీ చేయాల్సి ఉన్నదని చెప్పారు. దిలీప్‌ రేకు ఇప్పటికే శిక్ష పడింది. కానీ కేజ్రీవాల్‌పై కేసు ఇంకా పూర్తి కాలేదు. దిలీప్‌ రే బీజేపీ తరఫున ఎన్నికల్లో పోటీ చేస్తారని లేదా ఆ పార్టీకి మద్దతు ఇస్తారని వదంతులు వినవస్తున్నాయి. న్యాయమూర్తి పక్షపాత వైఖరిని అందరూ గుర్తించారు.
నోటీసులతో చికాకులు
రాజకీయ నాయకుల అరెస్టులు ప్రతిపక్షాల ఎన్నికల ప్రచారంపై తప్పనిసరిగా ప్రభావం చూపుతాయి. అరెస్టులే కాదు…వివిధ కేంద్ర ప్రభుత్వ సంస్థలు ప్రతిపక్ష పార్టీలకు చెందిన ఇతర నేతలకు వేర్వేరు అంశాలపై నోటీసులు పంపుతున్నాయి. దాదాపు పాతిక సంవత్సరాల నాటి కేసులో బీహార్‌ మాజీ ముఖ్యమంత్రి, ప్రముఖ ప్రతిపక్ష నేత లాలూ ప్రసాద్‌ యాదవ్‌కు మధ్యప్రదేశ్‌ నుండి అరెస్ట్‌ వారంట్‌ పంపారు. ప్రతిపక్ష నేతలను గందరగోళంలో పడేయాలని, ఎన్నికల ప్రచారంపై పూర్తి స్థాయిలో దృష్టి సారించకుండా వారిని చికాకు పెట్టాలని కేంద్ర దర్యాప్తు సంస్థలు భావిస్తున్నట్లు స్పష్టమవుతోంది.
కాంగ్రెస్‌ను టార్గెట్‌ చేసి
కేజ్రీవాల్‌ అరెస్టుతో కేంద్రం శాంతించలేదు. దేశంలోని అతి పెద్ద ప్రతిపక్ష పార్టీ అయిన కాంగ్రెస్‌కు ఐటీ శాఖ నోటీసు పంపింది. రూ.1,800 కోట్ల బకాయిలు చెల్లించాలని కోరింది. దానికి ముందే ఎలాంటి సమాచారం ఇవ్వకుండా కాంగ్రెస్‌ బ్యాంక్‌ ఖాతా నుంచి ప్రభుత్వం రూ.135 కోట్లను తీసేసుకుంది. అంతే కాదు…ఆ పార్టీకి చెందిన బ్యాంక్‌ ఖాతాలన్నింటినీ స్తంభింపజేసింది. డబ్బు లేకపోతే ప్రచారం చేయలేదన్న ఉద్దేశంతోనే ప్రభుత్వం ఈ చర్యకు పాల్పడిందని కాంగ్రెస్‌ ఆరోపించింది.
బీజేపీలో చేరగానే అటకెక్కిన కేసులు
అరెస్టులు, వేధింపుల సంగతి పక్కన పెడితే ప్రతి రోజూ ఎవరో ఒక ప్రతిపక్ష నాయకుడుబీజేపీలో చేరిపోతున్నారు. ప్రభుత్వ దర్యాప్తు సంస్థల భయంతోనే వారంతా ప్రతిపక్ష పార్టీలను వదిలి బీజేపీ తీర్థం పుచ్చుకుంటున్నారన్నది వాస్తవం. ఉదాహరణకు అమ్‌ఆద్మీ పార్టీ నాయకుడొకరు పార్టీకి గుడ్‌బై చెప్పారు. ఇటీవలే ఆయన నివాసంపై ఈడీ దాడి చేసింది. మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి, కాంగ్రెస్‌ సీనియర్‌ నేత అశోక్‌ చవాన్‌, మాజీ ఉప ముఖ్యమంత్రి, ఎన్సీపీ నాయకుడు అజిత్‌ పవార్‌ బీజేపీ గూటికి చేరారు. వారిద్దరినీ జైలుకు పంపుతామని అంతకుముందే సాక్షాత్తూ ప్రధాని మోడీ హెచ్చరించారు. ఇలా బీజేపీలో చేరుతున్న ప్రతిపక్ష నేతలపై ‘ది ఇండియన్‌ ఎక్స్‌ప్రెస్‌’ పత్రిక ఓ కథనాన్ని ప్రచురించింది. పాతిక మంది నాయకుల రికార్డులను ఆ పత్రిక పరిశీలించింది. బీజేపీలో చేరగానే వారిలో 23 మందిపై ఉన్న కేసులను మూసేశారని తెలిపింది.
ప్రత్యామ్నాయ మీడియాపై వేధింపులు
ఇక బడా మీడియా సంస్థల విషయానికి వస్తే అవన్నీ ప్రభుత్వానికి కొమ్ము కాస్తున్నాయి. బీజేపీని, నరేంద్ర మోడీని ఆకాశానికి ఎత్తుతూ కథనాలు వండి వారుస్తున్నాయి. ఎన్నికల తేదీలు ప్రకటించిన తర్వాత మీడియా వేదికలు కొన్ని కార్యక్రమాలు నిర్వహిస్తున్నాయి. వీటిని ప్రధాని మోడీ, ఆయన మంత్రులు ప్రచారం కోసం పూర్తిగా వినియోగించుకుంటున్నారు. ప్రతిపక్షాలు బలహీ నంగా ఉన్నాయని, మోడీకి జనాదరణ బాగా ఉన్నదని, ఆయనకు ప్రత్యామ్నాయమే లేదని కార్పొరేట్‌ మీడియా సంస్థలు ఊదరగొడుతున్నాయి. ఈ మీడియాకు సమాం తరంగా ప్రతిపక్షాల గొంతుకను వినిపిస్తున్న మీడియాను ప్రభుత్వం అణచివేస్తోంది. ప్రభుత్వాన్ని విమర్శిస్తున్న పలు యూట్యూబ్‌ ఛానల్స్‌కు నోటీసులు ఇస్తోంది. కొన్నింటిని బలవంతంగా మూసివేస్తోంది. ఇలాంటి పరిస్థితుల్లో ప్రభుత్వం తప్ప ఇతర పార్టీల అభిప్రాయాలను తెలుసుకునే అవకాశం ప్రజలకు లేకుండా పోయింది.
మళ్లీ మొదలైన మత రాజకీయాలు
ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించిన మొదటి రోజు నుండే ప్రధాని సహా బీజేపీ ప్రచారకులు అందరూ మత ప్రాతిపదికన ఓటర్లను విభజించే ప్రయత్నాన్ని ప్రారంభించారు. కాంగ్రెస్‌ పార్టీ ఎన్నికల ప్రణాళికలోని ప్రతి పేజీలోనూ ముస్లింలీగ్‌ ముద్ర కన్పిస్తోందని ప్రధాని మోడీ ఆరోపించారు. అంతేకాదు…ప్రతిపక్ష పార్టీలు శ్రీరాముడికి వ్యతిరేకమని నిందించారు. అలాంటి పార్టీలకు బుద్ధి చెప్పాలని ప్రజలకు పిలుపునిచ్చారు. బీజేపీ నేతలు తమ విద్వేష ప్రసంగాల ద్వారా ఎన్నికల ప్రవర్తనా నియమావళిని బాహాటంగానే ఉల్లంఘిస్తున్నారు. అయితే ప్రధాని నియమించిన ఎన్నికల కమిషన్‌ ఆ పార్టీని నిషేధించగలదా?

Spread the love