– నేతలు, కార్యకర్తలు కార్యాలయానికి రాకుండా ఆంక్షలు
– మంత్రులకు తమ అధికార నివాసాల్లోకి సైతం అనుమతి నిరాకరణ
– పోలీసుల చర్యపై ఆప్ మంత్రుల మండిపాటు
నవతెలంగాణ-న్యూఢిల్లీ బ్యూరో
మద్యం కుంభకోణం కేసులో ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ అరెస్టైన తర్వాత ఆప్ నేతల నిరసనలు మిన్నంటాయి. కేంద్ర ప్రభుత్వంపై, ప్రధాని మోడీ లక్ష్యంగా ఆప్ నేతలు తీవ్రస్థాయిలో విరుచుకు పడుతున్నారు. ఎక్కడికక్కడే ఆందోళనలు జరుగుతున్నాయి. ఆప్ మంత్రులను అధికార నివాసాల్లోకి సైతం వెళ్లకుండా అడ్డుకుంటున్నారని ఆ పార్టీ నేత, మంత్రి సౌరభ్ భరద్వాజ్ ధ్వజమెత్తారు. లోక్‌సభ ఎన్నికల వేళ ప్రజల్లోకి వెళ్లకుండా అడ్డుకోవడం సరికాదని మండిపడ్డారు. ‘మిస్టర్ మోడీ మమ్మల్ని కాల్చేయండి’ అంటూ సౌరభ్ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ‘ఢిల్లీలో రౌడీయిజం మొదలైంది. ఇక్కడ శాంతి భద్రతలు అమల్లో లేవు. మీరు మమ్మల్ని పార్టీ ఆఫీసుకు కూడా వెళ్లకుండా అడ్డుకుంటున్నారు. మా అభ్యర్థులు లోక్‌సభ ఎన్నికల్లో ఎలా పోటీ చేయాలి..? మమ్మల్ని నియంత్రించే అధికారం పోలీసులకు ఎక్కడి నుంచి వచ్చింది. మా పార్టీ నేతలపై జరుగుతున్న వివక్ష గురించి కేంద్ర ఎన్నికల సంఘం కలుగజేసుకోవాలి. ఇదే అంశం గురించి మాట్లాడేందుకు సమయం ఇవ్వాలని ఎన్నికల సంఘాన్ని కోరాం. ఢిల్లీలో పోలీసుల దూకుడుపై ఈసీ చర్యలు తీసుకుంటుందని ఆశిస్తున్నాం” అని సౌరభ్ భరద్వాజ్ అన్నారు. పార్టీ కార్యాలయానికి సీల్ వేయడం ఏంటీ అని మంత్రి అతిషి మండిపడ్డారు. ఇది రాజ్యాంగాన్ని విస్మరించడమేనని విరుచుకుపడ్డారు. ఓ జాతీయ పార్టీకి తన కార్యకర్తలు కార్యాలయానికి వెళ్లకుండా ఆంక్షలు విధిస్తారా..? ఇదే అంశంపై ఫిర్యాదు చేసేందుకు ఎన్నికల సంఘాన్ని సమయం కోరామని అన్నారు.
కేజ్రీవాల్ పిటిషన్ అత్యవసర విచారణకు ఢిల్లీ హైకోర్టు నిరాకరణ
మద్యం స్కాం కేసులో ఈడీ కస్టడీలో ఉన్న ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు. రౌస్ అవెన్యూ కోర్టు తీర్పును ఆయన సవాల్ చేశారు. పిటిషన్‌ను అత్యవసరంగా విచారించాలని కోరారు. తన అరెస్టు చట్ట విరుద్ధమని పిటిషన్‌లో పేర్కొన్నారు. అయితే, ఈ పిటిషన్‌ను అత్యవసరంగా విచారించేందుకు ఢిల్లీ హైకోర్టు నిరాకరించింది. హౌలీ పండుగ నేపథ్యంలో ఈ నెల 26 వరకు కోర్టుకు సెలవులు ఉండనున్నాయి. ఈ క్రమంలో బుధవారం పిటిషన్‌ను విచారించనుంది.
బీజేపీ ఖాతాలో మద్యం స్కాం కేసు నిందితుడి డబ్బు: నడ్డాను అరెస్ట్ చేయాలి
మద్యం స్కాం కేసు నిందితుడి డబ్బు బీజేపీ ఖాతాలోకి వెళ్లిందని ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) ఆరోపించింది. ఎలక్టోరల్ బాండ్లుగా ఆయన నుంచి కోట్లాది డబ్బు తీసుకున్న బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డాను అరెస్ట్ చేయాలని ఆప్ మంత్రి అతిషి డిమాండ్ చేశారు. మద్యం కుంభకోణం కేసులో సీఎం అరవింద్ కేజ్రీవాల్‌ను అరెస్ట్ చేసిన నేపథ్యంలో కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీతో పాటు దర్యాప్తు సంస్థల తీరుపై ఆమె మండిపడ్డారు. ఈ కేసుపై రెండేండ్లుగా దర్యాప్తు చేస్తున్న సీబీఐ, ఈడీ ఇప్పటి వరకు అరెస్ట్ చేసిన ఏ ఆప్ నాయకుడి నుంచి డబ్బుకు సంబంధించిన ఆధారాలు చూపించలేకపోయాయని అతిషి తెలిపారు. ఆప్‌కు చెందిన ఏ నేత, మంత్రి, కార్యకర్త నుంచి ఎలాంటి డబ్బును దర్యాప్తు సంస్థలు స్వాధీనం చేసుకోలేదని ఆమె గుర్తు చేశారు. కాగా, లిక్కర్ పాలసీ కేసులో గత ఏడాది నవంబర్‌లో ఈడీ అరెస్ట్ చేసిన అరబిందో ఫార్మాకు చెందిన శరత్ చంద్రా రెడ్డి వాంగ్మూలం ఆధారంగా ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్‌ను అరెస్ట్ చేశారని మంత్రి అతిషి తెలిపారు. కేజ్రీవాల్‌ను తాను ఎప్పుడూ కలవలేదని, మాట్లాడలేదని, ఆప్‌తో తనకు ఎలాంటి సంబంధం లేదని శరత్ చంద్రారెడ్డి గతంలో స్పష్టంగా చెప్పారన్నారు. అయితే చాలా కాలం జైలులో ఉన్న తర్వాత అప్రూవర్‌గా మారిన ఆయన తన స్టేట్‌మెంట్‌ను మార్చారని ఆమె ఆరోపించారు. మరోవైపు లిక్కర్ స్కాం కేసుకు సంబంధించిన డబ్బు ఎక్కడుంది? ఆ మనీ జాడ ఎక్కడీ అని మంత్రి అతిషి ప్రశ్నించారు. ఆ డబ్బు బీజేపీ బ్యాంకు ఖాతాలోకి వెళ్లిందని ఆమె ఆరోపించారు. ‘ఆయన (శరత్ చంద్రా రెడ్డి) రూ. 4.5 కోట్ల విలువైన ఎలక్టోరల్ బాండ్‌లు బీజేపీకి ఇచ్చాడు. ఆ తరువాత రూ. 55 కోట్ల విలువైన బాండ్లను కూడా ఇచ్చాడు. ”లిక్కర్ స్కామ్ నిందితుడి డబ్బులు బీజేపీ ఖాతాలో కనిపించాయి. ప్రధాని మోడీ, ఈడీకి నేను సవాల్ చేస్తున్నా. బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీి నడ్డాను అరెస్టు చేయాలి’ అని అతిషి డిమాండ్ చేశారు.గుజరాత్ ఇన్‌చార్జి, ఆప్ ఎమ్మెల్యే ఇంటిపై ఈడీ దాడిఆప్ ఎమ్మెల్యే గులాబ్ సింగ్ యాదవ్ ఇంటిపై ఈడీ దాడి చేసింది. ప్రస్తుతం ఈడీ అధికారులు ఆయన నివాసంలో సోదాలు నిర్వహిస్తున్నారు. కాగా, ఈడీ దాడులపై ఆప్ నాయకుడు, ఢిల్లీ మంత్రి సౌరభ్ భరద్వాజ్ స్పందించారు. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ, ప్రతిపక్షాన్నే జైలుకు పంపించాలని కృతనిశ్చయంతో ఉన్నట్టు దేశ ప్రజలకే కాదు మొత్తం ప్రపంచానికి అర్ధమైందని చెప్పారు. ప్రజల ప్రాథమిక హక్కుల హననంతోపాటు ప్రతిపక్షాలను అంతమొందించడంతో ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం ప్రస్తుతం నియంతృత్వంలోకి వెళ్తున్నదని విమర్శించారు. ఓ అక్రమ కేసులో తమ పార్టీకి చెందిన నలుగురు అగ్రనాయకులు ప్రస్తుతం జైలులో ఉన్నారని చెప్పారు. తాము గుజరాత్‌లోని పార్లమెంట్ స్థానాల్లో పోటీ చేస్తున్నామని, ఈ నేపథ్యంలోనే ఆ రాష్ట్ర ఇన్‌చార్జి, ఆప్ ఎమ్మెల్యే గులాబ్ సింగ్‌పై ఈడీ దాడులు నిర్వహిస్తున్నదని విమర్శించారు.
ఆ పోలీసు అధికారి నాతో దురుసుగా ప్రవర్తించాడు: కేజ్రీవాల్
ఢిల్లీ పోలీసు అధికారి ఒకరు తనతో దురుసుగా ప్రవర్తించారని ఢిల్లీ సీఎం, ఆప్ నేత అరవింద్ కేజ్రీవాల్ ఆరోపించారు. గతంలో కోర్టు ఆవరణలో ఢిల్లీ మాజీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియా పట్ల దురుసుగా ప్రవర్తించింది కూడా ఈ పోలీసు అధికారే అని కేజ్రీవాల్ పేర్కొన్నారు. ఈ మేరకు ఆయనను తన భద్రతా వలయంలోని సిబ్బంది నుంచి తొలగించాలని ఢిల్లీ రౌస్ అవెన్యూ కోర్టును కోరారు. ఈ మేరకు కోర్టులో దరఖాస్తు దాఖలు చేశారు. లిక్కర్ స్కాం కేసులో రిమాండ్ దరఖాస్తుపై విచారణ నిమిత్తం ఈడీ అధికారులు కోర్టుకు తీసుకెళ్తున్న సమయంలో అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ ఏకే సింగ్ తనతో దురుసుగా ప్రవర్తించారని దరఖాస్తులో పేర్కొన్నారు. అయితే ఈడీ సిబ్బంది మాత్రం తనతో మర్యాదగానే వ్యవహరించారని వెల్లడించారు. కాగా, గతేడాది ఇదే కోర్టు ఆవరణలో విలేకరులు సిసోడియాను ప్రశ్నిస్తున్న సమయంలో ఏకే సింగ్ తన మెడ పట్టుకుని బలవంతంగా నెట్టారు. దీనిపై సిసోడియా ఢిల్లీ పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే ఏకే సింగ్ చర్యను ఢిల్లీ పోలీసులు సమర్థించారు.
కేజ్రీవాల్ అరెస్టుపై జర్మనీ ప్రకటన..
ఆక్షేపించిన కేంద్రం
కేజ్రీవాల్ అరెస్టుపై జర్మనీ విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి ఓ అధికారిక ప్రకటన విడుదల చేశారు. ”భారత్ ప్రజాస్వామ్య దేశం. ఆరోపణలు ఎదుర్కొంటున్న కేజ్రీవాల్ న్యాయపరమైన, నిష్పాక్షికమైన విచారణకు అర్హులు. అందుబాటులో ఉన్న చట్టపరమైన మార్గాలను ఎలాంటి పరిమితులు లేకుండా ఆయన వినియోగించుకోవచ్చు” అని ఆ ప్రకటనలో పేర్కొన్నారు. దీనిపై కేంద్రం అభ్యంతరం వ్యక్తం చేసింది.ఢిల్లీలోని జర్మనీ రాయబారి డిప్యూటీ హెడ్ జార్జ్ ఎంజ్‌వీలర్‌ను కేంద్ర విదేశాంగ శాఖ పిలిచి వివరణ అడిగింది. ఇది మా అంతర్గత వ్యవహారాల్లో జోక్యమే అవుతుందని మండిపడింది.
‘అరెస్టు ఆశ్చర్యపర్చలేదు’
– కేజ్రీవాల్ సందేశాన్ని వినిపించిన సతీమణి
మద్యం పాలసీకి సంబంధించిన కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ అధికారులు గురువారం రాత్రి కేజ్రీవాల్‌ను అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. నిన్న కోర్టులో హాజరుపర్చగా.. న్యాయస్థానం ఏడు రోజుల కస్టడీకి అప్పగించింది. ఈ క్రమంలోనే జైలు నుంచి ఆయన పంపిన సందేశాన్ని సీఎం సతీమణి సునీత కేజ్రీవాల్ చదివి వినిపించారు. తనను సుదీర్ఘకాలం కటకటాల వెనక ఉంచే జైలే లేదని ముఖ్యమంత్రి అన్నారు.