ఈ ఎన్నికలు ప్రజాస్వామ్యానికి కీలకం

CPI (M) General Secretary Yechury– ఇండియా కూటమికి పెరుగుతున్న ప్రజాదరణ
– సానుకూల దిశలో సీట్ల సర్దుబాటు చర్చలు
– కేంద్ర ఆర్థిక విధానాలతో ప్రజల జీవితాలు ధ్వంసం
– కమలదళంలో నిరాశా నిస్పృహలు
– ఈడీ, సీబీఐ వంటి ఏజెన్సీలు దుర్వినియోగం
– 400 సీట్లు వస్తాయన్న వారిలో ఈ కలవరమెందుకు?
– స్వేచ్ఛగా, నిస్పక్షపాతంగా ఎన్నికలు జరిగితే బీజేపీ అంచనాలు తప్పుతాయి : పీటీఐ ఇంటర్వ్యూలో సీపీఐ (ఎం) ప్రధాన కార్యదర్శి ఏచూరి
పదేండ్లుగా రాజ్యాంగ విలువలపై దాడి
రాబోయే సార్వత్రిక ఎన్నికలు భారత ప్రజాస్వామ్యానికి ఎంతో కీలకమైనవని సీపీఐ (ఎం) ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి తెలిపారు. దేశ లౌకిక ప్రజాస్వామ్య స్వభావాన్ని కాపాడుకుంటామా లేదా అనే విషయాన్ని ఈ ఎన్నికలు నిర్ణయిస్తాయని ఆయన చెప్పారు. గత పది సంవత్సరాలుగా ప్రజాస్వామ్య మౌలిక మూల స్తంభాలపై దాడి జరుగుతూనే ఉన్నదని పీటీఐ వార్తాసంస్థకు బుధవారం ఇచ్చిన ఇంటర్వ్యూలో ఏచూరి విమర్శించారు.

న్యూఢిల్లీ : ప్రతిపక్ష ఇండియా కూటమికి ప్రజల్లో మంచి ఆదరణ లభిస్తోందని సీపీఐ (ఎం) ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి అన్నారు. అయితే కూటమిలోని అన్ని పార్టీలూ తమ స్థాయికి తగిన విధంగా కృషి చేయాలని, అంతా దాని పైనే ఆధారపడి ఉన్నదని చెప్పారు. ఇవి దేశ మనుగడకు సంబంధించిన ఎన్నికలని వ్యాఖ్యానించారు. ‘మనం మన లౌకిక ప్రజాస్వామ్య స్వభావాన్ని కాపాడుకుంటామా లేదా అనే విషయాన్ని ఈ ఎన్నికలు నిర్ణయిస్తాయి. ఎందుకంటే గత పది సంవత్సరాల్లో అనేక తీవ్రమైన ఉల్లంఘనలు జరిగాయి. దీనిని రాజ్యాంగ విలువల పైన, రాజ్యాంగ మూల స్తంభం పైన జరిగిన దాడిగా నేను భావిస్తాను. లౌకిక ప్రజాస్వామ్యం అనేది ఓ మూల స్తంభం. ఆర్థిక సార్వభౌమత్వం, సామాజిక న్యాయం, ఫెడరలిజం అనేవి ఇతర స్తంభాలు’ అని వివరించారు.
ప్రజా హక్కుల పరిరక్షణే కూటమి లక్ష్యం
‘మనం మన భారత రిపబ్లిక్‌ లౌకిక ప్రజాస్వామ్య స్వభావాన్ని కాపాడుకోగలమా లేక అది మరింతగా హరించుకుపోవడాన్ని అనుమతిస్తామా? ప్రస్తుత పరిస్థితుల్లో ఇవే ముఖ్యమైన అంశాలు’ అని ఏచూరి చెప్పారు. రాజ్యాంగాన్ని, ప్రజాస్వామ్యాన్ని కాపాడడానికే ఇండియా కూటమి ఏర్పడిందని ఆయన తెలిపారు. కూటమిలోని భాగస్వామ్య పక్షాలకు ప్రజల్లో లోతైన పునాదులు ఉన్నాయని అన్నారు. ‘రాజ్యాంగాన్ని, ప్రజాస్వామ్యాన్ని, ప్రజల మానవ-పౌర స్వేచ్ఛ హక్కులను పరిరక్షించి, వాటిని మరింత బలోపేతం చేయాల్సిన అవసరం ఇప్పుడు ఉంది. ఆ ఉద్దేశంతోనే ఇండియా కూటమి ఏర్పడింది. ప్రజల హక్కులకు రాజ్యాంగం గ్యారంటీ ఇస్తోంది. అత్యంత ముఖ్యమైన విషయాలేమంటే రాజ్యాంగం కల్పించిన సమానత్వపు హక్కు. న్యాయం పొందే హక్కు, వీటికి కూటమి భాగస్వామ్య పక్షాలు కట్టుబడి ఉన్నాయి’ అని వివరించారు.
విలువలే ప్రధానం
ఇండియా కూటమిలో 40 ప్రతిపక్ష పార్టీలు ఉన్నాయి. గత సంవత్సరం జూన్‌ 18న పాట్నాలో జరిగిన ప్రతిపక్ష పార్టీల సమావేశంలో కూటమి ఆవిర్భవించింది. అయితే ఆ తర్వాత బీహార్‌లో జేడీయూ, ఉత్తరప్రదేశ్‌లో ఆర్‌ఎల్‌డీ పార్టీలు కూటమి నుండి నిష్క్రమించాయి. సీట్ల సర్దుబాటులో జాప్యం కారణంగా కూటమికి ఎదురు దెబ్బలు తగిలాయి. దీనిపై ఏచూరి స్పందిస్తూ సీట్ల సర్దుబాటుపై సానుకూల దిశగా చర్చలు జరుగుతున్నాయని, అవి త్వరలోనే ముగుస్తాయని చెప్పారు. ‘ఎన్నికల రాజకీయాలు, సీట్ల సర్దుబాట్లు, పొత్తులు అనేవి సంఖ్యలకు సంబంధించిన లెక్కలు కావు. అవి రాజకీయాలు. రెండు రెండు కలిస్తే నాలుగు కావడం, వాటిని తీసేయడం కాదు. కాబట్టి ఎవరు వెళుతున్నారు, ఎవరు వస్తున్నారన్నది ప్రశ్న కాదు. ఏ విలువలపై ఎవరు చేరుతున్నారన్నదే ఇక్కడ ప్రధానం’ అని వ్యాఖ్యానించారు.
వినాశకర ఆర్థిక విధానాలే కారణం
‘మీరు ఎన్నికలను ఓ వ్యాపారంగానే భావిస్తే ఫిరాయింపులో లేదా అలాంటివేవో జరుగుతాయి. అది వేరే విషయం. కానీ అవి రాజకీయాలు కావు’ అని ఏచూరి చెప్పారు. ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ప్రజల ముందున్న సమస్యలను ఆయన ప్రస్తావిస్తూ జీవనోపాధే ఇప్పుడు ప్రధాన విషయంగా ఉన్నదని అన్నారు. ‘ప్రజలను ఆందోళనకు గురి చేస్తున్న ప్రధాన సమస్య వారి జీవన ప్రమాణాలు. గత పది సంవత్సరాల కాలంలో ఉపాధి స్థాయిల్లో మెరుగుదల లేదని గణాంకాలు చెబుతున్నాయి. ఆర్థిక విధానాలే ఈ వినాశనానికి కారణం. ఆర్థిక వ్యవస్థనే కాదు… ప్రజల జీవితాలను కూడా ఇవి ధ్వంసం చేశాయి. ఉపాధి కూడా ప్రజల ముందు ప్రధాన సమస్యగా ఉంది. మతపరమైన ఏకీకరణ, విద్వేషాల వ్యాప్తి, విషపూరిత ప్రచారం ద్వారా ప్రజలను ప్రభావితం చేసేందుకు బీజేపీ ప్రయత్నిస్తోంది’ అని ఆరోపించారు. అయితే ఈ ప్రయత్నాలు ఫలించబోవని ఆయన అన్నారు.
నిరాశ దేనికో…?
‘బీజేపీలో నిరాశానిస్పృహలు ఎందుకు? రాష్ట్రాలలో పార్టీలను చీలుస్తున్నారు. ఈడీ, సీబీఐ, కొన్ని సంస్థలను పెద్ద ఎత్తున దుర్వినియోగం చేస్తున్నారు. 370 లేదా 400 స్థానాలకు పైగా గెలుచుకుంటామని ధీమాగా ఉన్న వారు ఎందుకింత నిరాశ పడుతున్నారు? ప్రతిపక్షం బలంగా ఉన్న ప్రతి రాష్ట్రంలోనూ వాటిని చీల్చే పనిలో ఎందుకు ఉన్నారు? వారిని బెదిరిస్తున్నారు. భయపెడుతున్నారు. తమ పార్టీలోకి వచ్చేలా చేసుకుంటున్నారు’ అని ఏచూరి మండిపడ్డారు. ప్రతిపక్ష నేతలు బీజేపీలో చేరగానే వారిపై ఉన్న కేసులన్నీ అటకెక్కుతాయని ఆయన వ్యంగ్యోక్తులు విసిరారు. పార్టీలో చేరని వారిని…అంటే వారి ఒత్తిడికి తలొగ్గని వారిని జైలుకు పంపుతారని అన్నారు.
ఇన్ని జరుగుతున్నా ప్రవర్తనా నియమావళి ఉల్లంఘనకు గురవుతోందని ఎన్నికల కమిషన్‌ భావించడం లేదని ఏచూరి విమర్శించారు. ఎన్నికల కమిషన్‌ ఎంత స్వేచ్ఛగా, ఎంత నిస్పక్షపాతంగా ఎన్నికలు నిర్వహిస్తుందన్న విషయంపైనే అంతా ఆధారపడి ఉన్నదని అన్నారు. అప్పుడు బీజేపీ ప్రచారం చేసుకుంటున్న దానికి భిన్నంగా ఎన్నికల ఫలితాలు వస్తాయని ఏచూరి తెలిపారు.
స్వేచ్ఛాయుత ఎన్నికలే ప్రధానం
370 స్థానాలు గెలుచుకోవాలన్న బీజేపీ లక్ష్యం గురించి ప్రశ్నించగా ఎన్నికలు ఎంత స్వేచ్ఛగా, నిస్పక్షపాతంగా జరుగుతాయన్న విషయంపై అది ఆధారపడి ఉంటుందని ఏచూరి తెలిపారు. ‘ఎన్నికలు స్వేచ్ఛగా, నిస్పక్షపాతంగా జరుగుతాయా లేదా అనే దానిపై అది ఆధారపడి ఉంటుంది. ఎన్నికల బాండ్లు, పీఎం కేర్స్‌…ఇలా అన్నింటి నుండి వారికి కోట్లాది రూపాయలు వచ్చాయి. ప్రపంచంలోనే ఇవి అత్యంత ఖరీదైన ఎన్నికలు కాబోతున్నాయి. ఈవీఎంలపై కూడా అనేక అనుమానాలు ఉన్నాయి. వీవీపాట్లు, ఈవీఎంలపై సందేహాలు నివృత్తి చేసుకునేందుకు ఎన్నికల కమిషన్‌ను కలవాలని మా పార్టీ ప్రతినిధి బృందం భావించింది. అయితే విచారకరమైన విషయమేమంటే ఎన్నికల కమిషన్‌ మా అభ్యర్థనను అంగీకరించలేదు. ఇక్కడ అన్నీ ప్రశ్నలే. స్వేచ్ఛగా, నిస్పక్షపాతంగా ఎన్నికలు జరగడమంటే అందరికీ సమానావకాశాలు లభించడం. అయితే ఇక్కడ అలా లేదు. ఇవాళ కూడా ప్రభుత్వ విమానాలను దుర్వినియోగం చేస్తున్నారు. రాజకీయ సభలకు ప్రధానిని, ఇతర నాయకులను తీసికెళ్లడానికి సాయుధ దళాల హెలికాప్టర్లు వాడుతున్నారు” అని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.

Spread the love