జగిత్యాల మైనర్ల మత్తు వెనుక..

Behind the intoxication of minors..– ఆ దిశగా గుట్టుగా సాగుతున్న పోలీసుల విచారణ?
– రంగంలోకి నార్కోటిక్స్‌ కంట్రోల్‌ బ్యూరో దిగినట్టు సమాచారం
– గంజాయి చాక్లెట్లతో బాలికలను మత్తుకు బానిసలుగా చేస్తూ..
– రేవ్‌పార్టీలకూ తరలించిన సూత్రదారులెవరనే దానిపై కూపీ..
– గంజాయి తరలిస్తున్న ఐదుగురు విద్యార్థుల అరెస్ట్‌
– పాఠశాల స్థాయిలోనే పేట్రేగుతున్న ‘నిషా’నిచ్చే స్నేహ ‘మత్తు’ హస్తాలు
నవతెలంగాణ – కరీంనగర్‌ ప్రాంతీయ ప్రతినిధి
జగిత్యాల జిల్లాలో గంజాయికి బానిసలై.. రేవ్‌ పార్టీల వరకూ వెళ్లిన బాలిక ఉదంతం ఇప్పుడు సంచలనంగా మారింది. నిండా 15ఏండ్లు కూడా లేని బాలికలను సెక్స్‌కూపంలోకి దింపేందుకు పాఠశాల స్థాయిలోనే ‘నిషా’నిచ్చే స్నేహ ‘మత్తు’ హస్తాలు అందిస్తూ గంజాయి సప్లయి చేస్తున్నదెవరనే దానిపై గుట్టుగా విచారణ సాగుతోంది. నార్కోటిక్స్‌ కంట్రోల్‌ బ్యూరో సైతం రంగంలోకి దిగి అసలు సూత్రదారులెవరనే దానిపై కూపీ లాగుతున్నట్టుగా తెలుస్తోంది. ఏదేమైనా పోలీసుల కండ్లుగప్పి రూటుమార్చి కొత్తపంథాలో వేళ్లూనుకుంటున్న గంజాయి సప్లయి ఇప్పుడు ఏకంగా ‘ఉప్పెన’లా పాఠశాల విద్యార్థుల జీవితాలను ముంచేస్తున్న పరిస్థితి ఉమ్మడి కరీంనగర్‌ జిల్లాను ఆందోళనకు గురి చేస్తోంది.
జగిత్యాల ఉదంతాన్ని క్షుణ్ణంగా పరిశీలిస్తే.. పేద, మధ్యతరగతి కుటుంబాల నుంచి వచ్చే బాలికలే టార్గెట్‌గా కొన్ని సెక్స్‌రాకెట్‌ ముఠాలు ఉమ్మడి కరీంనగర్‌ జిల్లాలో దిగినట్టు తెలుస్తోంది. పాఠశాలస్థాయి బాలురకు ముందుగా గంజాయి చాక్లెట్లను అలవాటు చేసి, వారితో బాలికలకూ చేరవేస్తున్నట్టు కనిపిస్తోంది. ఇలా ఆ మత్తుకు బానిసలయ్యే బాలికలను ‘గంజాయి కోసం అడ్డదారులు తొక్కేలా’ ప్లాన్‌ చేస్తున్నట్టుగా కనిపిస్తోంది. ఓ వైపు గంజాయి, మరోవైపు పెద్దమొత్తంలో డబ్బు ఆశ చూపుతూ వారిని హైదరాబాద్‌ లాంటి ప్రాంతాల్లో జరిగే సంపన్నవర్గాల రేవ్‌ పార్టీలకు పంపుతున్నట్టు కనిపిస్తోంది. నిండా 15, 16 ఏండ్లు కూడా నిండని బాలికలతో అర్ధనగ నృత్యాలతోపాటు వ్యభిచారమూ చేయిస్తూ రూ.లక్షల్లో గడిస్తున్నట్టుగా తెలుస్తోంది. ఈ కోణంలోనూ గుట్టుగా విచారణ చేస్తున్న పోలీసులు అసలు సూత్రదారులు ఎవరనే దానిపై కూపీ లాగుతున్నట్టుగా తెలుస్తోంది. నార్కోటిక్స్‌ కంట్రోల్‌ బ్యూరో సైతం రంగంలోకి దిగినట్టుగా సమాచారం. మరోవైపు గంజాయి మత్తే కాకుండా డ్రగ్స్‌ సైతం జగిత్యాలలో విచ్చలవిడిగా విక్రయాలు జరిగినట్టు ఇటీవల నార్కోటిక్స్‌ కంట్రోల్‌ బ్యూరో విచారణలో తేలింది. జగిత్యాలలో ఓ ప్రయివేటు ఆస్పత్రి వైద్యుడు మత్తు ఇచ్చే డ్రగ్స్‌ విచ్చలవిడిగా విక్రయించినట్టు గుర్తించి వారం రోజుల కిందట పోలీసులు అరెస్టు చేశారు. ఆ డ్రగ్స్‌కు మైనర్ల మత్తుకు ఏమైనా సంబంధం ఉందా? అనే దానిపై పోలీసులు, నార్కోటిక్స్‌ కంట్రోల్‌ బ్యూరో విచారణలో వాస్తవాలు వెలుగుజేసే అవకాశం ఉంది.
గంజాయి బానిసల్లో బాలికలు
ఇటీవల జగిత్యాల జిల్లాలో బాలికలు గంజాయికి బానిసలయ్యారంటూ వస్తున్న వార్తల నేపథ్యంలో అక్కడి స్థానికుల్లో వెలుగుజూస్తున్న పలు విషయాలు విస్తుపోయేలా చేస్తున్నాయి. అందులో ఓ ఉదంతాన్ని చూస్తే.. జగిత్యాల జిల్లా కేంద్రంలోని ఓ ప్రభుత్వ పాఠశాల పదో తరగతి విద్యార్థిని, మరో విద్యార్థితో కలిసి గంజాయికి బానిసైందని, నిండా 15ఏండ్లు కూడా లేని వారిద్దరూ పెండ్లి కూడా చేసుకున్నారని తెలుస్తోంది. గంజాయి ఇవ్వడం లేదని సదరు బాలున్ని వదిలేసిన బాలిక గంజాయి అలవాటున్న మరో యువకుడికి దగ్గరైంది. బాలిక ప్రవర్తనలో మార్పును గమనించిన తల్లిదండ్రులు ఓ యువకుడి వల్లే తమ బిడ్డ పరిస్థితి దయనీయంగా ఉందంటూ పోలీసులకు ఫిర్యాదు చేయగా.. సదరు యువకున్ని మందలించి ఎలాంటి కేసూ పెట్టకుండా ఖాకీలు వదిలేసినట్టు చర్చ సాగుతోంది. పోలీసులు స్పందించకపోవడంతో సదరు బాలిక తండ్రి చైల్డ్‌వెల్ఫేర్‌ కమిటీని సంప్రదించగా.. వారు బాధితురాలిని విచారించగా దాదాపు 10మంది బాలికలు గంజాయి మత్తుకు బానిసైనట్టుగా గుర్తించినట్టు సమాచారం. ప్రస్తుతం సదరు బాలిక వారి సంరక్షణలో ఉన్నట్టుగా తెలుస్తోంది.
ఇలా ఈ బాలికలు గంజాయి బ్యాచ్‌తో కలిసి హైదరాబాద్‌ రేవ్‌ పార్టీలకు వెళ్లడం, రాత్రి ఇంటి నుంచి వెళ్లి రెండ్రోజుల తరువాత రావడం వంటి పరిణామాలను గమనించిన తల్లిదండ్రుల్లో పలువురు పోలీసులకు కలవగా.. మరికొందరు పరువు పోతుందన్న భయంతో లోలోపలే కుమిలిపోతున్నట్టుగా తెలుస్తోంది. ప్రస్తుతం మత్తుకు బానిసై అపస్మారక స్థితిలో స్వధార్‌ హౌంకు చేరిన బాలిక నుంచి వివరాలు సెకరించే పనిలో నిమగమైనట్టు తెలుస్తోంది. ఆ బాలిక సరిగా వివరాలు చెప్పే స్థితిలో లేకపోవడంతో చైల్డ్‌ వెల్ఫేర్‌ కమిటీ సభ్యులు సమగ్ర విచారణ కోసం పోలీసులను ఆశ్రయించినట్టుగా సమాచారం.
సీలేరు టూ జగిత్యాల..
గంజాయి సప్లయి ముఠాను అరెస్టు చేసిన పోలీసులు

విశాఖపట్నం, సిలేరు నుంచి గంజాయి తీసుకొచ్చి జగిత్యాల జిల్లాలో విక్రయిస్తున్న ముఠాను పోలీసులు శనివారం అరెస్టు చేశారు. వారు గంజాయి సేవించడంతోపాటు కిలోలకొద్దీ తీసుకొచ్చి ప్యాకెట్ల రూపంలో అమ్ముతూ సొమ్ము చేసుకుంటున్న విషయాన్ని గుర్తించారు. ఈమేరకు ఎస్పీ సన్‌ప్రీత్‌ సింగ్‌ విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి వివరాలు వెల్లడించారు. ఈయన తెలిపిన వివరాల ప్రకారం.. జిల్లాలోని రాయికల్‌కు చెందిన పెనుగొంగ గణేష్‌, అదే ఏరియాలోని ఆల్యానాయక్‌ తండాకు చెందిన మాలవత్‌ సతీష్‌కుమార్‌, మల్లాపూర్‌ మండలం రేగుంటకు చెందిన రావులకరి నితిన్‌, రాయికల్‌ మండలం కుమ్మరపల్లికి చెందిన తోట అజరు, ఉప్పు మడుగుకు చెందిన ఆవుల సాగర్‌ గంజాయికి అలవాటు పడ్డారు. వీరు కొంతకాలంగా విశాఖపట్నం, సిలేరు నుంచి గంజాయి ముఠా చానెల్‌ తెలుసుకుని ద్విచక్రవాహనాలపై అక్కడికి వెళ్లి కిలోల కొద్దీ తీసుకొస్తున్నారు. ఇదే క్రమంలో 10కిలోల గంజాయిలో కొంత దాచి 4కిలోల సరుకును ప్యాకెట్ల రూపంలో మార్చేందుకు శనివారం ఉదయం మల్లాపూర్‌ అటవీ ప్రాంతానికి బయల్దేరారు. పక్కా సమాచారం మేరకు ఎస్పీ ఆదేశాల మేరకు మెట్‌పల్లి డిఎస్పీ ఉమామహేశ్వర్‌ పర్యవేక్షణలో సీఐ నవీన్‌, మల్లాపూర్‌ ఎస్‌ఐ కిరణ్‌కుమార్‌ రేగుంట-గొర్రెపల్లి మధ్యగల అటవీదారిలో వాహనాలు తనిఖీ చేశారు. దీంతో బైక్‌పై వెళ్తున్న నితిన్‌ వద్ద గంజాయిని గుర్తించిన పోలీసులు తమదైన శైలిలో విచారించారు. దీంతో నితిన్‌ సహా ఈ గంజాయి తీసుకొచ్చి అమ్ముతున్న ముఠాలోని గణేష్‌, సతీష్‌కుమార్‌, తోటఅజరు, సాగర్‌లను అరెస్టు చేశారు. వారి నుంచి సెల్‌ఫోన్లు, 10కిలోల గంజాయి, ద్విచక్రవాహనాన్ని స్వాధీనం చేసుకున్నారు.

Spread the love