అనూహ్య స్పందన

Unexpected response– సమ్మె, గ్రామీణ బంద్‌ విజయవంతం
– కార్మిక వాడల్లో ఎక్కడికక్కడ నిరసన
– స్వచ్ఛందంగా బంద్‌ పాటించిన వ్యాపార సంస్థలు
– స్తంభించిన ప్రభుత్వ, ప్రయివేట్‌ కార్యకలాపాలు
– రాష్ట్ర వ్యాప్తంగా ట్రాక్టర్‌, బైక్‌ ర్యాలీలు, మహాప్రదర్శనలు
– కలెక్టరేట్ల ఎదుట ధర్నాలు
కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం అనుసరిస్తున్న కార్మిక, రైతు ప్రజా వ్యతిరేక విధానాలను నిరిసిస్తూ కేంద్ర కార్మిక సంఘాలు, సంయుక్త కిసాన్‌ మోర్చా ఇచ్చిన పిలుపులో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా గ్రామీణ బంద్‌, సమ్మెకు అనూహ్య స్పందన లభించింది. రాష్ట్ర వ్యాప్తంగా సమ్మె, గ్రామీణ బంద్‌ విజయవంతమైంది. రాజకీయ పార్టీలు, ప్రజాసంఘాలు, విద్యార్థి, కార్మిక సంఘాలు, ప్రభుత్వరంగ సంస్థల కార్మికులు, ఉద్యోగులు సమ్మెలో పాల్గొన్నారు. పారిశ్రామిక వాడల్లో కంపెనీలు, కార్కానాల్లో పనిచేస్తున్న కార్మికులు విధులను బహిష్కరించి సమ్మెలో పాల్గొన్నారు. రైతులు, కూలీలు పని ప్రదేశాల్లోనే నిరసన వ్యక్తం చేశారు. పలుచోట్ల ట్రాక్టర్లు, ఆటోలతో ర్యాలీ నిర్వహించారు. రైతు బజార్లు, రైస్‌ మిల్లులు, మార్కెట్లలో రైతులు, కార్మికులు సమ్మెలో పాల్గొన్నారు. ఉపాధి హామీ కూలీలు సైతం ఎర్రజెండాలు చేతబూని సమ్మెలో పాల్గొన్నారు. అన్ని మున్సిపాలిటీలు, గ్రామ పంచాయతీల్లోనూ కార్మికులు సమ్మె చేశారు. కలెక్టరేట్ల ఎదుట ధర్నా చేశారు.
నవతెలంగాణ- విలేకరులు
ఉమ్మడి మెదక్‌ జిల్లా వ్యాప్తంగా సమ్మె, గ్రామీణ బంద్‌ సక్సెస్‌ అయ్యింది. పట్టణ కేంద్రాల్లో ఊరేగింపులు, సభలు, ధర్నాలు నిర్వహించాయి. సిద్దిపేట, సంగారెడ్డి, పటాన్‌చెరు పట్టణాల్లో వేలాది మంది కార్మికులు బైక్‌ర్యాలీ నిర్వహించారు. పీఎస్‌ఆర్‌ గార్డెన్‌లో జరిగిన సభలో సీఐటీయూ రాష్ట్ర అధ్యక్షులు చుక్క రాములు పాల్గొని మాట్లాడారు. పటాన్‌చెరులో జరిగిన సమ్మెలో సీఐటీయూ రాష్ట్ర ఉపాధ్యక్షులు జె.మల్లికార్జున్‌ పాల్గొన్నారు.
హన్మకొండ జిల్లా కలెక్టరేట్‌ వద్ద మహాధర్నాకు ముందు కార్మికులు మహా ప్రదర్శన నిర్వహించారు. ధర్నాతో రెండు గంటలపాటు కలెక్టరేట్‌ దద్దరిల్లింది. మున్సిపల్‌ పారిశుధ్య కార్మికులు, స్వచ్ఛ ఆటో కార్మికులు, ఫిల్టర్‌ బట్టి కార్మికులు, మలేరియా కార్మికులు, హార్టికల్చర్‌ కార్మికులు, పారిశుధ్య కార్మికులు సమ్మెలో పాల్గొన్నారు. వరంగల్‌ రీజియన్‌ జేఏసీ ఆధ్వర్యంలో వరంగల్‌ -1డిపో ముందు గేటు ఎదుట ధర్నా చేశారు. వరంగల్‌ జిల్లాలోని రైల్వే స్టేషన్‌ నుంచి పోచమ్మ మైదాన్‌ వరకు భారీ ర్యాలీ, మాహాప్రదర్శన నిర్వహించారు. సీకేఎం ఆస్పత్రి కార్మిక సంఘాల నాయకులు, వరంగల్‌ మహానగర పాలక సంస్థ కార్మిక సంఘాల నాయకులు సమ్మెలో పాల్గొన్నారు. విద్యార్థి సంఘాల అధ్వర్యంలో ఎంజీఎం సెంటర్‌లో నిరసన వ్యక్తం చేశారు. మహబూబాబాద్‌ జిల్లా కేంద్రంలో బంద్‌, భారీ ర్యాలీ నిర్వహించారు. జయశంకర్‌-భూపాలపల్లి జిల్లా కేంద్రంతోపాటు 12 మండలాల్లో ర్యాలీలు, నిరసన వ్యక్తం చేశారు. జనగామ జిల్లా కేంద్రంలోని రైల్వే స్టేషన్‌ నుంచి నెహ్రూ పార్క్‌, అంబేద్కర్‌ చౌరస్తా మీదిగా జిల్లా కలెక్టరేట్‌ వరకు కార్మికులు మహా ప్రదర్శన అనంతరం, ధర్నా చేశారు. ములుగులోనూ ధర్నా జరిగింది.
ఆదిలాబాద్‌ జిల్లా కేంద్రంలో ఆర్‌అండ్‌బీ నుంచి కలెక్టరేట్‌ వరకు ర్యాలీ నిర్వహించారు. ఈ నిరసనలో మాజీ మంత్రి, బీఆర్‌ఎస్‌ జిల్లా అధ్యక్షుడు జోగురామన్న, సీఐటీయూ రాష్ట్ర కమిటీ సభ్యుడు వై.సోమన్న పాల్గొన్నారు. నిర్మల్‌ జిల్లా కేంద్రంలో గాంధీపార్కు నుంచి ఎన్టీఆర్‌ స్టేడియం వరకు మహా ప్రదర్శన నిర్వహించగా సీఐటీయూ రాష్ట్ర కోశాధికారి వంగూరు రాములు పాల్గొన్నారు. మంచిర్యాలలో కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మ దహనం చేయగా.. బైక్‌ ర్యాలీ నిర్వహించారు. కుమురంభీం ఆసిఫాబాద్‌ జిల్లాలో అంబేడ్కర్‌ చౌక్‌ నుంచి కలెక్టరేట్‌ వరకు ర్యాలీ నిర్వహించారు. ఆదిలాబాద్‌ రూరల్‌ మండలం యాపల్‌గూడ వద్ద వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో రాస్తారోకో చేశారు.
ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో గ్రామీణ భారత్‌ బంద్‌, సమ్మె విజయంవంతమైంది. కాటేదాన్‌, రాజేంద్రనగర్‌, కొత్తూరు, షాద్‌నగర్‌ పారిశ్రామిక వాడల్లో కార్మికులు ర్యాలీలు తీశారు. మంచాల మండల పరిధిలోని లోయపల్లి, మంచాల, జాపాల ప్రాంతాల్లో గ్రామీణ బంద్‌ స్వచ్ఛందంగా నిర్వహించారు. షాద్‌నగర్‌లో సీఐటీయూ రాష్ట్ర ఉపాధ్యక్షుడు భూపాల్‌ పాల్గొన్నారు. శంషాబాద్‌లో కేవీపీఎస్‌ రాష్ట్ర అధ్యక్షులు జాన్‌వెస్లీ పాల్గొని కార్మికులనుద్దేశించి ప్రసంగించారు. యాచారంలో ర్యాలీ సందర్భంగా పోలీసులకు, నిరసనకారులకు మధ్య వాగ్వివాదం చోటుచేసుకుంది. చెవెళ్ల, పరిగిలో నిర్వహించిన బంద్‌లో సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు డీజీ నర్సింహారావు పాల్గొన్నారు. హైదరాబాద్‌-బీజాపూర్‌ జాతీయ రహదారిపై రాస్తారోకో చేపట్టారు.ఆదిభట్లలో సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి కె.భాస్కర్‌, ఇబ్రహీంపట్నంలో వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి జగన్‌ పాల్గొన్నారు.
ఖమ్మం జిల్లాలో ఆర్టీసీ డిపోలు, బస్టాండ్‌ వద్ద బస్సులను అడ్డుకున్నారు. వ్యాపార సంస్థలు, హౌటల్లు, పెట్రోల్‌ బంకులు, విద్యా సంస్థలు, చిరు వ్యాపారస్తులు స్వచ్ఛందంగా బంద్‌ పాటించి సహకరించారు. ఖమ్మంలో ఖమ్మం పాత బస్టాండ్‌ అఖిల పక్ష పార్టీ ఆధ్వర్యంలో రాస్తారోకో చేపట్టారు. పట్టణంలో భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా సీఐటీయూ జాతీయ ఉపాధ్యక్షులు యం.సాయిబాబు, అఖిలపక్ష పార్టీల నాయకులు, రైతు సంఘం రాష్ట్ర అధ్యక్షులు పోతినేని సుదర్శన్‌రావు, సీపీఐ జాతీయ నాయకులు, రైతు సంఘం రాష్ట్ర అధ్యక్షులు బాగం హేమంతరావు మాట్లాడారు. భద్రాచలంలో బస్టాండ్‌ సెంటర్లో జరిగిన సభలో మాజీ ఎమ్మెల్యే, కాంగ్రెస్‌ పార్టీ జిల్లా అధ్యక్షులు పోదెం వీరయ్య, సీపీఐ(ఎం) రాష్ట్ర కమిటీ సభ్యులు మచ్చా వెంకటేశ్వర్లు పాల్గొన్నారు.
వనపర్తి జిల్లా కేంద్రంలో, కొత్తకోట మండల కేంద్రంలో ర్యాలీ, మానవహారం చేపట్టారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో సీఐటీయూ రాష్ట్ర ఉపాధ్యక్షులు పి.జయలకిë మాట్లాడారు. నారాయణపేట జిల్లా దామరగిద్ద మండల కేంద్రంలో కార్మిక, ట్రాక్టర్‌ ర్యాలీ నిర్వహించారు. మహబూబ్‌నగర్‌లో ర్యాలీ తీశారు.
నిజామాబాద్‌ జిల్లా కేంద్రంలోని రాజీవ్‌గాంధీ ఆడిటోరియం వద్ద ముందుగా సభ నిర్వహించారు. ఈ సందర్భంగా సీఐటీయూ రాష్ట్ర ఉపాధ్యక్షులు ఎస్‌వి రమ ప్రసంగించారు. కార్మికులు మహాప్రదర్శన చేపట్టారు. కామారెడ్డి జిల్లా కేంద్రంలో మున్సిపల్‌ కార్యాలయం వరకు ర్యాలీ, మున్సిపల్‌ వద్ద బహిరంగ సభ నిర్వహించారు.
నల్లగొండ జిల్లా కేంద్రంలోని క్లాక్‌టవర్‌ సెంటర్‌లో వేలాది మంది కార్మికులతో ధర్నా నిర్వహించారు. ఎఫ్‌సీఐ, బేవరేజెస్‌, పట్టణ ఎగుమతి దిగుమతి హమాలీలు పట్టణంలో బైక్‌ ర్యాలీ తీశారు. మిర్యాలగూడలో బైక్‌ ర్యాలీ నిర్వహించారు. మరోసారి మోడీ అధికారంలోకి వస్తే దేశం వినాశనమే అవుతుందని, ప్రజా వ్యతిరేక విధానాలను ప్రజలు తిప్పికొట్టారని రైతు సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి పిలుపునిచ్చారు. కొండమల్లేపల్లిలో కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మ దహనం చేశారు. సూర్యాపేట జిల్లా కేంద్రంలో కొత్త బస్టాండ్‌ ఎదుట బస్సులు బయటికి పోకుండా నాయకులు అడ్డుకున్నారు. ఈ సందర్భంగా పోలీసులు సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి మల్లు నాగార్జున్‌రెడ్డి సహా పలువుర్ని అరెస్టు చేశారు. అర్వపల్లి మండల కేంద్రంలో ధర్నా చేసిన నాయకులను పోలీసులు అరెస్టు చేశారు. యాదాద్రి భువనగిరి జిల్లా భూదాన్‌ పోచంపల్లి పట్టణ కేంద్రంలో రాస్తారోకో, ర్యాలీ నిర్వహించారు.
కరీంనగర్‌ జిల్లా కేంద్రంలో గీతా భవన్‌ చౌరస్తా నుంచి కలెక్టర్‌ కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించారు. జమ్మికుంటలో నిర్వహించిన కార్యక్రమంలో సీఐటీయూ రాష్ట్ర కార్యదర్శి కూరపాటి రమేష్‌ పాల్గొన్నారు. జగిత్యాల జిల్లా కేంద్రంలో కలెక్టరేట్‌ వరకు ర్యాలీ నిర్వహించి, ధర్నా చేశారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలో గ్రామీణ భారత్‌ బంద్‌ విజయవంతమైంది. పెద్దపల్లి జిల్లా రామగుండం పారిశ్రామిక ప్రాంతంలో సమ్మె ప్రశాంతంగా జరిగింది. సింగరేణి, ఎన్టీపీసీ, ఆర్‌ఎఫ్‌సిఎల్‌తోపాటు వివిధ పరిశ్రమల కార్మికులు సమ్మెలో పాల్గొన్నారు. తెలంగాణ రైల్వే క్యాజువల్‌, కాంట్రాక్ట్‌, అల్‌ హమాలీ వర్కర్స్‌ యూనియన్‌ ఆధ్వర్యంలో నిరసన తెలిపారు. నల్ల బ్యాడ్జీలు పెట్టి నిరసన వ్యక్తం చేశారు. గోదావరిఖని మెయిన్‌ చౌరస్తాలో ధర్నా నిర్వహించారు.
హైదరాబాద్‌ మెహిదీపట్నం టోలిచౌకి చౌరస్తాలో నాంపల్లి, కార్వాన్‌లో బహిరంగ సభ నిర్వహించారు. జేఏసీ ఆధ్వర్యంలో ఆర్టీసీ క్రాస్‌ రోడ్డులోని బస్‌ భవన్‌ నుంచి ట్యాంక్‌ బండ్‌ అంబేద్కర్‌ విగ్రహం వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో ఏఐసీటీయూ రాష్ట్ర అధ్యక్షులు, చంద్రశేఖర్‌ ప్రసాద్‌ పాల్గొన్నారు. హైదరాబాద్‌ ఓవైసీ చౌరస్తా వద్ద జరిగిన ర్యాలీలో సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు ఎండి అబ్బాస్‌ పాల్గొన్నారు.
మేడ్చల్‌ మల్కాజిగిరి జిల్లాలోని వరంగల్‌ జాతీయ రహదారిపై రాస్తారోకో చేశారు. ఏఎస్‌ రావు నగర్‌ నుంచి ఈసీఐఎల్‌ వరకు వందలాది మంది కార్మికులు భారీ ర్యాలీ నిర్వహించారు. చర్లపల్లి పారిశ్రామిక ప్రాంతంలోనూ భారీగా నిరసన ప్రదర్శన చేశారు. కూకట్‌పల్లిలో వీధులలో సీఐటీయూ ఆధ్వర్యంలో ర్యాలీని నిర్వహించి అడ్డాల వద్ద ఈ నిరసన చేపట్టారు. కుత్బుల్లాపూర్‌లో షాపూర్‌ నగర్‌, ఐడీపీఎల్‌, బాచుపల్లి, గండి మైసమ్మలో కార్మికులు పెద్దబత్తున ర్యాలీ నిర్వహించారు. సమ్మెను జయప్రదం చేశారు. ఉప్పల్‌ పారిశ్రామికవాడలో బంద్‌ చేశారు.

Spread the love