గూడు చెదిరింది…ఎర్రదండు కదిలింది 

 – రాష్ట్రవ్యాప్తంగా కలెక్టరేట్లను ముట్టడించిన పేదలు
– మహబూబాబాద్‌లో మళ్ళీ గుడిసెలు కూల్చివేత అయినా…తగ్గేదే లే… అంటూ పిడికిలెత్తిన శ్రామికులు
–  సర్కారు దిగొచ్చేదాకా పోరాటమేనంటూ ప్రజాసంఘాల నేతల హెచ్చరిక
గూడు కోసం రాష్ట్రవ్యాప్తంగా శ్రామికదండు కదిలింది. మాకెందుకు ఇండ్లివ్వరంటూ సర్కారుపై కదం తొక్కింది… మరోవైపు సర్కారు అధికారగణం మహబూబాబాద్‌లో అదే పేదల ఇండ్లపై దాష్టీకానికి ఒడిగట్టింది. బుల్‌డోజర్లు, ప్రొక్లైనర్లు, జేసీబీలతో సర్కారు భూమిలో వేసుకున్న గుడిసెలను నిర్దాక్షిణ్యంగా కూల్చేసింది. నిరాశ్రయులైన మహిళలు, వృద్ధులు, పిల్లల ఆర్తనాదాలు, అరుపులతో కడుపు తరుక్కుపోయేలా ఏడ్చినా, కనికరించిన నాధుడు లేడు. అయినా…వెనక్కి తగ్గేది లేదంటూ ఎర్రజెండాను చేతబట్టి సమరానికి సై అన్నారు శ్రామికజనం. తాడోపేడో తేల్చుకుంటామంటూ భారీగా కలెక్టరేట్లను ముట్టడించి, నిరసనలు తెలిపారు. పేదలకు నీడ కల్పిస్తూ సర్కారు గూడు ఇచ్చేవరకు నిరంతర పోరాటమేనంటూ ఎర్రజెండా సాక్షిగా ఎలుగెత్తి నినదించారు.

పేదల గుడిసెలపై దాష్టీకం
– మహిళలపై లాఠీచార్జి, సొమ్మసిల్లిన మహిళలు..అరెస్ట్‌ చేసిన వారిపై క్రిమినల్‌ కేసులు

నవతెలంగాణ-మహబూబాబాద్‌
రెక్కల కష్టం మీద బతుకుతున్న పేదలు శ్రామికులు నిలువ నీడ కోసం ప్రభుత్వ భూమిలో గుడిసెలు వేసుకుంటే.. వాటిని తొలగించేందుకు వచ్చిన పోలీసులు, అధికారులను పేదలు అడ్డుకోవడంతో.. వారిపై లాఠీచార్జి చేయడంతో పాటు అరెస్టు చేసి, వారిపై క్రిమినల్‌ కేసులు నమోదు చేశారు. ఈ ఘటన సోమవారం మానుకోటలో జరిగింది. ప్రజా సంఘాల ఐక్య పోరాట వేదిక నాయకులు బానోత్‌ సీతారాం, గుడిసెవాసులు చెప్పిన వివరాల ప్రకారం.. వివిధ ప్రాంతాల నుంచి వలస వచ్చి హమాలీ కార్మికులు, అసంఘటిత రంగ కార్మికులుగా జీవనోపాధి పొందుతున్న పేదలు ఎంతో మంది మహబూబాబాద్‌ పట్టణంలో నివసిస్తున్నారు. వారంతా నగరంలో అద్దెలు చెల్లించలేక, నిలువ నీడ కోసం కొరివి రోడ్‌లో ఉన్న ప్రభుత్వ భూమిలో అరునెలల కిందట గుడిసెలు వేసుకొని జీవిస్తున్నారు. కాగా, అందులో కొంత ప్రభుత్వ భూమిని రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారులు ఆక్రమించుకున్నట్టు గుడిసె వాసులు చెప్తున్నారు. కబ్జాదారులకు వత్తాసు పలుకుతున్న జిల్లా అధికార యంత్రాంగం, ప్రజా ప్రతినిధుల ఆదేశాల మేరకు రెవెన్యూ, పోలీస్‌, మున్సిపాలిటీ, ఎక్సైజ్‌, అటవీ, ట్రాన్స్‌పోర్టు శాఖల ఆధ్వర్యంలో ఇప్పటికే ఐదు సార్లు గుడిసెలు కూల్చివేశారు. అయినా వెనుదిరగని పేదలు.. అదే స్థలంలో కర్రలు, తాటాకులు, టార్పాలెన్లు, చీరలు, జాబు కవర్లతో గుడిసెలు వేసుకుని తలదాచుకుంటున్నారు. అది సహించని జిల్లా అధికార యంత్రాంగం.. సోమవారం ఉదయం 8 గంటలకు మరోసారి గుడిసెలపై దాడికి సిద్ధమయ్యారు. ఒక వైపు ఇండ్ల స్థలాల కోసం రాష్ట్రవ్యాప్త ఆందోళనలో భాగంగా జిల్లా కలెక్టరేట్‌ ఎదుట ధర్నా జరుగుతున్న సందర్భంలోనే ఈ దాడి జరగడం గమనార్హం. పోలీస్‌ బెటాలియన్‌ మొత్తం గుడిసెల కూల్చివేతకు రాగా.. గుడిసెలు కూల్చవద్దని మహిళలు వారి కాళ్లావేళ్లా బడ్డారు. అయినా కనికరించని అధికారులు.. రెండు జేసీబీలతో గుడిసెల కూల్చి వేత ప్రారంభించారు. దాంతో ఆగ్రహించిన పేదలు.. జేసీబీలను అడ్డుకున్నారు. దాంతో అడ్డుకున్న మహిళలు, పురుషులపై పోలీసులు లాఠీఛార్జి చేసి భయ భ్రాంతులకు గురిచేశారు. మహిళలను చితకబాదడంతో కొంతమంది స్పృహ కోల్పోయారు. వెంటనే పోలీసులు వారిని తీసుకెళ్లి డీసీఎంలో పడేసి పోలీస్‌స్టేషన్‌ తరలించారు. ఇలా గంటసేపు పోలీసులకు గుడిసె వాసులకు మధ్య తోపులాటతో అక్కడ ఉద్రిక్తత నెలకొంది. 13 మంది మహిళలు, ఇద్దరు పురుషులను పోలీస్‌ స్టేషన్‌కు తరలించి సాయంత్రం వరకు స్టేషన్‌లోనే ఉంచారు. సాయంత్రం వరకు వదిలిపెడతామని చెప్పిన పోలీసులు.. సాయంత్రం హఠాత్తుగా వారిపై క్రిమినల్‌ కేసు నమోదు చేసి కోర్టుకు పంపిస్తున్నట్టు చెప్పారు. పోలీసుల అదుపులో ఉన్న వారిలో.. బండోజ్‌ కవిత, గోపి, సునీత, బానోతు సునీత, గుండోజు నాగలక్ష్మి, అజ్మీర జ్యోతి, కిన్నెర ధనమ్మ, సండ్ర పట్ల ఉమా, అజ్మీర కవిత, పుడిశెట్టి కవిత, దేవుని బోయిన పద్మ, భూక్య మమత, వేముల శైలజ గూగుల్‌ లోతు పార్వతి తోపాటు అనిల్‌, వేణు ఉన్నారు.
పేదలపై దౌర్జన్యమా?  ఎస్‌ వీరయ్య
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌
గుడిసెవాసులపై పోలీసుల దౌర్జన్యాలను ఆపాలనీ, అందుకు ప్రభుత్వం చొరవ తీసుకోవాలని లేదంటే ప్రజా ఉద్యమం తప్పదని ప్రజా సంఘాల ఐక్య వేదిక కన్వీనర్‌ ఎస్‌ వీరయ్య ఒక ప్రకటనలో ప్రభుత్వాన్ని హెచ్చరించారు. సోమ వారం ఉదయం మహబూబాబాద్‌ జిల్లా కేంద్రంలోని గుడిసెవాసులపై పోలీసు లు దౌర్జన్యం చేశారని తెలిపారు. ఈ ఘటనలో పది మంది పేదలు గాయపడ్డా రని పేర్కొన్నారు. మరో పది మంది మహిళలను అరెస్టు చేశారని తెలిపారు. స్టేష న్‌లో వారిని బూతులు తిడుతూ కొట్టారని పేర్కొన్నారు. వారిపై నాన్‌బెయిల్‌బుల్‌ సెక్షన్ల కింద కేసులు నమోదు చేస్తున్నారని తెలిపారు. అరెస్టు చేసినవారిని తక్ష ణమే విడుదల చేయాలని డిమాండ్‌ చేశారు. రాష్ట్ర వ్యాప్త పిలుపులో భాగంగా కలెక్టరేట్ల ముందు ధర్నాకు సిద్దమవుతున్న పేదలపై పోలీసుల దాడులు, దౌర్జన్యా లు చేశారని తెలిపారు. గుడిసెలు కూల్చేసి, పేదలపై విరుచుకుపడ్డారని పేర్కొ న్నారు. పది రోజుల క్రితం వనస్థలిపురంలోనూ ఇలాంటి ఘటన కొనసాగిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఈఅప్రజాస్వామిక చర్యలను ఖండిస్తున్నామని తెలిపారు.

Spread the love