ఉపా రద్దుకు ఐక్య పోరు…

– ఉద్యమకారులు, ఉగవ్రాదులపై ఒకే చట్టం ప్రయోగిస్తారా?
– తాడ్వాయిలో 152 మందిపై పెట్టిన కేసులను ఎత్తేయాలి
– ఆ చట్టాన్ని అమలు చేయబోమంటూ పార్టీలు ప్రకటించాలి
– తులసిచందుకు రక్షణ కల్పించాలి : సీపీఐ రౌండ్‌టేబుల్‌లో వక్తల డిమాండ్‌
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
చట్ట వ్యతిరేక కార్యకలాపాల నిరోధక చట్టం (ఉపా)ను రద్దు చేసేందుకు ఐక్య ఉద్యమాన్ని నిర్మించాలని రాజకీయ పార్టీల నాయకులు, పలువురు వక్తలు డిమాండ్‌ చేశారు. తాడ్వాయిలో 152 మందిపై అక్రమంగా నమోదు చేసిన ఉపా కేసులను ఎత్తేయాలని కోరారు. ఒకవైపు ఉద్యమకారులు, ప్రభుత్వాలను ప్రశ్నించే వారు, ఇంకోవైపు ఉగ్రవాదులపై ఒకే రకమైన చట్టాన్ని ప్రయోగించడం ఎంత వరకు సమంజసమని ప్రశ్నించారు. ఉపా చట్టాన్ని రాష్ట్రంలో అమలు చేయబోమంటూ రాజకీయ పార్టీలు ప్రకటించాలన్నారు. స్వతంత్ర జర్నలిస్టు తులసిచందుకు రక్షణ కల్పించాలని రాష్ట్ర ప్రభుత్వానికి సూచించారు. మంగళవారం హైదరాబాద్‌లోని మఖ్దూంభవన్‌లో సీపీఐ రాష్ట్ర సమితి ఆధ్వర్యంలో ‘ఉపా చట్టాన్ని రద్దు చేయాలి’అని కోరుతూ రౌండ్‌టేబుల్‌ సమావేశాన్ని నిర్వహించారు. ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు సమన్వయకర్తగా వ్యవహరించారు.
పౌరహక్కుల వేదికను ఏర్పాటు చేయాలి : చెరుపల్లి
ఉపా చట్టానికి కాంగ్రెస్‌ ప్రభుత్వం పునాది వేస్తే బీజేపీ సర్కారు దాన్ని మరింత దూకుడుగా అమలు చేస్తున్నదని సీపీఐ(ఎం) కేంద్ర కమిటీ సభ్యులు చెరుపల్లి సీతారాములు చెప్పారు. మోడీ ప్రభుత్వం మొదటి ఐదేండ్లలో రాజ్యాంగ వ్యవస్థల్లో ఆర్‌ఎస్‌ఎస్‌ వారిని నియమించిందని అన్నారు. రెండోసారి అధికారంలోకి వచ్చాక రాజద్రోహం, దేశద్రోహం చట్టాలను ప్రశ్నించే వారిపైనా, మేధావులపైనా, రచయితలపైనా నమోదు చేస్తున్నదని విమర్శించారు. ప్రజల తరఫున మాట్లాడే వారిపై కేసులు పెడుతున్నారని చెప్పారు. ప్రశ్నించే గొంతులను నొక్కేందుకే ఈ చట్టాలను వినియోగిస్తున్నారని విమర్శించారు. సుప్రీం కోర్టు చెప్పినా కేంద్రం పట్టించుకోవడం లేదన్నారు. 1978లో నాటి సీఎం జలగం వెంగళరావు ప్రజలపై దుర్మార్గంగా వ్యవహరిస్తే పుచ్చలపల్లి సుందరయ్య పౌరహక్కుల వేదిక పెట్టారని గుర్తు చేశారు. ప్రజలను చైతన్యపరిచేందుకు అలాంటి పౌరహక్కుల వేదిక ఇప్పుడు ఏర్పాటు చేయాల్సిన అవసరముందన్నారు. అప్పుడే పాలక పార్టీల మెడలు వంచడం సాధ్యమవుతుందని చెప్పారు. పాలకులకు వర్గ స్వభావం ఉంటుందని, ఎన్నికల్లో పొత్తులున్నా ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాడితే వారిపై కేసులు, పీడీ యాక్ట్‌లు నమోదవుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు.
ప్రశ్న అంటే పాలకులకు భయం : కూనంనేని
ఇస్లామిక్‌ ఉగ్రవాదులు, అంతర్జాతీయ ఉగ్రవాదులు, దేశంలో ప్రజా సమస్యలపై ప్రశ్నించే ఉద్యమకారులు, కవులు, కళాకారులు, పాత్రికేయులపై ఒకే రకమైన ఉపా, దేశ ద్రోహం లాంటి చట్టాలను ఎలా ప్రయోగిస్తారంటూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు ప్రశ్నించారు. తాము దుర్వినియోగం కావడం పట్ల ఆ చట్టాలు, న్యాయం, ధర్మం సిగ్గుపడుతున్నాయంటూ ప్రభుత్వాల తీరును ఎండగట్టారు. దొంగలు, దోపిడీదారులు, లైంగికదాడులకు పాల్పడే వారు పాలకులుగా, నాయకులుగా చలామణి అవుతున్నారని విమర్శించారు. అన్యాయాన్ని ప్రశ్నించే మేధావులు, విద్యావంతులు, దేశభక్తులు మాత్రం బెయిల్‌ రాకుండా జైళ్లలో మగ్గుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. సమాజంలో చీకటి నిర్బంధాలు, అణచివేతలు కొనసాగుతున్నాయని చెప్పారు. ప్రశ్న అంటే పాలకులకు భయమని అన్నారు. మనిషిని బంధించొచ్చు కానీ వారిలోని భావాన్ని, సూర్య కిరణాలను, గాలిని బంధిస్తారా? అని నిలదీశారు. రాజ్యాంగాన్ని పరిరక్షించి, అమలు చేయాల్సిన పాలకులే అందుకు భిన్నంగా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. అణచివేత నుంచే తిరుగుబాటు మొదలవుతుందని హెచ్చరించారు. అధికార పార్టీతో ఎన్నికల అవగాహన ఉన్నప్పటికీ ప్రజా సమస్యల పరిష్కారానికి, పాలనలోని తప్పులను ఎత్తిచూపి, వాటిని సరిదిద్ధాలని చెప్పే ధైర్యం కమ్యూనిస్టులకు మాత్రమే ఉందన్నారు.
అధికారంలోకి వచ్చే పార్టీలు ‘ఉపా’ అమలు చేయొద్దు : హరగోపాల్‌
అధికారంలోకి వచ్చే పార్టీలు ఉపా చట్టాన్ని రాష్ట్రంలో అమలు చేయబోమంటూ రాజకీయ పార్టీలు స్పష్టంగా ప్రకటించాలని ప్రొఫెసర్‌ హరగోపాల్‌ డిమాండ్‌ చేశారు. ఉపా రద్దు అధికారంలో కేంద్రానికి ఉన్నందున ఒత్తిడి పెంచేందుకు ఉపయోగపడుతుందని అన్నారు. దుర్మార్గమైన ‘ఉపా’ చట్టాన్ని క్షేత్రస్థాయిలోని ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాలని, తద్వారా రాజకీయ పార్టీలను వారు నిలదీసే అవకాశముంటుందని అభిప్రాయపడ్డారు. ఉద్యమం నుంచి వచ్చిన రాజకీయ పార్టీ ప్రజల పట్ల సానుకూలంగా వ్యవహరిస్తుందని తాము భావించామని చెప్పారు. కానీ అందుకు విరుద్ధంగా బీఆర్‌ఎస్‌ పాలన కొనసాగుతున్నదని విమర్శించారు. తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న వారిపై ఉపా కేసులు పెట్టడం అన్యాయమని అన్నారు.
రాజకీయ ఎజెండాగా మారాలి : కె శ్రీనివాస్‌
ఒకవైపు సమరశీల పోరాటాలు, నిస్వార్థంగా ప్రజల కోసం పనిచేస్తున్న వారిపై ‘ఉపా’ చట్టాలను ప్రయోగిస్తుంటే మరోవైపు రాజకీయ ప్రత్యర్థులపైన ఈడీ, సీబీఐ వంటి దాడులు జరుగుతున్నాయని ఆంధ్రజ్యోతి సంపాదకులు కె శ్రీనివాస్‌ అన్నారు. ప్రభుత్వాలను ప్రశ్నిస్తున్న జర్నలిస్టు తులసిచందువంటి వారిపై సామాజిక మాధ్యమాలైన ట్రోలింగ్‌ ద్వారా దాడులు చేస్తున్నారని చెప్పారు. ఈ నల్లచట్టాలు ప్రభుత్వ దుందుడుకు తనానికి ప్రతీక అని విమర్శించారు. వామపక్ష పార్టీలు 2024 ఎన్నికల్లో ప్రత్యామ్నాయ ఎజెండాను మ్యానిఫెస్టోలో ప్రకటించాలని సూచించారు. ‘ఉపా’ రద్దు అంశం రాజకీయ ఎజెండాగా మారాలని అభిప్రాయపడ్డారు.
సీఎంను కలిసి వినతిపత్రమివ్వాలి : నాయకులు
సీపీఐ జాతీయ కార్యవర్గ సభ్యులు చాడ వెంకట్‌రెడ్డి, సీపీఐ(ఎంఎల్‌) ప్రజాపంథా రాష్ట్ర కార్యదర్శి పోటు రంగారావు, సీపీఐ(ఎంఎల్‌) న్యూడెమోక్రసీ నాయకులు వెంకన్న, సీపీఐ(ఎంఎల్‌) న్యూడెమోక్రసీ సహాయ కార్యదర్శి సాధినేని వెంకటేశ్వరరావు, ఆరెస్పీ రాష్ట్ర కార్యదర్శి జానకి రాములు, సీపీఐ(ఎంఎల్‌) లిబరేషన్‌ రాష్ట్ర కార్యదర్శి రాజేష్‌, అరుణోదయ సాంస్కృతిక సమాఖ్య నాయకులు విమలక్క, పీవోడబ్ల్యూ జాతీయ కన్వీనర్‌ వి సంధ్య, పౌరహక్కుల సంఘం రాష్ట్ర అధ్యక్షులు గడ్డం లక్ష్మణ్‌ మాట్లాడుతూ ఉపా చట్టాన్ని ఉపసంహరించేదాకా జాతీయ స్థాయిలో ఉద్యమించాలని పిలుపునిచ్చారు. సీఎం, సీఎస్‌, హోంమంత్రి, డీజీపీని కలిసి వినతిపత్రాలను సమర్పించాలని, అవసరమైతే హెచ్‌ఆర్సీని కలవాలని చెప్పారు. రాష్ట్ర సదస్సుతోపాటు జిల్లాస్థాయిలోనూ సదస్సులు నిర్వహించాలని కోరారు. వచ్చేనెల 15న సుందరయ్య విజ్ఞాన కేంద్రం వద్ద కళాకారులతో నిరసన కార్యక్రమాన్ని నిర్వహిస్తామని, కళలు, గళాల గర్జన సభ నిర్వహిస్తామని వివరించారు. నిర్బంధ వ్యతిరేక వేదిక ఆధ్వర్యంలో వచ్చేనెల ఒకటిన సోమాజిగూడ ప్రెస్‌ క్లబ్‌లో అన్ని రాజకీయ పార్టీలు, ప్రజాసంఘాలతో రౌండ్‌ టేబుల్‌ సమావేశం నిర్వహిస్తామని, 30న సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో బహిరంగ సభను జరుపుతామని అన్నారు. జర్నలిస్టు తులసిచందుపై ట్రోలింగ్‌ రావడం ఈ సమావేశం ఖండిస్తూ ఆమెకు సంఘీభావం ప్రకటించింది. ఈ కార్యక్రమంలో సీపీఐ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు పల్లా వెంకట్‌రెడ్డి, ఎన్‌ బాలమల్లేష్‌, ఈటి నరసింహ, విఎస్‌ బోస్‌, హైదరాబాద్‌, మేడ్చల్‌, నల్లగొండ, సూర్యాపేట జిల్లాల కార్యదర్శులు ఛాయాదేవి, సాయిలుగౌడ్‌, సత్యం, వెంకటేశ్వర్లు, పాలమూరు అధ్యయన వేదిక నాయకులు రాఘవాచారి, రవిచంద్ర తదితరులు పాల్గొన్నారు.

Spread the love