ఖమ్మం మార్కెట్లో అగ్నిప్రమాదం

– 1500కు పైగా పత్తి బస్తాలు దగ్ధం
– ఫైరింజన్‌ లేక భారీగా నష్టం
– ఏర్పాటు చేయాలని సీపీఐ(ఎం) డిమాండ్‌
నవతెలంగాణ- ఖమ్మం ప్రాంతీయ ప్రతినిధి
ఖమ్మం వ్యవసాయ మార్కెట్లో శనివారం మధ్యాహ్నం అగ్ని ప్రమాదం జరిగింది. 1500కు పైగా పత్తి బస్తాలు దగ్ధమయ్యాయి. మంటలు ఎలా వచ్చాయనే విషయం మాత్రం బయటకు రాలేదు. మార్కెట్‌ వ్యాపారి, ఈ ప్రమాదంలో నష్టపోయిన చిత్తూరు శ్రీనివాస్‌ మాత్రం 2000కి పైన బస్తాలు దగ్ధమైనట్టు చెబుతున్నారు. సుమారు కోటి రూపాయలకు పైన నష్టం జరిగిందని అంటున్నారు. మార్కెటింగ్‌ శాఖ వర్గాలు మాత్రం రూ.50 లక్షల నష్టం జరిగి ఉంటుందని అంచనా వేస్తున్నారు. నెల రోజులపాటు రైతుల నుంచి కొనుగోలు చేసిన పత్తిని.. ధర మందకొడిగా ఉండటంతో మార్కెట్లో నిల్వ చేశాడు. దీనికి తోడు లారీలు సక్రమంగా రాకపోవడం, వేసవి సెలవులు కూడా కావడంతో పత్తిని ఎగుమతి చేయలేకపోయాడు. ఇటీవల మార్కెట్‌ తిరిగి ప్రారంభం కావడంతో పరిస్థితుల్ని బట్టి విక్రయించుదామని వ్యాపారి భావించాడు. ఈలోగానే ఈ ప్రమాదం జరగడంతో శ్రీనివాస్‌ తీవ్ర నష్టాన్ని చవిచూడాల్సి వచ్చింది.
మార్కెట్లో ఫైర్‌ ఇంజన్‌ లేకపోవడంతోనే ఈ ప్రమాదంలో నష్ట తీవ్రత అధికంగా జరిగిందని పరిశీలకులు అంటున్నారు. గతంలో ఇక్కడ ఉన్న ఫైర్‌ ఇంజన్‌ను కొద్ది రోజుల కిందట నేలకొండపల్లికి తరలించారు. దీనికి మార్కెట్‌ సెలవులను సాకుగా చూపుతున్నారు. ఒకవేళ ఫైర్‌ ఇంజన్‌ అందుబాటులో ఉండి ఉంటే ఒకటి రెండు బస్తాలు దగ్ధమయ్యేలోపే మంటలను
ఖమ్మం మార్కెట్లో అగ్నిప్రమాదం ఆర్పే అవకాశం ఉండేది స్థానికులు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రమాదం జరిగిన అరగంట తర్వాత ఖమ్మం, నేలకొండపల్లి నుంచి ఫైర్‌ ఇంజన్లు వచ్చి మంటలను ఆర్పాయి.
మార్కెట్‌ను సందర్శించిన సీపీఐ(ఎం) బృందం
ఖమ్మం వ్యవసాయ మార్కెట్లో అగ్నిప్రమాదంలో కాలిపోయిన పత్తి వ్యాపారస్తులను ప్రభుత్వం ఆదుకోవాలని సీపీఐ (ఎం) జిల్లా కార్యదర్శి నున్నా నాగేశ్వరరావు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ప్రమాద విషయం తెలిసిన వెంటనే సీపీఐ(ఎం) నాయకులు మార్కెట్‌ను సందర్శించారు. 2000కు పైన బస్తాలు పత్తి కాలిపోవడానికి మార్కెట్లో ఫైరింజన్‌ అందుబాటులో లేకపోవడమే కారణమన్నారు. ఇక్కడ ఉన్న ఫైర్‌ ఇంజన్‌ నేలకొండపల్లికి మార్చడం సరైంది కాదన్నారు. పర్మినెంట్‌ సెక్యూరిటీని నియమించాలని కోరారు. మార్కెట్‌ కమిటీ కార్యదర్శి రుద్రాక్షల మల్లేశాన్ని కలిసి ప్రమాదానికి కారణాలను విశ్లేషించారు. సీపీఐ (ఎంఎల్‌) ప్రజాపంథ నాయకులు సైతం సందర్శించారు. మార్కెట్‌ను సందర్శించిన వారిలో సీపీఐ(ఎం) రాష్ట్ర కమిటీ సభ్యులు యర్రా శ్రీకాంత్‌, జిల్లా కమిటీ సభ్యులు శ్రీనివాసరావు, తెలంగాణ రైతు సంఘం జిల్లా అధ్యక్షులు మాదినేని రమేష్‌, నాయకులు తుషాకుల లింగయ్య, బండారు యాకయ్య, సుధీర్‌, బజ్జురి రమణారెడ్డి, పగడాల మోహన్‌ రావు తదితరులు ఉన్నారు.

Spread the love