అదానీ, మోడీ కవలలు

– మోడీకి 30 మంది కార్పొరేట్‌ దత్తపుత్రులు
– దేశంలో ఆర్థిక నేరస్తులకు ప్రతినిధి మన ప్రధాని
– ముత్తయిదువు కాదుకాబట్టే పార్లమెంట్‌ ప్రారంభానికి రాష్ట్రపతికి ఆహ్వానం లేదు
– మోడీ గడ్డంతో పాటు గ్యాస్‌, పెట్రోల్‌ ధరలు పెరుగుతున్నాయి : సీపీఐ జాతీయ కార్యదర్శి కె.నారాయణ
నవతెలంగాణ- ఖమ్మం ప్రాంతీయ ప్రతినిధి/ కొత్తగూడెం:
అదానీ-ప్రధాని నరేంద్ర మోడీ కవలపిల్లలని సీపీఐ జాతీయ కార్యదర్శి డాక్టర్‌ కె.నారాయణ విమర్శించారు. దేశంలో ఆర్థిక నేరస్తులు, దోపిడీదారులకు ప్రతినిధి మోడీ అని ఆరోపించారు. మోడీకి ఈ రకమైన కార్పొరేట్‌ దత్తపుత్రులు 30 మంది వరకూ ఉన్నారని వ్యాఖ్యానించారు. మోడీ కేబినెట్‌లో 24 మంది క్రిమినల్స్‌ ఉన్నారని, వీరిలో హౌం మంత్రి అమిత్‌షా ప్రముఖుడని తెలిపారు. సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు అధ్యక్షతన కొత్తగూడెంలోని ప్రకాశం స్టేడియంలో ఆదివారం నిర్వహించిన సీపీఐ ప్రజాగర్జన సభలో నారాయణ మాట్లాడారు. ముత్తయిదువు కాదు కాబట్టే రాష్ట్రపతి ద్రౌపదిముర్మును నూతన పార్లమెంట్‌ భవన ప్రారంభానికి బీజేపీ ఆహ్వానించలేదని వ్యాఖ్యానించారు. ప్రధాన మోడీ పాలనలో న్యాయవ్యవస్థ, సీబీఐ, చివరికి ఎలక్షన్‌ కమిషన్‌ కూడా దిగజారాయన్నారు. 26 రాష్ట్రాల్లో ఉన్న సీపీఐకి గుర్తింపు రద్దు చేయడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. దేశస్థాయిలో బీజేపీ వ్యతిరేక కూటమిలో కేసీఆర్‌ చేరాలని, లేదంటే అనుమానాలొస్తాయని వ్యాఖ్యానించారు. రేపిస్టులు, క్రిమినల్స్‌ను కాపాడేది బీజేపీ ప్రభుత్వం అన్నారు. అందుకే రేజ్లర్లు నెలల తరబడి ఆందోళన చేసినా బీజేపీ ఎంపీ బ్రిజ్‌భూషణ్‌శరణ్‌ సింగ్‌పై ఎలాంటి చర్యలు తీసుకోలేదని విమర్శించారు. ఒకప్పటి గంజాయి స్మగ్లర్‌ అదానీకి ఎయిర్‌పోర్టులు, పబ్లిక్‌ సర్వీసులు అమ్మేస్తున్నారని ఆరోపించారు. సంపన్నులపై పన్ను తగ్గించి సామాన్యులపై పన్ను భారం మోపుతున్నారని, మోడీ గడ్డం పెరిగినట్లే గ్యాస్‌, పెట్రోల్‌, నిత్యావసరాల ధరలు పెంచుతున్నారన్నారు. పోడుభూములను ఖాళీ చేయించి కేంద్రం కార్పొరేట్లకు అప్పగించాలనే కుట్ర చేస్తుందన్నారు. పోడుదారులందరికీ కేసీఆర్‌ పట్టాలిచ్చి కేంద్రం ఆగడాలను అడ్డుకోవాలని కోరారు. ఎన్ని ఓట్లు ఉన్నాయని కాదు.. బీజేపీని వ్యతిరేకించే శక్తి లెఫ్ట్‌ పార్టీలకే ఉందని స్పష్టంచేశారు. ఓట్లు కాదు.. రాజకీయ ఐక్యత కీలకమన్నారు. కర్నాటకలో కులమతాలను రెచ్చగొట్టి, సీబీఐని ఉసిగొల్పి లబ్ది పొందాలని చూసిన బీజేపీకి ప్రజలు తగిన గుణపాఠం చెప్పారని, అక్కడ పోగొట్టుకున్న సూదిని తెలంగాణలో వెతుక్కోవాలనే భావనతో బీజేపీ ఉందన్నారు. పొంగులేటి ఎవరు? డబ్బుల అహంభావంతో వస్తున్న అవకాశవాద రాజకీయ నాయకులను వ్యతిరేకించాలని పిలుపునిచ్చారు. చట్టసభల్లో కమ్యూనిస్టులు ఉండాలని ప్రజలు కోరుకుంటున్నారన్నారు. అలా అని సీట్ల కోసం లక్ష్మణ రేఖ దాటాల్సిన అవసరం కమ్యూనిస్టులకు లేదన్నారు. కేసీఆర్‌కు అతి తెలివి తేటలు ఎక్కువని, రాజకీయాల్లో విమర్శలు సహజం.. వాటిని సద్విమర్శలుగా స్వీకరిస్తే బాగుపడతారని వ్యాఖ్యానించారు. రూ.10 లక్షల దళితబంధు స్కీంలో రూ.రెండు, మూడు లక్షలకు మించి లబ్దిదారులకు అందడం లేదన్నారు. దళితులకు మూడు ఎకరాల భూమి ఏమైందని ప్రశ్నించారు. అందరూ కలిసి వస్తేనే తెలంగాణ కల సాకారమైందని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు అన్నారు. బాధల్లో ఉన్నవారిని కేసీఆర్‌ ఓదార్చాలని సూచించారు. మిగతా పార్టీలు ఉంటాయో.. లేదో తెలియదు కాని సృష్టి ఉన్నంతకాలం కమ్యూనిజం ఉంటుందన్నారు. సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శి రాజా అస్వస్థత కారణంగా ఈ సభకు రాలేకపోయారని తెలిపారు. సీపీఐ జాతీయ కార్యవర్గ సభ్యులు చాడా వెంకటరెడ్డి, జాతీయ సమితి సభ్యులు మనీష్‌ కుంజం తదితరులు మాట్లాడారు. అంతకుముందు కొత్తగూడెం పట్టణంలో భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ సభలో మాజీ శాసన సభ్యులు పల్లా వెంకటరెడ్డి, రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు బాగం హేమంతరావు, భద్రాద్రి జిల్లా కార్యదర్శి సాబిర్‌పాషా, ఖమ్మం జిల్లా కార్యదర్శి పోటు ప్రసాద్‌, సింగరేణి కాలరీస్‌ వర్కర్స్‌ యూనియన్‌ కార్యదర్శి వాసిరెడ్డి సీతారామయ్య, సీపీఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు బి.అయోధ్య, రావులపల్లి రాంప్రసాద్‌, మౌలానా, దండి సురేష్‌ తదితరులు పాల్గన్నారు.

Spread the love