ఒకప్పుడు పెన్నూ పేపర్‌కే డబ్బుల్లేవు..

ములాఖాత్‌
– ఇప్పుడు మన పోలీస్‌ స్టేషన్లలో అన్ని వసతులు, సౌకర్యాలు…

– కేవలం ఆరేండ్లలోనే అద్భుత ప్రగతి..
– పోలీసు సంస్కరణల్లో ఇతర రాష్ట్రాలకు ఆదర్శం ‘పంజాగుట్ట పీఎస్‌కు సర్వత్రా ప్రశంసలు’
– కేసీఆర్‌ దూరదృష్టి వల్లే ఇదంతా సాధ్యం
– ‘నవతెలంగాణ’తో తెలంగాణ పోలీస్‌ హౌజింగ్‌ కార్పొరేషన్‌ చైర్మెన్‌ కోలేటి దామోదర్‌
తెలంగాణ సిద్ధించిన తర్వాత ఎన్నో ఆటుపోట్లు, ఒడిదుడుకులు ఎదుర్కొని తొమ్మిదేండ్లను పూర్తి చేసుకున్నామని రాష్ట్ర పోలీస్‌ హౌజింగ్‌ కార్పొరేషన్‌ చైర్మెన్‌ కోలేటి దామోదర్‌ తెలిపారు. వాస్తవానికి రాష్ట్రం ఆవిర్భవించి తొమ్మిదేండ్లు పూర్తయినా.. మొదటి ఏడాది ఐఏఎస్‌, ఐపీఎస్‌ల బదిలీలు, సర్దుబాట్లతోనే సరిపోయిందని ఆయన చెప్పారు. ఆ తర్వాత కరోనా వల్ల రెండేండ్ల విలువైన సమయాన్ని కోల్పోయామని గుర్తు చేశారు. ఇవిపోను మిగిలిన ఆరేండ్ల వ్యవధిలోనే రాష్ట్రం అద్భుతమైన ప్రగతిని సాధించిందని వివరించారు.
ఒకప్పుడు పోలీస్‌ స్టేషన్లలో పెన్నూ పేపర్‌ కూడా ఉండేది కాదనీ, కానీ ఇప్పుడవి సకల హంగులు, వసతులు, సౌకర్యాలతో దర్జాగా ఉన్నాయని తెలిపారు. ఇదంతా సీఎం కేసీఆర్‌ పరిపాలనా పటిమ, దక్షత, దూరదృష్టితోనే సాధ్యమయ్యాయని చెప్పారు. తెలంగాణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా సోమవారం రాష్ట్రవ్యాప్తంగా ‘పోలీస్‌ పరుగు’ను నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా దామోదర్‌… నవతెలంగాణ ప్రతినిధి బి.వి.యన్‌.పద్మరాజుతో ప్రత్యేకంగా ముచ్చటించారు. రాష్ట్రంలో పోలీస్‌ సంస్కరణలు, జిల్లాలు, మండలాల్లో నూతన పోలీస్‌ కార్యాలయాలు, స్టేషన్లు, వాటి నిర్వహణ తదితరాంశాలను ఈ సందర్భంగా ప్రస్తావించారు. ఆ వివరాలు ఆయన మాటల్లోనే…
అప్పుడలా.. ఇప్పుడిలా…
‘ఉమ్మడి రాష్ట్రంలో అన్ని రంగాల మాదిరిగానే పోలీసులనూ, ఆ శాఖను ఆనాటి పాలకులు పట్టించుకోలేదు. పోలీస్‌ స్టేషన్ల నిర్వహణకు కూడా డబ్బులుండేవి కావు. ఎవరైనా ఒక ఫిర్యాదు రాయటానికి వస్తే… పెన్నూ, పేపర్‌ కూడా బయటి నుంచే కొనుక్కోవాలంటూ చెప్పే దుస్థితి. కానీ తెలంగాణ వచ్చాక పోలీస్‌ స్టేషన్ల ఆధునీకరణ, నిర్వహణలో గణనీయమైన మార్పులను తెచ్చాం. సీఎం కేసీఆర్‌ ప్రత్యేక జీవోను విడుదల చేయటం ద్వారా గతంలో రూ.375 కోట్లను పోలీస్‌ శాఖలో మౌలిక సదుపాయాల కోసం విడుదల చేశారు. మరో రూ.500 కోట్లను నూతన వాహనాల కొనుగోలు కోసం కేటాయించారు. తద్వారా గతంలో ఎన్నడూ లేనంతగా అత్యాధునిక వసతులతో కొత్త స్టేషన్లను ఏర్పాటు చేస్తున్నాం. ఈ రకంగా రూపొందించిన హైదరాబాద్‌ పంజాగుట్ట స్టేషన్‌ అత్యద్భుతంగా ఉంది. దాన్ని ఇతర రాష్ట్రాలకు చెందిన సీఎంలు, ఉన్నతాధికారులు సందర్శిస్తున్నారు.. ప్రశంసలు కురిపిస్తున్నారు. గతంలో ఒక్కో పోలీస్‌ స్టేషన్‌ కేవలం 600 చదరపు అడుగుల్లో ఇరుకిరుగా ఉండేవి. టీఆర్‌ఎస్‌ అధికారంలోకి వచ్చాక ఆ విస్తీర్ణాన్ని 15 వేల చదరపు అడుగులకు పెంచాం. మరోవైపు పోలీస్‌ రిక్రూట్‌మెంట్‌లో మహిళలకు 30 శాతం అవకాశమిస్తున్నాం. షీ టీమ్‌ల నిర్వహణ కోసం హైదరాబాద్‌లో నెలకు రూ.75 వేలు, జిల్లా కేంద్రాల్లో రూ.50 వేలు, మండలాల్లో రూ.25 వేలు కేటాయించటం ద్వారా ఎన్నో ఫలితాలను సాధిస్తున్నాం. మరోవైపు కొత్తగా ఏర్పాటు చేసిన ప్రతీ మండల కేంద్రంలో పోలీస్‌ స్టేషన్లకు సొంత భవనాలను నిర్మించబోతున్నాం. హైదరాబాద్‌లో నిర్మించిన కమాండ్‌ అండ్‌ కంట్రోల్‌ సెంటర్‌ దేశం మొత్తం మన వైపు చూసేలా చేసింది…’
ఒకప్పుడు వెలవెల.. నేడు జలకళ…
‘మా స్వస్థలం రామగుండం. ఉమ్మడి రాష్ట్రంలో అక్కడి నుంచి హైదరాబాద్‌కు వస్తుంటే ఎక్కడ చూసినా వెలవెల బోతున్న చెరువులు, కుంటలు.. నెర్రెలు బారిన నేలలు కనబడేవి. కానీ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన మిషన్‌ కాకతీయతో చెరువులకు జలకళ వచ్చింది. రైతు బంధు, రైతు బీమాతో అన్నదాతలకు భరోసా వచ్చింది. ఎలాంటి పైరవీలకు ఆస్కారం లేకుండా అమలవుతున్న సంక్షేమ పథకాలు దేశానికే ఆదర్శంగా ఉన్నాయి. కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన అవార్డులు, రివార్డులే ఇందుకు నిదర్శనం. కాళేశ్వరం ప్రాజెక్టు తెలంగాణను కొంగు బంగారమైంది. కొంతమంది ఆధునిక సాంకేతికత వల్ల అన్ని చోట్లా అభివృద్ధి సాధ్యమైందని అంటున్నారు. అలాంటి వారు పక్కనున్న మహారాష్ట్రతోపాటు బీహార్‌, ఉత్తరప్రదేశ్‌ రాష్ట్రాలను తెలంగాణతో పోల్చి చూస్తే వాస్తవం బోధపడుతుంది. కేసీఆర్‌ ప్రవేశపెట్టిన పథకాలు నచ్చి… మహారాష్ట్రకు చెందిన ప్రజలు తమ ప్రాంతాలను తెలంగాణలో కలపాలంటూ కోరుతున్నారు. ఈ క్రమంలో మనం సాధించిన అభివృద్ధిని చూసి ప్రతీ ఒక్కరూ గర్వపడాల్సిందే…’
పండుగలా జరుపుకుందాం…
‘సంక్షేమ, అభివృద్ధి రంగాల్లో శరవేగంగా దూసుకుపోతున్న తెలంగాణ ప్రగతిని దశ దిశలా చాటి చెప్పేందుకే రాష్ట్ర ప్రభుత్వం దశాబ్ది ఉత్సవాలను నిర్వహిస్తోంది. తెలంగాణలోని ఇంటింటికీ పథకాలు, ప్రయోజనాలు అందుతున్న ప్రస్తుత తరుణంలో మనం ఈ ఉత్సవాలను పండుగలా జరపుకుందాం. వీటిని జయప్రదం చేసేందుకోసం ప్రజా ప్రతినిధులు, అధికారులు, ప్రజలు కలిసికట్టుగా కృషి చేయాలి…’

Spread the love