మద్దతు ధరల చట్టం కోసం పోరాటం

– తెలంగాణలో ఏటా రూ.30వేల కోట్లు పత్తి రైతుకు నష్టం
– ఏపీలో ఒక సీజన్‌లో రూ.14వేల కోట్లు వరి రైతుకు లాస్‌
– 9 పంటలను కిలో కూడా ప్రభుత్వం ఖరీదు చేయలేదు
– పంటల ఉత్పత్తి ఖర్చులు పెరిగినా ధరల్లో మాత్రం క్షీణత
– అఖిల భారత రైతు సంఘం ప్రధాన కార్యదర్శి విజ్జూ కృష్ణన్‌
నవతెలంగాణ – ఖమ్మం ప్రాంతీయ ప్రతినిధి
పంటల మద్దతు ధరల కోసం పోరాటానికి సమాయత్తం కావాలని అఖిల భారత రైతు సంఘం ప్రధాన కార్యదర్శి (ఏఐకేఎస్‌) విజ్జూ కృష్ణన్‌ పిలుపునిచ్చారు. మద్దతు ధరలు లేక తెలంగాణలో ఏటా రూ. 30 వేల కోట్లు పత్తి రైతులు నష్టపోతున్నారని, ఆంధ్రప్రదేశ్‌లో ఒక సీజన్‌లో వరి రైతులు రూ.14వేల కోట్లు లాస్‌ అవుతున్నారని తెలిపారు. 9 పంటలను ప్రభుత్వం ఒక కిలో కూడా కొనుగోలు చేయడం లేదన్నారు. పంట ఉత్పత్తి ఖర్చులు పెరిగినా ధరల్లో ఏమాత్రం పెరుగుదల లేని ఫలితంగానే రైతుల ఆత్మహత్యలు జరుగుతున్నాయని వాపోయారు. ఖమ్మంలోని సుందరయ్య భవన్‌లో బుధవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో విజ్జూ కృష్ణన్‌ మాట్లాడారు. 2014లో మోడీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చేందుకు రకరకాల హామీలు ఇచ్చిందన్నారు. రైతుల ఆదాయం రెట్టింపు చేస్తానని, విత్తనాలు, ఎరువులు, పురుగు మందులు తక్కువ ధరలకు ఇస్తామని, పంట రుణాలు, పంటల బీమా, స్వామినాథన్‌ కమిటీ సిఫారసులు అమలు చేస్తామని హామీ ఇచ్చిందన్నారు. అలాగే, ఉపాధి హామీ చట్టం కింద ఏడాదికి 200 పని దినాలు కల్పిస్తామని బీజేపీ చెప్పిందన్నారు. ఇవేవీ అమలుకాకపోవడంతో తొమ్మిదేండ్లలో లక్షకు పైగా రైతుల ఆత్మహత్యలు జరిగాయని, రెండున్నర లక్షల మంది వలస కార్మికులు ఆత్మహత్య చేసుకున్నారని, మొత్తంగా నాలుగు లక్షల మంది రైతులు, కూలీలు ఆత్మహత్యల పాలైనా బీజేపీ ప్రభుత్వానికి ఏమాత్రం చలనం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. పంటల ఉత్పత్తి ఖర్చులు పెరుగుతున్నా మద్దతు ధరలు మాత్రం పెరగడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఇటీవల కేంద్రం ప్రకటించిన మద్దతు ధరల్లో వరికి క్వింటాల్‌కు రూ.2,183, పత్తికి రూ.6,620 గా పేర్కొందన్నారు. స్వామినాథన్‌ కమిటీ సిఫారసుల ప్రకారం వరికి రూ.2,860 మద్దతు ధర ఇవ్వాలని, ఏ పంటైనా ఉత్పత్తి ఖర్చుపై 50 శాతం పెంపుతో మద్దతు ధరలు ఉండాలన్న విషయాన్ని ప్రస్తావించారు. తెలంగాణలో క్వింటా పత్తి ఉత్పత్తి ఖర్చు రూ.11వేలు కాగా కేంద్రం చెల్లిస్తుంది రూ.6వేలు మాత్రమేనన్నారు. అందుకే మద్దతు ధర కోసం ఓ చట్టం తేవాలని పోరాడుతున్నట్టు తెలిపారు. రుణమాఫీ డిమాండ్‌పై కేంద్రప్రభుత్వం స్పందించడం లేదన్నారు. విద్యుత్‌ చట్టంలోనూ మార్పులు తీసుకువచ్చిందన్నారు. పైలెట్‌ ప్రాజెక్టుగా ఆంధ్రప్రదేశ్‌లో వ్యవసాయ మోటార్లకు స్మార్ట్‌ మీటర్లు బిగించారన్నారు. ఒక్క హెక్టారు పంట ఉత్పత్తికి నెలకు రూ.7000 విద్యుత్‌ బిల్లు రైతులు చెల్లించాల్సి వస్తుందని వివరించారు. అటవీ పరిరక్షణ చట్టంలోనూ మార్పులు తీసుకొచ్చిన విషయాన్ని ప్రస్తావించారు. ఈ మార్పులపై 2020 జరిగిన పోరాటంలో 750 మంది చనిపోయారని చెప్పారు. వీటన్నింటిపై సంయుక్త కిసాన్‌ మోర్చా పోరాటాలకు పిలుపునిచ్చిందని తెలిపారు. దీనిలో భాగంగా అన్ని రాష్ట్రాల్లోని ఎంపీలకు వినతిపత్రాలు ఇవ్వనున్నట్టు చెప్పారు. ఆగస్టు 9న క్విట్‌ ఇండియా ఉద్యమానికి పిలుపునిచ్చామన్నారు. సెప్టెంబర్‌ నుంచి పాదయాత్ర, జాతాలు, ర్యాలీలు నిర్వహిస్తామని వివరించారు. కార్మికులు, వ్యవసాయ కార్మికులతో కలిసి ఐక్య ఉద్యమాలు నిర్మిస్తామన్నారు. సీసీఐ కొనుగోళ్లతో పాటు కమర్షియల్‌ క్రాప్‌ బోర్డుల ఏర్పాటుకు డిమాండ్‌ చేశారు. కేరళలో కేంద్రం నిర్ణయించిన మద్దతు ధరపై క్వింటాకు రూ. 800 బోనస్‌ ఇస్తున్న విషయాన్ని ప్రస్తావించారు. ఇవేవీ చేయకుండా కేంద్ర ప్రభుత్వం గో రక్షణ పేరుతో ముస్లిం, క్రిస్టియన్లపై దాడులు చేస్తుందన్నారు.
తెలంగాణలో బీఆర్‌ఎస్‌ అనుసరిస్తున్న రైతు వ్యతిరేక విధానాలపై ఈనెలాఖరు నుంచి ఉద్యమాలు చేపడతామని సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి నున్నా నాగేశ్వరరావు తెలిపారు. ఇంద్ర పంటల బీమా పథకం, పంట రుణాల మాఫీ, 35 నుంచి 40శాతం ఉన్న కౌలు రైతులకు రైతుబంధు, రైతు బీమా, పంట నష్టపరిహారం వర్తింపజేయడం కోసం పోరాడుతామన్నారు.
11 లక్షల ఎకరాల పోడు రైతులకు, గిరిజనేతరులకు పట్టాలు ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. సమావేశంలో వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి పొన్నం వెంకటేశ్వర్లు, సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు యర్రా శ్రీకాంత్‌, భూక్యా వీరభద్రం, వై.విక్రమ్‌, కళ్యాణం వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.

Spread the love