– పక్క రాష్ట్రాలు, జిల్లాల నుంచి తెచ్చేందుకు యత్నాలు
– సభ సక్సెస్ మా చావుకొస్తుందని నేతల గుసగుసలు
– పొంగులేటిపై పోయిన ఆశలు.. భద్రాద్రి రాముడిపై కపట భక్తి
– ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాల వేస్తుండటంపై విమర్శలు
భద్రాద్రి రాముడిపై భక్తి లేదు.. ఎన్టీఆర్‌పై ప్రేమ లేదు..
9 ఏండ్లలో ఏనాడూ భద్రాచలం రాని అమిత్ షా ఎన్నికలు సమీపిస్తుండడంతో భద్రాద్రి రాముడిపై లేనిపోని భక్తిని ప్రదర్శిస్తున్నారు. అయోధ్య రాముడిని అడ్డుపెట్టుకొని మతవైష్యమ్యాలను రెచ్చగొట్టేది చాలక భిన్నత్వంలో ఏకత్వంతో జీవించే ఖమ్మం ప్రజల్లో మత విద్వేషాలు రెచ్చగొట్టేందుకు ఈ సభను ఏర్పాటు చేశారు. హైదరాబాద్, విశాఖపట్నం తెలుగు రాష్ట్రాల్లోని వేర్వేరు ప్రాంతాలలో బీజేపీ ముఖ్య నాయకులు పర్యటించినప్పటికీ ఎక్కడా ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాల వేయలేదు. అటువంటిది ఖమ్మంలో ఓ సామాజిక వర్గం ఓట్లు అత్యధికంగా ఉండడంతో రాజకీయ ప్రయోజనాల కోసం ఎన్టీఆర్‌పై లేని ప్రేమను ఒలకబోస్తున్నారు. చైతన్యం ఉన్న ఖమ్మం జిల్లా ప్రజలు అమిత్ షా పర్యటనను తిప్పికొడతారు.
– నున్నా నాగేశ్వరరావు,సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి
నవతెలంగాణ – ఖమ్మం ప్రాంతీయ ప్రతినిధి:
రాష్ట్ర బీజేపీకి కేంద్ర హౌంమంత్రి అమిత్ షా ఖమ్మం పర్యటన పెద్ద సవాల్‌గా మారింది. ఎస్‌ఆర్ అండ్ బీజీఎన్‌ఆర్ డిగ్రీ కళాశాల మైదానంలో గురువారం నిర్వహించే సభకు జన సమీకరణ ఆ పార్టీ శ్రేణులను దిగాలు పడేలా చేస్తోంది. సభా ఏర్పాట్ల కోసం ఈనెల 9న ఖమ్మం వచ్చిన ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ స్వచ్ఛందంగా తరలిరావాలని ప్రజలకు పిలుపునిచ్చారు. స్థానికంగా స్పందన లేకపోవడంతో పొరుగు రాష్ట్రాలు, జిల్లాల నుంచి జనాన్ని తరలించేందుకు సన్నాహాలు చేస్తున్నారని గుసగుసలు వినిపిస్తున్నాయి. స్వచ్ఛమైన ఖమ్మంలో చిచ్చుపెట్టే ప్రయత్నాలు తప్ప… ఉమ్మడి జిల్లాకు బీజేపీ చేసిందేమిటి? అనే ప్రశ్నలు జనం నుంచి ఎదురవడం… ఆ పార్టీ శ్రేణులను కలవరానికి గురిచేస్తోంది. ఖమ్మం మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి, మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, మాజీ ఎమ్మెల్యే జలగం వెంకటరావు వంటి కీలక నేతల కోసం చేసిన ప్రయత్నాలు సైతం దాదాపు అడుగంటడంతో ఆ పార్టీ రాష్ట్ర నేతలు దిక్కుతోచని స్థితిలో పడ్డారని విశ్లేషకుల అభిప్రాయం. ఇటువంటి పరిస్థితుల్లో అమిత్ షా సభను ఎలా విజయవంతం చేయాలో అర్థం కాని స్థితిలో ఆ పార్టీ నేతలు ‘పొరుగు’ ప్రయత్నాలను ముమ్మరం చేశారని తెలుస్తోంది. టీడీపీతో మైత్రిలో భాగంగా ఆ పార్టీ కార్యకర్తలను కూడా ఈ సభకు రప్పించేందుకు యత్నిస్తున్నట్టు సమాచారం. ఒత్తిళ్లు, ప్రలోభాలకు గురిచేసి ఏదో ఒకరకంగా జన సమీకరణ చేయాలనే యోచనలో ఆ పార్టీ నేతలు తీవ్రంగానే విఫలయత్నాలు చేస్తున్నారనే చర్చ జరుగుతున్నది.
భద్రాచలం ప్రశ్నిస్తోంది..?
మహాజన సంపర్క అభయాన్ సభల్లో భాగంగా గురువారం సాయంత్రం ఐదు గంటలకు ఖమ్మంలో బహిరంగ సభను ఏర్పాటు చేశారు. ఈ సభకు ముఖ్యఅతిథిగా హాజరవుతున్న అమిత్ షా నేరుగా హైదరాబాదు నుంచి భద్రాచలం వస్తారు. అక్కడ రామాలయాన్ని దర్శించుకుంటారు. ఈ నేపథ్యంలో భద్రాద్రి జిల్లా ప్రజానీకంతో పాటు ప్రతిపక్ష నేతలు సైతం బీజేపీ ముందు అనేక ప్రశ్నలు ఉంచబోతున్నారు. అయోధ్య రాముడు మినహా భద్రాద్రి రామున్ని ఏనాడూ పట్టించుకోని బీజేపీ.. పోలవరం ప్రాజెక్టు ఎత్తు పెంచుతుండటంతో భద్రాచలం ఉనికినే సంకటస్థితిలోకి నెట్టేసింది. పోలవరం పూర్తికాకముందే కొద్దిపాటి వర్షాలకే భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని అనేక ప్రాంతాలు ముంపునకు గురవుతున్నాయి. భద్రాచలం రామాలయ పరిసరాలు, పట్టణంలో సగభాగం రోజుల తరబడి నీటిలోనే ఉంటున్నాయి. అయినప్పటికీ కరకట్ట ఎత్తు పెంచేందుకు ఒక్క పైసా కూడా మోడీ ప్రభుత్వం ఇవ్వకపోవడం తీవ్ర విమర్శలకు దారితీస్తోంది. భద్రాచలం రాములోరి భూములున్న ఐదు పంచాయతీలను ఆంధ్రాలో విలీనం చేయడంతో కనీసం చెత్త డంపింగ్‌కు కూడా స్థలం లేకుండా పోయింది. పోడు భూములను సైతం కార్పొరేట్‌కు కట్టబెట్టే కుట్రపూరిత చర్యలకు పూనుకుంటోందనే ఆరోపణలున్నాయి. కొవ్వూరు – భద్రాచలం రోడ్డు రైల్వేలైన్, కొత్తగూడెం జిల్లా కేంద్రానికి సమీపంలో విమానాశ్రయం వంటి హామీలు నీటిమూటలుగానే మిగిలాయి. బయ్యారం ఇనుము – ఉక్కు పరిశ్రమపై బీజేపీ ప్రభుత్వం తీరు తీవ్ర విమర్శలను ఎదుర్కొంటోంది.
ఖమ్మం జిల్లాపై కార్పొ’రూట్’లతో దాడి
కార్పొరేట్ల కోసం ఖమ్మం జిల్లాలో విచ్చలవిడిగా జాతీయ రహదారులు నిర్మిస్తుండడంతో వేలాది ఎకరాల విలువైన భూములను రైతులు కోల్పోవాల్సి వస్తోంది. గౌతమ్ అదానీ కోసం నిర్మిస్తున్న నాగపూర్ – అమరావతి గ్రీన్ ఫీల్డ్ హైవేకు 3000 ఎకరాల భూమిని రైతులు కోల్పోతున్నారు. కొరవి – కోదాడ జాతీయ రహదారి విస్తరణలో మరో వెయ్యి ఎకరాలు, డోర్నకల్ – మిర్యాలగూడ రైల్వేలైన్ కు 800 ఎకరాల వరకు, కార్పొరేట్ల సౌలభ్యం, వందేమాతర్, తదితర ట్రైన్ ల రాకతో ఏర్పాటు చేస్తున్న మూడో రైలుమార్గంతో రెండువేల ఎకరాలకు పైగా భూములు, వేలాదిమంది ఇండ్లు కోల్పోతున్నారు. నిర్వాసితులకు ఇచ్చే పరిహారం మాత్రం నామమాత్రంగా ఉండటంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలపై విమర్శలు
హౌం మంత్రి అమిత్ షా పర్యటనలో తొలుత ఖమ్మంలో ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాల వేస్తారని షెడ్యూల్లో చేర్చడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇటీవల ఖమ్మం మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఎన్టీఆర్ జయంతి సందర్భంగా పూలమాల వేశారు. దీనిపై ఎన్టీఆర్ అభిమాన సంఘం తీవ్ర రాద్ధాంతం చేసింది. ఆయన పూలమాలవేసి వెళ్లిన అనంతరం పాలతో సంప్రోక్షణ చేశారు. రాష్ట్రాల హక్కులను కేంద్ర ప్రభుత్వాలు కాలరాస్తుండటాన్ని వ్యతిరేకిస్తూ ఆవిర్భవించిన పార్టీ తెలుగుదేశం…దాని వ్యవస్థాపకులు ఎన్టీఆర్ విగ్రహానికి అమిత్ షా పూలమాల వేస్తుండడం రాజకీయ ప్రయోజనాల కోసమేననే విమర్శలు వినిపిస్తున్నాయి. రాజకీయరహితంగా తొమ్మిదేళ్ల పాలన గురించి చెప్పుకునేందుకే ఈ సభను ఏర్పాటు చేస్తున్నట్లు బిజెపి జిల్లా అధ్యక్షులు గల్లా సత్యనారాయణ చెప్తున్నా ఇది పూర్తి ఎన్నికల పర్యటనగానే విమర్శకులు భావిస్తున్నారు.