18 నుంచి ప్రజా సంఘాల పోరాట వేదిక బస్సుయాత్ర

– పేదలకు ఇండ్లు, ఇండ్లస్థలాలు, డబుల్‌బెడ్రూంలు ఇవ్వాలని డిమాండ్‌
నవతెలంగాణ-హైదరాబాద్‌బ్యూరో
రాష్ట్రంలో ఇండ్లులేని పేదలకు ప్రభుత్వం ఇండ్లు, ఇండ్ల స్థలాలు, డబుల్‌బెడ్‌రూం ఇండ్లు ఇవ్వాలని డిమాండ్‌ చేస్తూ ఈనెల 18 నుంచి 27వ తేదీ వరకు బస్సు యాత్ర నిర్వహిస్తున్నట్టు తెలంగాణ ప్రజాసంఘాల పోరాట వేదిక కన్వీనర్‌ ఎస్‌ వీరయ్య తెలిపారు. మంగళవారంనాడిక్కడి ప్రెస్‌క్లబ్‌లో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన బస్సు యాత్ర వివరాలు వెల్లడించారు. 18వ తేదీ మహబూబాబాద్‌లో సీపీఐ(ఎం) పోలిట్‌బ్యూరో సభ్యురాలు బృందాకరత్‌ ఈ యాత్రను ప్రారంభిస్తారు. రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం ముఖ్యఅతిధిగా పాల్గొంటారు. బస్సు యాత్ర కోదాడ, ఖమ్మం, కొత్తగూడెం, భూపాలపల్లి, వరంగల్‌, హన్మకొండ, సిద్దిపేట, గోదావరి ఖని, చెన్నూర్‌, కోరుట్ల, నిజామాబాద్‌, బిక్కునూర్‌, మెదక్‌, సంగారెడ్డి, పరిగి, అమరచింత, నాగర్‌కర్నూల్‌ ప్రాంతాల్లో పర్యటిస్తుంది. ఇండ్లు లేని పేదలకు ఇండ్లు, ఇండ్లస్థలాలు, డబుల్‌బెడ్‌రూం ఇండ్లు ఇవ్వాలని డిమాండ్‌ చేస్తూ ఈనెల 24న తహసీల్దార్లకు దరఖాస్తులు చేస్తూ, ధర్నాలు నిర్వహిస్తారు. 27వ తేదీ రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నంలో ముగింపు సభ జరుగుతుంది. దీనిలో సీపీఐ(ఎం) పోలిట్‌బ్యూరో సభ్యులు బీవీ రాఘవులు ముఖ్య అతిధిగా పాల్గొంటారు. జులై 3వ తేదీ పెద్ద సంఖ్యలో పేదల్ని కదిలించి అన్ని జిల్లాల కలెక్టర్‌ కార్యాలయాల వద్ద మహాధర్నాలు చేపట్టి, పేదల గొంతును ప్రభుత్వాలకు వినిపించేలా చేస్తామని తెలిపారు. పదిరోజులపాటు 19 జిల్లాల్లో 61 గుడిసెవాసుల కేంద్రాల్లో యాత్రా బృందం పర్యటించి, వారిలో చైతన్యం నింపేలా కార్య క్రమాలు చేపడతారు. ఇండ్లులేని పేదల వివరాలతో ప్రత్యేక సర్వే కూడా చేస్తారు. భవిష్యత్‌ పోరాటాలకు వారిని సమాయత్తం చేసేలా పలు బహిరంగ సభలు నిర్వహిస్తారు. రాష్ట్రంలో ఇండ్లులేని పేదలు 30 లక్షల మంది ఉన్నారనేది అధికారిక లెక్క అనీ, వారి సమస్యల్ని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఎందుకు పరిష్కరించట్లేదని వీరయ్య ప్రశ్నించారు. 2022 డిసెంబర్‌ నాటికి ప్రధానమంత్రి ఆవాస్‌ యోజన పథకం ద్వారా అందరికీ ఇండ్లు ఇస్తామని ప్రధాని నరేంద్రమోడీ చెప్పి, మోసం చేశారని విమర్శిం చారు. రాష్ట్ర ప్రభుత్వం కూడా డబుల్‌బెడ్‌రూంలు ఇస్తామని చెప్పి 9 ఏండ్లు అయ్యిందనీ, ఇప్పటికీ ఆ హామీని పూర్తిగా అమలు చేయలేదన్నారు. ప్రభుత్వ భూముల్ని రియల్‌ఎస్టేట్‌ వ్యాపారులు, రాజకీయనేతలు కబ్జాలు చేస్తున్నారనీ, జీవో నెంబర్‌ 59తో అలాంటి భూముల్ని క్రమబద్ధీకరిస్తున్నారని చెప్పారు. పేదలు వంద గజాల జాగా కోరితే, వారిని కబ్జాదారులని ముద్రవేసి, తీవ్రమైన పోలీసు నిర్భంధం కొనసాగిస్తున్నారని తెలిపారు. ఇప్పటి వరకు ఇండ్ల జాగాల కోసం పోరాడుతున్న వెయ్యిమందిపై బైండోవర్‌ కేసులు పెట్టారనీ, 500 మందిపై నాన్‌బెయిలబుల్‌ కేసులు పెట్టి, వంద మందిని జైళ్లకు పంపారని చెప్పారు. పలుచోట్ల పోలీసులు జరిపిన లాఠీచార్జీల్లో 200 మంది గాయపడ్డారని తెలిపారు. ఇలాంటి చర్యల్ని తెలంగాణ ప్రజాసంఘాల పోరాట వేదిక తీవ్రంగా ఖండిస్తుంద న్నారు. గుడిసెవాసులందరికీ పట్టాలు ఇచ్చి, ఇండ్ల నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం రూ.5 లక్షలు, కేంద్ర ప్రభుత్వం రూ.10 లక్షలు ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. స్థలం ఉన్నవారికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రూ.15లక్షలు ఇవ్వాలనీ, స్థలం లేని పేదలకు ప్రభుత్వమే ఇంటిస్థలం ఇచ్చి, ఇంటి నిర్మాణానికి సహకరించాలని కోరారు. అర్హులందరికీ డబుల్‌బెడ్రూం ఇండ్లు వెంటనే కేటాయించాలనీ, గుడిసెవాసులపై నిర్భంధం ఆపేసి, అక్రమ కేసులు ఎత్తివేయాలని డిమాండ్‌ చేశారు. విలేకరుల సమావేశంలో తెలంగాణ ప్రజాసంఘాల పోరాట వేదిక రాష్ట్ర నాయకులు డీజీ నర్సింహారావు (పట్నం కన్వీనర్‌), టీ సాగర్‌ (తెలంగాణ రైతు సంఘం ప్రధాన కార్యదర్శి), ఆర్‌ వెంకట్రాములు (వ్యవసాయ కార్మిక సంఘం ప్రధాన కార్యదర్శి), జే వెంకటేష్‌, ఎస్‌ రమ, కే రమేష్‌ (సీఐటీయూ రాష్ట్ర కార్యదర్శులు), శ్రీరాంనాయక్‌ (తెలంగాణ గిరిజన సంఘం ప్రధాన కార్యదర్శి), కోట రమేష్‌, ఆనగంటి వెంకటేష్‌ (డీవైఎఫ్‌ఐ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు), బీ హైమవతి (ఐద్వా ఉపాధ్యక్షురాలు), జావేద్‌ (డీవైఎఫ్‌ఐ నగర కార్యదర్శి) పాల్గొన్నారు. బస్సుయాత్రను జయప్రదం చేయాలని వారు విజ్ఞప్తి చేశారు.

Spread the love