అందరికీ ఒకే విద్య

– ఆర్ధిక అసమానతలు పెంచొద్దు :డీవైఎఫ్‌ఐ సదస్సులో ఎమ్మెల్సీ ఏ నర్సిరెడ్డి
నవతెలంగాణ-హైదరాబాద్‌బ్యూరో
కేంద్రప్రభుత్వం అమల్లోకి తెచ్చిన నూతన విద్యా విధానం(ఎన్యీపీ)-2020ని చెత్తబుట్టలో వేయాలని ఉపాధ్యాయ ఎమ్మెల్సీ అలుగుబెల్లి నర్సిరెడ్డి అన్నారు. దీనివల్ల విద్యావ్యవస్థలో అసమానతలు పెరుగుతాయనీ, అగ్రకులాలు, సంపన్నవర్గాలకే విద్య అందుబాటులో ఉంటుందని ఆందోళన వ్యక్తం చేశారు. కేంద్రంలోని మోడీ ప్రభుత్వం మనుస్మృతి ప్రకారం పరిపాలన చేస్తున్నదనీ, ఫలితంగా నిచ్చెనమెట్ల కులవ్యవస్థతో అట్టడుగు కులాలు, వర్గాల ప్రజలు విద్యకు దూరమవుతారని చెప్పారు. భారత ప్రజాతంత్ర యువజన సమాఖ్య (డీవైఎఫ్‌ఐ) కేంద్ర కమిటీ సమావేశాలు ఈనెల 27, 28 తేదీల్లో హైదరాబాద్‌లోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో జరుగుతున్నాయి. ఈ సందర్భంగా శుక్రవారం ‘విద్య, ఉపాధి, పర్యావరణం’ అంశాలపై సదస్సును నిర్వహించారు. డీవైఎఫ్‌ఐ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు కోట రమేష్‌ అధ్యక్షతన జరిగిన ఈ సదస్సులో ఎమ్మెల్సీ నర్సిరెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొని, ప్రసంగించారు. దేశ సమస్యలపై యువతరం స్పందించాలని చెప్పారు. డీవైఎఫ్‌ఐ చారిత్రక నేపథ్యం గురించి వివరించారు. ప్రస్తుతం కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం మతోన్మాదం ద్వారా ప్రజల మధ్య విభజన సృష్టించే ప్రయత్నాలు చేస్తున్నదనీ, రాచరికి, నిచ్చెన మెట్ల వ్యవస్థలకు వ్యతిరేకంగా డీవైఎఫ్‌ఐ సమరశీల పోరాటాలు చేపట్టాలని ఆకాంక్షించారు. సమాజంలోని ప్రతి అంశంపై యువతరం స్పందించాలని అన్నారు. సమాజంలో ఆర్థిక, సామాజిక అసమానతలు, లింగవివక్ష లేని విద్యావిధానం ద్వారానే పురోభివృద్ధి సాధ్యమవుతుందన్నారు. కానీ అందుకు భిన్నంగా నూతన విద్యావిధానం-2020 పేరుతో కేంద్ర ప్రభుత్వం విద్యను కొందరికే పరిమితం చేసే కుట్రలు చేస్తున్నదని వివరించారు. రాష్ట్ర ప్రభుత్వం కూడా తన పరిధిలో విద్యారంగ సమస్యల పరిష్కారంలో విఫలం అవుతున్నదని గుర్తుచేశారు. ఇంటర్మీడియట్‌ కళాశాలల్లో తక్షణం గెస్ట్‌ లెక్చరర్స్‌ను విధుల్లోకి తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. కొఠారి కమిషన్‌ సిఫార్సుల్ని అమలు చేయాలని కోరారు. ప్రయివేటు విద్యాసంస్థల్లో కేవలం రంగురంగుల కరపత్రాలు, ప్రకటనలతో విద్యార్ధులకు ఆకర్షించే ప్రయత్నం చేస్తున్నారనీ,అక్కడ ఉపాధ్యాయులుగా పనిచేసేవారు ఎవరో కూడా విద్యార్థులకు తెలీదన్నారు. నాణ్యమైన విద్యను అందరికీ ఒకే రూపంలో అందించాల్సిన బాధ్యత ప్రభుత్వాలదేనని స్పష్టం చేశారు. ఫీజు రీయింబర్స్‌మెంట్‌లో గ్రేడింగ్‌ తేవడం ద్వారా విద్యానాణ్యతను వర్గీకరించే చర్యలకు పాల్పడుతు న్నారనీ, ఇది ఎంతమాత్రం ఆమోదయోగ్యం కాదన్నారు. రాజ్యాంగం ప్రకారం సమాజంలో అందరికీ సమాన అవకాశాలు లభించాలనీ, దాన్ని అమలు చేసే దిశగా ప్రభుత్వాలు నిర్ణయాలు తీసుకోవాలని కోరారు. కార్యక్రమానికి అధ్యక్షత వహించిన డీవైఎఫ్‌ఐ రాష్ట్ర అధ్యక్షులు కోట రమేష్‌ మాట్లాడుతూ విద్య కాషాయీకరణ జరుగుతున్న తీరును వివరించారు. స్వాతంత్య్ర సమరయోధుల చరిత్రల్ని పాఠ్యపుస్తకాల నుంచి తొలగిస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. మనువాద విద్య సమాజంలో అన్నిరకాల అసమానతల్ని పెంచుతు ందని విశ్లేషించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ప్రజా వ్యతిరేక విధానాలపై డీవైఎఫ్‌ఐ చిత్తశుద్ధితో కూడిన పోరాటాలను చేస్తుందని చెప్పారు. ఈ పోరాటాల్లో ప్రజలు, యువతరం కలిసిరావాలని విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో డీవైఎఫ్‌ఐ కార్యదర్శి ఏ వెంకటేష్‌, ఉపాధ్యక్షులు బషీర్‌, సహాయకార్యదర్శి జావేద్‌తో పాటు ఆఫీస్‌ బేరర్లు అందరూ పాల్గొన్నారు.

Spread the love