– ఈసారి అమెరికాలో.. వీడియో వైరల్
న్యూయార్క్ : దేశ రాజధాని ఢిల్లీ నుంచి నుంచి బయలుదేరి హర్యానాకు ట్రక్కులో అర్ధరాత్రంతా ప్రయాణించి డ్రైవర్ల కష్టాలు తెలుసుకున్న రాహుల్ గాంధీ ఈసారి తన తాజా యూఎస్ టూర్ లోనూ ట్రక్కులో ప్రయాణం చేశారు. ఇందుకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమంలో వైరల్ అయ్యింది. వాషింగ్టన్ డీసీ నుంచి న్యూయార్క్ వరకూ ఆయన ట్రక్కులో ప్రయాణించారు. ఓ భారతీయ డ్రైవర్ నడుపుతున్న యూఎస్ ట్రక్కును ఎక్కిన రాహుల్ గాంధీ.. ఆయనతో కలిసి చలాకీగా మాట్లాడుతూ ఉత్సాహపరి చారు. మధ్యలో రెండేండ్ల క్రితం హత్యకు గురైన పంజాబీ సింగర్ సిద్ధూ మూసేవాలా పాట పెట్టాలంటూ డ్రైవర్‌ను అడిగారు. భారత్‌లో ట్రక్కు నడపటానికీ, యూఎస్‌లో ట్రక్ నడపటానికీ మధ్య వ్యత్యాసం ఏంటనేది స్వయంగా రాహుల్ ఆ డ్రైవర్‌ను అడిగి తెలుసుకున్నారు. అలాగే డ్రైవింగ్ ద్వారా అతను ఎంత సంపాదిస్తున్నాదీ అడిగారు. దీనికి సమాధానంగా డ్రైవర్ తాల్జిందర్ సింగ్.. భారత్‌తో పోలిస్తే డ్రైవింగ్ ద్వారా యూఎస్‌లోనే తాను ఎక్కువగా సంపాదిస్తున్నట్టు చెప్పాడు. అలాగే యూఎస్‌లో డ్రైవింగ్‌కు అనువుగా టక్కులను తయారు చేయడం పట్ల కూడా రాహుల్ గాంధీ ఆశ్చర్యం వ్యక్తం చేశారు. అనంతరం భారత్‌కూ, యూఎస్ కూ డ్రైవింగ్ పరిస్ధితుల్లో ఉండే తేడాను కూడా వారిద్దరూ ముచ్చటించుకున్నారు. ఈ సందర్భంగా తాజాగా తాను భారత్‌లో చేసిన ట్రక్ ప్రయాణాన్ని రాహుల్ గాంధీ గుర్తుచేసుకున్నారు.