తరుగుతున్న ఉక్రెయిన్‌ సైన్యానికి మద్దతుగా విదేశీ కిరాయి సైన్యాన్ని దించుతున్న అమెరికా

న్యూయార్క్‌: ఒకవైపు అమెరి కన్లను ఉక్రెయిన్‌ యుద్ధానికి దూరంగా ఉండమని చెబుతూనే మరోవైపు అమెరికా ప్రయోజనాల కోసం బైడెన్‌ కిరాయి సైనికులను వినియోగిస్తున్నాడు. ఇప్పటి వరకున్న కిరాయి సైనికులలో అమెరికన్లు అంతగా లేరని రష్యా చానెల్‌ ఒన్‌ న్యూస్‌ పేర్కొంది. పోలండ్‌, కెనడా దేశాల నుంచే కిరాయి సైనికులు ఎక్కువగా ఉన్నారు. ఆ తరువాత స్థానం అమెరికాది.
ఉక్రెయిన్‌లో రష్యాకు వ్యతిరేకంగా అమెరికా ప్రయోజనాల కోసం పని చేయటానికి, రోజురోజుకూ తరుగుతున్న ఉక్రెయిన్‌ సైన్యానికి మద్దతుగా పనిచేయటానికి అమెరికా గూఢచార సంస్థలు విదేశీ కిరాయి సైనికులను సమీకరిస్తున్నాయి. రష్యా రక్షణ మంత్రిత్వ శాఖ అంచనా ప్రకారం 7000మంది కిరాయి సైనికులలో 2000 మంది యుద్ధంలో చనిపోయారు. పశ్చిమ దేశాల నుంచి ఉక్రెయిన్‌ యుద్ధంలో పాల్గొంటున్న కిరాయి సైనికులు ఎక్కువగా చనిపోతుండటం ఆయా దేశాలను కలవరపరుస్తోంది. వీరిలో చాలామందికి సైనిక శిక్షణ పొందిన చరిత్ర కూడా లేదు. మే నెలలో ఉక్రెయిన్‌లో కిరాయి సైన్యం గ్రూపులో ఇద్దరు కెనడా కిరాయి సైనికులు చేరారు. వీరు బాఖ్మత్‌లో జరిగిన యుద్ధంలో తమ ప్రాణాలను కోల్పోయారు. వీరిలో ఒకరు కెనడా సైన్యంలో డాక్టర్‌గా పనిచేశాడు. యుద్ధంలో గాయపడిన సైనికులకు కట్లు కట్టిన అనుభవంవున్న వాళ్ళు యుద్ధ రంగంలో ఆయుధాలను ఉపయోగించటం ఎలా సాధ్యం? అనే ప్రశ్నకు సమాధానం చెప్పటానికి కెనడా ప్రభుత్వం సుముఖంగా లేదు. ఏప్రిల్‌ నెలలో అమెరికన్‌ కూపర్‌ హారిస్‌ బాఖ్మత్‌ యుద్ధంలోనే చనిపోయాడని ఫాక్స్‌ న్యూస్‌ ప్రకటించింది. ఇతను గ్రౌండ్‌ ఎలెక్ట్రానికి సిస్టెమ్‌ ఇంజినీర్‌గా పనిచేశాడే తప్ప సైనిక శిక్షణ ఉన్నవాడు కాదు. ఖార్కోవ్‌లో పట్టుబడిన మరో ఇద్దరు అమెరికన్లకు కూడా సైనిక శిక్షణ లేదని చానల్‌ ఒన్‌ చెప్పింది. ఇక్కడ తెలుస్తున్నదేమంటే విదేశీ కిరాయి సైనికులకు చాలావరకు సైనిక శిక్షణ లేకపోవటమే కాకుండా వీరికి ఉక్రెయిన్‌ ప్రభుత్వం నుంచి సరియైన మద్దతు కూడా అందటం లేదు. ఉక్రెయిన్‌లో పనిచేస్తున్న విదేశీ కిరాయి సైనికుల సంఖ్య యుద్ధంలో చనిపోవటం వల్లనూ, పరిస్థితిని అర్థం చేసుకుని నిష్క్రమించటం వల్లనూ తరిగిపోతూవుంది. సిరియాలో అమెరికా గూఢచార సంస్థలు కొత్తగా కిరాయి సైనికులను రిక్రూట్‌ చేసుకుంటున్నాయని మిడిల్‌ ఈస్టర్న్‌ మీడియా నుంచి అనధికార వార్తలు అందుతున్నాయి. అమెరికాకు తన సైన్యాన్నిగానీ, తన పౌరులనుగానీ ఉక్రెయిన్‌ యుద్ధంలో రష్యాతో తలపడేలా చెయ్యటం ఇష్టం లేదు. ప్రాణాలు తమవి కానంతవరకూ ఉక్రెయిన్‌లోగానీ, మరే ఇతర దేశంలోగానీ మానవ హననం ఎంత జరిగినా అమెరికా హృదయం కరగదని మరోమారు రుజువౌతోంది.

Spread the love