శాన్‌ఫ్రాన్సిస్కోలో భారత్‌ కాన్సులేట్‌పై దాడి ఖండించిన అమెరికా

న్యూయార్క్‌ : శాన్‌ఫ్రాన్సిస్కోలోని భారత కాన్సులేట్‌ కార్యాలయాన్ని ధ్వంసం చేయడాన్ని, పైగా ఆ కార్యాలయానికి నిప్పంటించడానికి జరిగిన ప్రయత్నాన్ని అమెరికా తీవ్రంగా ఖండించింది. అమెరికాలోని విదేశీ దౌత్యవేత్తలపై లేదా దౌత్య కార్యాలయాలపై విధ్వంసం లేదా హింసకు పాల్పడడమనేది క్రిమినల్‌ నేరమని విదేశాంగ శాఖ ప్రతినిధి మాథ్యూ మిల్లర్‌ 3వ తేదీన ట్వీట్‌ చేశారు. ఖలిస్తాన్‌ మద్దతుదారులు ఈ నెల 2వ తేదీన ట్విటర్‌లో ఈ వీడియో పోస్ట్‌ చేశారు. కెనడాలోని భారత దౌత్యవేత్తలను బెదిరిస్తూ ఖలిస్తాన్‌ పోస్టర్లు వెలియడంతో కెనడా హై కమిషనర్‌కు విదేశాంగ మంత్రిత్వ శాఖ సమన్లు పంపింది. ”హింస హింసను పుట్టిస్తుంది అన్న మాటలతో వున్న ఆ వీడియోలో కెనడాకి చెందిన ఖలిస్తాన్‌ టైగర్‌ ఫోర్స్‌ (కెటిఎఫ్‌) చీఫ్‌ హర్‌దీప్‌ సింగ్‌ నిజార్‌ మృతికి సంబంధించిన వ్యాసాలను కూడా ప్రదర్శించారు. గత నెల్లోనే కెనడాలో గురుద్వారా వెలుపల నిజార్‌ను కాల్చి చంపారు. ఆదివారం తెల్లవారు జామున 1.30-2.30గంటల మధ్య భారత కాన్సులేట్‌ కార్యాలయానికి నిప్పంటించారని అమెరికాలో దక్షిణాసియా బ్రాడ్‌కాస్ట్‌ టివి నెట్‌వర్క్‌కి చెందిన దియా టివి పేర్కొంది. వెంటనే శాన్‌ఫ్రాన్సిస్కో అధికారులు మంటలను ఆర్పివేశారని, ఎవరూ గాయపడలేదని, నష్టం పరిమితంగానే వుందని తెలిపారు.

Spread the love