నోబల్‌ బహుమతి గ్రహీత, లిథియం బ్యాటరీ సహ సృష్టికర్త జాన్‌ గూడెనఫ్‌ కన్నుమూత

ఆస్టిన్‌ : నోబెల్‌ బహుమతీ గ్రహీత, లిథియం-అయాన్‌ బ్యాటరీ సహ సృష్టికర్త జాన్‌ గూడెనఫ్‌ వందేళ్ల వయస్సులో మంగళవారం కన్ను మూశారని టెక్సాస్‌ యూనివర్శిటీ ప్రకటించింది. పునర్వి నియోగపరచదగిన విద్యుత్‌తో సాంకేతిక పరిజ్ఞానాన్ని మార్చిన లిథియం అయాన్‌ బ్యాటరీని అభివృద్దిపరచడంలో గూడెనఫ్‌ కృషి చేసినందుకు 2019లో రసాయన శాస్త్రంలో నోబెల్‌ బహుమతిని అమెరికన్‌, జపాన్‌ శాస్త్రవేత్తలతో పంచుకున్నారు. ఆస్టిన్‌లో ఆదివారం ఆయన కన్నుమూశారని యూనివర్శిటీ ప్రకటించింది. మరణానికి గల కారణమేంటనేది వెల్లడించలేదు. దాదాపు 40ఏళ్ల నుండి టెక్సాస్‌లో ఆయన ఫ్యాకల్టీ సభ్యునిగా వున్నారు. జర్మనీలోని జెనాలో 1922లో జన్మించిన గూడెనఫ్‌ అమెరికాలో పెరిగారు. చికాగో యూనివర్శిటీ నుండి రసాయన శాస్త్రంలో పిహెచ్‌డి అందుకున్నారు. నోబెల్‌ అందుకున్న అతిపెద్ద వయస్కుడిగా ఆయన పేరుగాంచారు. ’97ఏళ్ళ వరకు జీవిస్తే మీరేదైనా చేయగలరు’ అని ఆయన ఒక సందర్భంలో వ్యాఖ్యానించారు. 65ఏళ్ళకే రిటైరవమని తనపై ఒత్తిడి రాలేదని అందుకు తాను సర్వదా కృతజ్ఞుడినని ఒకసారి చెప్పుకొచ్చారు. సెల్‌ఫోన్లు, కంప్యూటర్లు, పేస్‌మేకర్లు నుండి ఎలక్ట్రిక్‌ కార్ల వరకు లిథియం బ్యాటరీని ఉపయోగించవచ్చు. రీచార్జ్‌ పోర్ట్‌తో ఈనాడు ఎక్కడికన్నా తీసుకెళ్ళగలిగలా ఫోన్లు, టాబ్లెట్లు, వున్నాయంటే అందుకు సాంకేతిక రంగంలో విప్లవాన్ని తీసుకువచ్చిన గూడెనఫ్‌ పరిశోధనలే కారణం. లిథియం అయాన్‌ బ్యాటరీలే మొట్టమొదటి పోర్టబుల్‌, రీచార్జిబుల్‌ బ్యాటరీలు. ఇవి అభివృద్ధి చెందడానికి దశాబ్ద కాలంపైగా పట్టింది.

Spread the love