రష్యా సరిహద్దులో నాటో సైనిక దళాలను శాశ్వతంగా మోహరించాలి

– లిథ్యూనియా అధ్యక్షుడు
రష్యా అణ్వాయుధ సామర్థ్యాన్ని పట్టించుకోకుండా రష్యా సరిహద్దు వెంట నాటో దళాలను మోహరించాలని లిథ్యూనియా ఆతిథ్యంతో విల్నియస్‌ లో అమెరికా నాయకత్వంలోని నాటో సైనిక కూటమి శిఖరాగ్ర సభ 11వ తేదీ నుంచి జరుగుతున్నసందర్బంగా ఆ దేశ అధ్యక్షుడు, గిటనాస్‌ నాసేడా టైమ్స్‌ వార్తా పత్రికకు చెప్పాడు.
రష్యా భూభాగానికి చేరువలో సైనిక దళాలను శాశ్వత ప్రాతిపధికన మోహరించరాదని 1997లో రష్యాకు, నాటో కు మధ్య జరిగిన ఒప్పందాన్ని రద్దు చేయాలని కూడా ఆయన వాదించాడు. 4000 మంది జర్మన్‌ సైన్యాన్ని శాశ్వతంగా తన దేశంలో ఉంచాలని లిథ్యూనియా కోరుతోంది.
బైలో రష్యా అభ్యర్థన మేరకు రష్యా తన అణ్వస్త్ర ఆయుధాలను బైలో రష్యాకు తరలించింది. అణ్వస్త్ర ఆయుధాలు లేని దేశాలైన జర్మనీ, ఇటలీ, స్వీడెన్‌, టర్కీలలో అనేక దశాబ్దాలుగా తన అణ్వస్త్ర ఆయుధాలను ఉంచిన చరిత్ర అమెరికాకు ఉంది. అయితే రష్యా చర్యను ”న్యూక్లియర్‌ బ్లాక్‌ మెయిల్‌”గా పశ్చిమ దేశాలు అభివర్ణిస్తు న్నాయి. నాటో సైనిక దళాల ఉనికి తమ పొరుగు దేశాలలో పెరిగినందువల్లనే బైలో రష్యా అణ్వస్త్ర ఆయుధాల కోసం రష్యాను అభ్యర్థించిందని ఆ దేశం పేర్కొంది. నాటోను రష్యా సరిహద్దులదాకా విస్తరించటమే కాకుండా ఉక్రెయిన్‌లో కీలుబొమ్మ ప్రభుత్వంతో యుద్ధాన్ని కొనసాగిస్తూ 1980వ, 1990వ దశకాలలో రష్యాకు ఇచ్చిన హామీలను ఉల్లంఘించి తమ దేశ భద్రతకు నాటో సైనిక కూటమి ప్రమాదాన్ని కొనితెచ్చిందని రష్యా ఆరోపిస్తున్నది. ఉక్రెయిన్‌ యుద్ధం జరగటానికి ఒక సంవత్సరం ముందు నాటో దేశాలనుంచి రాయితీలకోసం రష్యా ప్రయత్నించినా ఫలితంలేకుండా పోయింది.

Spread the love