రష్యాకు ఆప్త మిత్రుడు మోడీ ! పుతిన్‌ వ్యాఖ్యలు

– మేక్‌ ఇన్‌ ఇండియా చొరవకు ప్రశంసలు
మాస్కో : ప్రధాని నరేంద్ర మోడీ రష్యాకు ఆప్త మిత్రుడని రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్‌ పుతిన్‌ వ్యాఖ్యానించారు. మోడీ చేపట్టిన ‘మేక్‌ ఇన్‌ ఇండియా’ ప్రచారం ఆ దేశ ఆర్థిక వ్యవస్థపై అద్భుతమైన ప్రభావాన్ని కనబరిచిందని అన్నారు. రష్యా వ్యూహాత్మక చొరవల సంస్థ (ఎఎస్‌ఐ) నిర్వహించిన కార్యక్రమంలో గురువారం పుతిన్‌ పై వ్యాఖ్యలు చేశారు. ”భారత్‌లో మా మిత్రులు, మా ఆప్త మిత్రుడు, ప్రధాని నరేంద్ర మోడీ కొన్నేళ్ళ క్రితం మేక్‌ ఇన్‌ ఇండియా చొరవ చేపట్టారు. భారత ఆర్థిక వ్యవస్థపై ఆ చొరవ అద్భుతమైన ప్రభావాన్ని కనబరిచింది. మనం కాకపోయినా మన స్నేహతులే దాన్ని సృష్టించినా, అది బాగా పనిచేస్తున్నపుడు దాన్ని అనుకరించడంలో ఎలాంటి హానీ వుండదు.” అని పుతిన్‌ వ్యాఖ్యానించినట్లు ఆర్‌టి న్యూస్‌ పేర్కొంది. పశ్చిమ దేశాలు అనుసరిస్తున్న ఆంక్షల విధానాల కారణంగా రష్యా కంపెనీలకు భారత్‌లో గల అవకాశాలపై పుతిన్‌ చర్చించారు. మన కంపెనీలు తమ ఉత్పత్తులను మరింత సమర్ధవంతంగా మార్కెట్‌ చేసుకోవడానికి సాయపడేలా మాస్కోకు సపోర్ట్‌ టూల్స్‌ (మద్దతు సాధనాలను) అందచేయడం ప్రస్తుత అవసరంగా వుందన్నారు.
స్థానిక తయారీరంగ సామర్ధ్యాలను అభివృద్ధిపరుచుకోవడానికి, విదేశీ పెట్టుబడుదారులను ఆకర్షించడానికి సమర్ధవంతమైన నమూనాను సృష్టించిన ఘనత భారత నాయకత్వానిదేనని అన్నారు. మన ఉత్పత్తులు మరింత సౌకర్యవంతంగా, బాగా పనిచేసేలా తయారుచేయడం గురించి ఆలోచించాల్సిన అవసరం వుందని నొక్కి చెప్పారు. ఆధునిక దృక్పథంతో ఈ విషయంలో ఆలోచించాలన్నారు. దేశీయ వ్యాపారాన్ని అభివృద్ధిపరచడానికి పారిశ్రామిక, ఉత్పత్తి నమూనా అనేది అత్యంత ముఖ్యమైన వనరుగా మారిందని పుతిన్‌ పేర్కొన్నారు. వాగర్‌ చీఫ్‌ తిరుగుబాటుకు విఫల ప్రయత్నం చేసిన నేపథ్యంలో పుతిన్‌ ఇలా బహిరంగంగా కనిపించిన కార్యక్రమాల్లో ఇదొకటి. రష్యాలో తాజా పరిణామాల నేపథ్యంలో రష్యా భద్రతా మండలి కార్యదర్శి నికొలారు పాత్రుషెవ్‌ బుధవారం భారత జాతీయ భద్రతా సలహాదారు అజిత్‌ దోవల్‌తో మాట్లాడి దేశంలోని పరిస్థితులను వివరించారు. 2014లో ప్రధాని మోడీ మేక్‌ ఇన్‌ ఇండియా చొరవను చేపట్టారు.
ఉత్పత్తులను తయారుచేయడం, అభివృద్ధిపరచడం, అసెంబుల్‌ చేయడం వంటి కార్యకలాపాలన్నీ దేశీయంగానే చేపట్టేలా కంపెనీలను ఏర్పాటు చేసి, ప్రోత్సహించడం, అలాగే తయారీ రంగంలో రాయితీలతో కూడిన పెట్టుబడులను ప్రోత్సహించడం ఈ కార్యక్రమం లక్ష్యంగా వుందని ఆర్‌టి న్యూస్‌ పేర్కొంది. 140కోట్ల మంది ప్రజలతో, 3.7లక్షల కోట్ల డాలర్లతో ఐదవ అతిపెద్ద జిడిపిగా భారత్‌ ఇటీవలి కాలంలో లైసెన్స్‌ తయారీకి ప్రత్యామ్నాయ కేంద్రంగా ఆవిర్భవించడమే కాకుండా విదేశీ పెట్టుబడిదారులకు పెద్ద ఎత్తున వినిమయ మార్కెట్‌గా కూడా తయారైందని ఆ వార్తా సంస్థ పేర్కొంది. భారత్‌ పెట్టుబడులు పెరిగాయని, ప్రత్యక్ష విదేశీ పెట్టుబడులు గణనీయంగా పెరిగాయని పేర్కొంది.

Spread the love