మాస్కో : చైనాతో తమ బలమైన సైనిక భాగస్వామ్యం ప్రపంచవ్యాప్తంగా సుస్థిరతను అందచేస్తుందని రష్యా సాయుధ బలగాల చీఫ్ ఆఫ్ స్టాఫ్ వాలెరి గెరాసిమొవ్ శుక్రవారం పేర్కొన్నారు. ఉక్రెయిన్‌లో రష్యా సైనిక చర్యలకు కమాండర్‌గా వ్యవహరిస్తున్న గెరాసిమొవ్ చైనా సాయుధ బలగాల చీఫ్ ఆఫ్ స్టాఫ్ లియూ ఝెన్‌లీతో వీడియో కాన్ఫరెన్స్ సందర్భంగా ఈ వ్యాఖ్యలు చేశారు. అంతర్జాతీయ వేదికపై రష్యా, చైనా ప్రయత్నాల సమన్వయం మొత్తంగా అంతర్జాతీయ స్థితిగతులపై సుస్థిర ప్రభావాన్ని కనబరుస్తుందని గెరాసిమొవ్ చెప్పారు. ఈ మేరకు రష్యా రక్షణ మంత్రిత్వ శాఖ ఒక వీడియోను విడుదల చేసింది.
వ్యూహాత్మకమైన రష్యా-చైనా రక్షణ భాగస్వామ్యాన్ని బలోపేతం చేయడాన్ని కొనసాగించడానికి ఈనాటి సమావేశాలు దోహదపడతాయని అన్నారు. ఈ భాగస్వామ్యానికి రష్యా, చైనా సంయుక్త మిలటరీ విన్యాసాలు ప్రధాన వేదికగా వుండాలన్నారు. లియూను మాస్కోలో పర్యటించాల్సిందిగా ఆహ్వానించారు. ఆర్థిక, మిలటరీ రంగాల్లో తమ భాగస్వామ్యానికి, సహకారానికి పరిమితులు లేవని ఇరు పక్షాలు పదే పదే చెబుతూ వస్తున్నాయి.
ఉక్రెయిన్‌లో రష్యా సైనికచర్య, ఫలితంగా పశ్చిమ దేశాల ఆంక్షల నేపథ్యంలో ఈ రెండు దేశాలు మరింత సన్నిహితమయ్యాయి.