జీ-7దేశాల ‘విశ్వసనీయత’ను ప్రశ్నిస్తున్న చైనా

జీ-దేశాలు రుద్దుతున్న పశ్చిమ దేశాలకు అనుకూల నియమనిబంధనలను అంతర్జాతీయ సమాజం అంగీకరించదని, ప్రపంచపైన అమెరికా నాయకత్వంలోని కూటమి ఆధిపత్యాన్ని అనుమతించదని చైనా విదేశాంగ మంత్రిత్వ శాఖ శనివారం నాడు ఒక ప్రకటనలో పేర్కొంది. ”ఏవో కొన్ని దేశాలు బలవంతంగా రుద్దే నిబంధనలను చైనా ఎన్నటికీ అంగీకరించబోదు. భావజాలం, విలువల ఆధారంగా ప్రపంచాన్ని విడదీసే జీ-7 దేశాలలోగల పశ్చిమ ఐరోపా దేశాల ఆధిపత్యంతో రూపొందించిన నియమాలను అంతర్జాతీయ సమాజం అంగీకరించదు, అంగీకరించ జాలదు” అని చైనా ప్రకటించింది.
”అమెరికా ఫస్ట్‌” విధానాలను అమలుచేయటం కోసం ఒక గ్రూపు తన అభిప్రాయాలను ఇతరులపైన బలవంతంగా రుద్దటానికి ప్రయత్నిస్తోందని చైనావిదేశాంగ శాఖ ఆరోపించింది. ఏవో కొని పశ్చిమ దేశాలు ఇతర దేశాల అంతర్గత వ్యవహారాలలో జోక్యం చేసుకుంటూ అంతర్జాతీయ వ్యవహారాలను తమకు అనుకూలంగా చక్కబెట్టుకునే రోజులు గతించాయి. అమెరికా, కెనడా, బ్రిటన్‌ ఫ్రాన్స్‌, జర్మనీ, ఇటలీ, జపాన్‌ దేశాల క్లబ్‌ ని జీ-7 దేశాలు అని పిలుస్తారు. ఈ జీ-7 వార్షిక సమావేశాలకు యూరోపియన్‌ యూనియన్‌ కు ప్రాతినిధ్యంవహించే అధికారులు హాజరౌతూ ఉంటారు.
జీ-7 దేశాలు జపాన్‌ లోని హిరోషిమాలో సమావేశమై శనివారం ఒక సంయుక్త ప్రకటనను విడుదల చేశాయి. ఈ ప్రకటనలో చైనా సాంకేతిక పరిజ్ఞానాన్ని దొంగతనం చేస్తున్నదని, ”ఆర్థిక బలత్కారాల”కు పాల్పడుతున్నదని, దేశంలో మానవ హక్కుల ఉల్లఘన చేస్తున్నదని ఆరోపించటం జరిగింది. అంతేకాకుండా తైవాన్‌, దక్షిణ చైనా సముద్ర ప్రాంతంలో ఏకపక్షంగా ఎటువంటి మార్పులు చేయటానికి ప్రయత్నించినా తాము వ్యతిరేకిస్తామని ఆ ప్రకటనలో చెప్పారు. ఈ ప్రకటనకు ప్రతిగా హంగ్‌ కాంగ్‌, క్షిన్జియాంగ్‌, టిబెట్‌ లు తమ ఆంతరంగిక విషయాలని, తైవాన్‌ స్వతంత్ర దేశంగా ఉండాలనే శక్తులకు జీ-7 దేశాలు తమ మద్దతునిస్తూ ఆ ప్రాంతంలో శాంతికి విఘాతం కలిగిస్తున్నాయని చైనా ఆరోపించింది. జీ-7 దేశాలకు తైవాన్‌ తో దౌత్య సంబంధాలు లేనప్పటికీ అమెరికా తైవాన్‌ కు అత్యంత ఆధునిక ఆయుధాలను సరఫరా చేస్తోంది. ఇది చైనా అంతర్గత వ్యవహారాల్లో అమెరికా జోక్యం చేసుకోవటంతప్ప మరొకటికాదని చైనా విమర్శిస్తోంది.

Spread the love