క్రీడా స్ఫూర్తితో

– అంతర్జాతీయ సవాళ్ళను ఎదుర్కొనాలి
– చెంగ్డూలో విదేశీ నేతలతో జిన్‌పింగ్‌ బిజీ బిజీ….
బీజింగ్‌ : క్రీడా కార్యక్రమాల్లో చూపే స్ఫూర్తినే అంతర్జాతీయ సవాళ్ళను సంఘీభావంతో తట్టుకుని నిలబడడంలో కూడా ప్రదర్శించాలని జిన్‌పింగ్‌ కోరారు. అందరినీ కలుపుకుని పోయే స్ఫూర్తితో ముందుకు సాగుతూ దేశాలు సామరస్యాన్ని పెంపొందించుకునేందుకు, పరస్పర మార్పిడులను పెంచుకునేందుకు కృషి చేయాలని కోరారు.
31వ ఫిసు వరల్డ్‌ యూనివర్శిటీ గేమ్స్‌ ప్రారంభం సందర్భంగా వాయవ్య చైనాలోని సిచువాన్‌ ప్రావిన్స్‌లోని చెంగ్డూలో ఒకపక్క యువ క్రీడాకారులు పోటీ పడుతుండగా, మరో పక్క చైనా విదేశీ నేతలతో తన దౌత్య చర్యలు ఆరంభించింది. పేద, వర్ధమాన దేశాలతో ద్వైపాక్షిక సంబంధాలను మరింతగా ఎలా పెంపొందించుకోవాలి, సంఘీభావాన్ని ఎలా బలోపేతం చేసుకోవాలనే అంశాలపై చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌ విదేశీ నేతలతో చర్చించారు. వచ్చిన విదేశీ నేతలను సాదరంగా స్వాగతించిన అనంతరం వారితో చర్చలు జరిపారు.
శుక్రవారం చెంగ్డూ క్రీడా పోటీల ప్రారంభోత్సవ కార్యక్రమానికి జిన్‌పింగ్‌ హాజరయ్యారు. ఆయనతో పాటూ గుయానా అధ్యక్షుడు ఇర్ఫాన్‌ అలీ, జార్జియా ప్రధాని ఇర్కలీ, ఇండోనేషియా అధ్యక్షుడు జోకో విడొడొ, బురుండి, మారిటానియా అధ్యక్షులు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. అనంతరం ఏర్పాటు చేసిన విందు సమావేశంలో జిన్‌పింగ్‌ మాట్లాడారు. వరల్డ్‌ యూనివర్శిటీ గేమ్ప్‌ అనేవి ఎప్పుడూ యువతకు, సంఘీభావానికి, స్నేహ బంధానికి ప్రతీక వంటివని వ్యాఖ్యానించారు. గురు, శుక్రవారాల్లో పలువురు విదేశీ నేతతో జిన్‌పింగ్‌ విడివిడిగా సమావేశాలు జరిపారు. ఆచరణాత్మక సహకారాన్ని గురించి చర్చించారు. భవిష్యత్‌ తరాలకు మెరుగైన భవితవ్యం గల సమాజ నిర్మాణానికి పాటు పడాలని కోరారు.
ఇండోనేషియా అధ్యక్షుడు జోకో విడొడొతో జరిపిన సమావేశంలో జిన్‌పింగ్‌ మాట్లాడుతూ, వ్యూహాత్మక సహకారాన్ని పెంచుకునేందుకు ఈ పర్యటన ఒక మంచి అవకాశమని అన్నారు.
సాంప్రదాయ స్నేహ బంధానికి చైనా అత్యధిక ప్రాధాన్యతనిస్తుందని, అలాగే ప్రపంచ పేద, వర్ధమాన దేశాలతో ఆచరణాత్మక సహకారం, సంఘీభావాన్ని కోరుకుంటోందని, విదేశీ నేతలతో జిన్‌పింగ్‌ సమావేశాల ద్వారా ఈ విషయం స్పష్టమవుతోందని రాజకీయ విశ్లేషకులు వ్యాఖ్యానిస్తున్నారు.

Spread the love