భారత్‌లో ఎస్‌సిఓ సదస్సుకు చైనా అద్యక్షుడు జిన్‌పింగ్‌

బీజింగ్‌ : వచ్చే వారం భారత్‌ ఆన్‌లైన్‌లో నిర్వహించే షాంఘై సహకార సంస్థ (ఎస్‌సిఓ) సదస్సులో చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌ పాల్గొంటారని చైనా విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి హువా చునియాంగ్‌ శుక్రవారం తెలిపారు. ప్రధాని నరేంద్ర మోడీ ఆహ్వానం మేరకు జులై 4న ఎస్‌సిఓ దేశాధినేతల 23వ సమావేశంలో జిన్‌పింగ్‌ వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా పాల్గొంటారని, ప్రసంగిస్తారని చునియాంగ్‌ తెలిపారు. మరో మీడియా సమావేశంలో చైనా విదేశాంగ శాఖ మరో ప్రతినిధి మావో నింగ్‌ మాట్లాడుతూ, ఇతర దేశాల నేతలతో కలిసి జిన్‌పింగ్‌ భవిష్యత్‌లో ఎస్‌సిఓ అభివృద్ధికి కార్యాచరణను రూపొందిస్తారని చెప్పారు. అన్ని పక్షాల సంఘటిత కృషితో ఎస్‌సిఓ మరింత గొప్ప పురోగతిని సాధిస్తుందని, ప్రాంతీయ దేశాల్లో అభివృద్ధి, సంక్షేమాన్ని పెంపొందిస్తుందని ఆమె పేర్కొన్నారు. ఎస్‌సిఓను ఏర్పాటు చేసినప్పటి నుండి సభ్య దేశాల మధ్య పరస్పర రాజకీయ విశ్వాసం నెలకొనేలా, సత్సంబంధాలు వుండేలా కృషి చేస్తూనే వచ్చిందన్నారు. వివిధరంగాల్లో విస్తృత సహకారం కూడా వుందన్నారు. అంతర్జాతీయ, ప్రాంతీయ వ్యవహారాల్లో కీలకమైన, నిర్మాణాత్మకమైన పాత్రను పోషిస్తోందన్నారు. అంతర్జాతీయ అభివృద్ధి చొరవ (జిడిఐ), అంతర్జాతీయ భద్రతా చొరవ (జిఎస్‌ఐ), అంతర్జాతీయ పౌర చొరవ (జిసిఐ)లపై సభ్య దేశాలతో కలిసి పనిచేయడానికి తాము సిద్ధంగా వున్నామని మావో నింగ్‌ చెప్పారు.

Spread the love