ప్రజాస్వామ్యం విజయం సాధిస్తుంది

– నైజర్‌ అధ్యక్షుడి వ్యాఖ్య
నియామె : దేశంలో ప్రజాస్వామ్యం విజయం సాధిస్తుందని నైజర్‌ అధ్యక్షుడు ప్రకటించారు. ఎంతగానో కష్టపడి సాధించుకున్నవన్నీ కచ్చితంగా రక్షించబడతాయని గురువారం ఉదయమే ట్వీట్‌ చేశారు. నైజీరియన్లందరూ ప్రజాస్వామ్యాన్ని ప్రేమిస్తారని వ్యాఖ్యానించారు. విదేశాంగ మంత్రి హసౌమి మసూదు కూడా ఇదే తరహాలో ప్రకటన చేశారు. ప్రజాస్వామిక కాముకులైన నైజీరియన్లు ఒక తాటిపై నిలబడి ఈ కుట్రను ఖండించాలని కోరారు. అధ్యక్షుడిని బేషరతుగా విడుదల చేయాలని డిమాండ్‌ చేశారు. ఈ లక్ష్యాల సాధనకు చర్చలు కొనసాగుతున్నాయని చెప్పారు.
బుధవారం కుట్రకు పాల్పడిన సైనికులు అధ్యక్షుడిని బంధించారు. ఆయన దగ్గర నుండి తాము అధికారాన్ని చేజిక్కించుకున్నామని ప్రకటించారు. ఇదిలా వుండగా, అధ్యక్ష భవనంలో నెలకొన్న పరిస్థితులపై రాజధాని నియామె ప్రజలకు ఏమీ పట్టినట్లు లేదు. వారు తమ రోజువారీ కార్యకలాపాల్లో తలమునకలై వున్నారు. అయితే దేశం ఎవరి అధీనంలో వుంది, ఎవరి వైపు మెజారిటీ మద్దతు వుందన్న అంశాల్లో స్పష్టత లేదు. రక్తపాతానికి దారి తీసే ఘర్షణలను నివారించేందుకు గానూ కుట్రకు తాను మద్దతునిస్తున్నానని సైనిక కమాండ్‌ విభాగం ట్వీట్‌ చేసింది. అయితే ఆ ప్రకటన వాస్తవమా కాదా అని నిర్ధారించడం సాధ్యం కాలేదు. ఇదిలా వుండగా, నైజర్‌ అధ్యక్షుడు మహ్మద్‌ బజూమ్‌కు పలు రాజకీయ పార్టీల మధ్దతు వున్నట్లు తెలుస్తోంది. కాగా, ఈ కుట్ర ప్రయత్నం ఆత్మహత్యా సదృశ్యమైనదని, పిచ్చితనంతో కూడినదని పలు పార్టీలు ఖండించాయి. బుధవారం ఈ మేరకు ఒక ప్రకటన చేశాయి.

Spread the love