భారత్‌లో తగ్గిన పేదరికం

– 15 ఏండ్లలో 41.5 కోట్ల మంది దారిద్య్రం నుండి బయటపడ్డారు
– ఐక్యరాజ్య సమితి నివేదిక వెల్లడి
– గ్రామీణ ఉపాధి హామీ పథకం ఫలితమే : నిపుణులు

న్యూయార్క్‌ : భారతదేశంలో పేదరికం గణనీయంగా తగ్గిందని ఐక్యరాజ్య సమితి నివేదిక పేర్కొంది. 15 ఏండ్ల కాలంలో మొత్తంగా 41.5 కోట్ల మంది దారిద్య్రం నుంచి బయటపడ్డారని తెలిపింది. ప్రపంచంలోనే అధిక జనాభా కలిగిన దేశం 2005-2006 నుండి 2019-2021 మధ్య కాలంలో ఈ విషయంలో గణనీయమైన పురోగతి సాధించిందని ఆ నివేదిక పేర్కొంది. మహాత్మ గాంధీ గ్రామీణ ఉపాధి హామీ పథకం వల్లే పేదరికం తగ్గుముఖం పట్టడానికి ప్రధానకారణమని గ్రామీణాభివృద్ధి రంగ నిపుణులు విశ్లేషించారు. 2006లో ప్రారంభమైన ఈ పథకం పూర్తిస్థాయిల్లో అమల్లోకి వచ్చిన నాటి నుంచే పేదరికం తగ్గుముఖం పడుతూ వచ్చిందని పేర్కొంటున్నారు. ఇటువంటి విశిష్టమైన ఈ పథకంపై కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కక్ష కట్టినట్టు నిర్వీర్యం చేస్తోందని, ఐక్యరాజ్యసమితి నివేదిక చూసైనా మోడీ సర్కార్‌ కండ్లు తెరవాలని వారు పేర్కొన్నారు. ఉపాధి హామీ చట్టాన్ని మరింత పటిష్టంగా అమల్జేయడంతో పాటు పట్టణాలకు కూడా విస్తరింపజేయాలని డిమాండ్‌ చేశారు.
ఐక్యరాజ్య సమితి అభివృద్ధి కార్యక్రమం (యూఎన్‌డీపీ), ఆక్స్‌ఫర్డ్‌ పావర్టీ అండ్‌ హ్యూమన్‌ డెవలప్‌మెంట్‌ ఇనీషియేటివ్‌ (ఓపీహెచ్‌ఐ)లు ఆక్స్‌్‌ఫర్ట్‌ యూనివర్శిటీలో అంతర్జాతీయ బహుముఖ దారిద్య్ర సూచిక (ఎంపీఐ)ను విడుదల చేశాయి. భారత్‌తో సహా 25 దేశాలు 15 ఏండ్ల కాలంలో తమ అంతర్జాతీయ ఎంపీఐ విలువలను విజయవంతంగా సగానికి సగం తగ్గించాయని నివేదిక పేర్కొంది. కంబోడియా, చైనా, కాంగో, హోండూరస్‌, భారత్‌, ఇండోనేషియా, మొరాకో, సెర్బియా, వియత్నాం ఈ జాబితాలో వున్నాయి. 142.86 కోట్ల జనాభాతో భారత్‌ ఏప్రిల్‌లో చైనాను అధిగమించి అధిక జనాభా కలిగిన దేశంగా మారింది. 2005-06లో 55.1 శాతంగా వున్న దారిద్య్రం 2019-21 నాటికి 16.4 శాతానికి తగ్గింది. పేదరికాన్ని నిర్మూలించడమన్నది సాధించవచ్చని ఈ నివేదిక తెలియచేస్తోంది. అయితే, కోవిడ్‌ సమయంలో సమగ్ర డేటా కొరవడడంతో తక్షణావకాశాలను అంచనా వేయడంలో సవాళ్లు ఎదుయ్యాయని ఆ నివేదిక పేర్కొంది.
2005-06లో దాదాపు 64.5 కోట్ల మంది ప్రజలు బహుముఖ దారిద్య్రంలో వున్నారని కానీ 2015-16 నాటికి ఈ సంఖ్య 37 కోట్లకు తగ్గిందని, 2019-21 నాటికి 23 కోట్లకు తగ్గిందని నివేదిక పేర్కొంది. పేద రాష్ట్రాలు, గ్రూపులు చాలా వేగవంతమైన పురోగతిని సాధించాయని తెలిపింది. పేదరికాన్ని అంచనా వేసేందుకు ఉపయోగించిన పలు సూచీలు ఈ కాలంలో క్షీణతను నమోదు చేశాయి. భారత్‌లో పోషకాహార లోపం 2005-06లో 44.3 శాతంగా వుండగా, 2019-21లో 11.8 శాతానికి తగ్గింది. అలాగే పిల్లల మరణాలు కూడా 4.5 శాతం నుండి 1.5 శాతానికి తగ్గాయని తెలిపింది. అలాగే వంట ఇంధనం కొరతను ఎదుర్కొనే వారి సంఖ్య 52.9 శాతం నుండి 13.9 శాతానికి తగ్గగా, పారిశుధ్య సమస్యను ఎదుర్కొనే వారి సంఖ్య కూడా 50.4 శాతం నుండి 11.3 శాతానికి పడిపోయింది. ఇక ఇదే కాలంలో తాగునీటి సూచికకు సంబంధించి చూసినట్లైతే 16.4 శాతం నుంచి 2.7 శాతానికి తగ్గింది. విద్యుత్‌ సూచీ 29 నుండి 2.1 శాతానికి క్షీణించగా, గృహ నిర్మాణ సూచీ కూడా 44.9 శాతం నుండి 13.6 శాతానికి తగ్గింది.
దుర్బర దారిద్య్రంలో 110 కోట్ల మంది
110 దేశాల్లో 610 కోట్ల మందిలో 110 కోట్ల మంది దుర్భర దారిద్య్రాన్ని అనుభవిస్తున్నారని నివేదిక వెల్లడించింది. సబ్‌ సహారా ఆఫ్రికా, దక్షిణాసియాల్లో అయితే ప్రతి ఆరుగురిలో ఐదుగురు పేదరికంలో మగ్గుతున్నారని తెలిపింది. పేదల్లో దాదాపు మూడింట రెండు వంతుల మంది (73కోట్ల మంది) మధ్యాదాయ దేశాల్లో జీవిస్తున్నారు. ఈ దేశాల్లో చర్యలు తీసుకోవడం అంతర్జాతీయంగా దారిద్య్రాన్ని తగ్గించడానికి కీలకం. తక్కువ ఆదాయం కలిగిన దేశాలు మొత్తం జనాభాలో కేవలం 10 శాతమే వున్నప్పటికీ అక్కడ 35 శాతం మంది పేదలు నివసిస్తున్నారు. 18 ఏండ్లలోపు పిల్లల్లో దారిద్య్రం రేటు 27.7 శాతంగా వుంది. ప్రధానంగా గ్రామీణ ప్రాంతాల్లో పేదరికం వేధిస్తోంది. పేదల్లో 84 శాతం మంది గ్రామీణ ప్రాంతాల్లోనే జీవిస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా అన్ని ప్రాంతాల్లో పట్టణ ప్రాంతాల కన్నా గ్రామీణ ప్రాంతాలే దారిద్య్రంలో మగ్గుతున్నాయి

Spread the love