త్రిపురలో స్వేచ్ఛగా ఎన్నికలు జరపాలి!

నవతెలంగాణ-త్రిపుర
మరికొన్ని రోజుల్లో త్రిపుర శాసనసభకు ఎన్నికలు జరుగనున్నాయి. అక్కడ బీజేపీ ఆధ్వర్యంలో గత ఐదేండ్లుగా ఆటవిక రాజ్యం సాగుతోంది. ఎడిసి (అటానమస్‌ డిస్ట్రిక్ట్‌ కౌన్సిల్‌) ఎన్నికల్లో, స్థానిక సంస్థల ఎన్నికల్లో ఏవిధంగా రిగ్గింగ్‌ చేశారో, ఓటర్లను ఏవిధంగా అడ్డుకున్నారో దేశం విస్తుపోయి చూసింది. బీజేపీని ఈసారి ఖచ్చితంగా ఓడించాలనే కృతనిశ్చయంతో ఉన్న ప్రజల ఆశల్ని ఈ శాసనసభ ఎన్నికలలోనూ భగం చేసే అవకాశాలున్నాయి. బీజేపీ చేసిన వాగ్దాన భంగాలు అన్ని రంగాల్లో దానివైఫల్యాలు, మహిళలపైనా, సీపీఐ(ఎం) కార్యకర్తలపైనా, మద్దతుదారులపైనా చేస్తున్న దారుణాలు ఈ దేశంలో ప్రజలంతా అర్థంచేసుకోవాల్సిన అవసరం ఉంది. త్రిపురలో అత్యధిక కుటుంబాలు దినసరి, నెలవారీ కూలీపైనే ఆధారపడి ఉన్నాయి. ఆ కూలీ డబ్బులే వారి జీవితాల కనీస అవసరాలు తీరుస్తాయి. నిర్మాణరంగం, కంకర క్వారీలు, రైస్‌మిల్లులు, హౌటల్స్‌, రెస్టారెంట్లు, బీడీ, రవాణా రంగం, సెక్యూరిటీగార్డులు, హమాలీరంగం, బంగారు పని, ఇంటి పని వంటివి వీరి జీవనాధారం. ప్రస్తుత బీజేపీ పాలనలో బేసిక్‌గాని, డీఏ గాని పెరిగిన దాఖలాలు లేవు. ప్లాంటేషన్‌ కార్మికులకు సంబంధించి గత వామపక్ష ప్రభుత్వం అన్ని చర్యలూ చేపట్టినా గతేడాదే నోటిఫికేషన్‌ విడుదలయ్యింది.
బీజేపీ సాక్షాత్తు రాష్ట్ర అసెంబ్లీలో సంక్షేమ పింఛన్‌ లబ్ధిదారులందరికీ రూ.1,000 నుంచి రూ.2,000కు పెంచుతామని హామీ ఇచ్చింది. కానీ అది నీటి మీద రాతయింది. అమలుకు నోచుకోలేదు. పైగా, ఈ హామీకి విరుద్ధంగా పేద వర్గాలకు చెందిన 80 వేల మందికి పైగా లబ్ధిదారులకు వద్ధాప్య, వితంతు తదితర సంక్షేమ పింఛన్లను బీజేపీ ప్రభుత్వం ఇష్టారాజ్యంగా నిలిపివేసింది.
ఇంటింటికీ పక్కా ఇళ్లు ఇస్తామని బీజేపీ హామీ ఇచ్చింది. కానీ అది కూడా అబద్ధమని తేలిపోయింది. బీజేపీ ప్రతి నియోజకవర్గంలో ఒక కాలేజీని నెలకొల్పుతానని వాగ్దానం చేసింది. కానీ ఒక్క ప్రభుత్వ డిగ్రీ కాలేజీని గాని, పాలిటెక్నిక్‌ ఇనిస్టిట్యూట్‌ గాని, మెడికల్‌ కాలేజీ, బి.ఎడ్‌., అగ్రికల్చర్‌ కాలేజి గాని పెట్టలేదు. 2017-18లో లెఫ్ట్‌ ఫ్రంట్‌ హయాంలో ఉన్న 22 ప్రభుత్వ డిగ్రీ కాలేజీలే ప్రస్తుతమూ ఉన్నాయి..
మల్టీ-స్పెషాలిటీ ఆసుపత్రులు ఏర్పాటు చేస్తామని, అవి కూడా ఒక ఎయిమ్స్‌ లాంటి హైటెక్‌ హాస్పిటల్‌, ఒక రిమ్స్‌ లాంటి మెడికల్‌ కాలేజీ, టిటిఎఎడిసి ప్రాంతంలో ఒక మెడికల్‌ కాలేజీ నెలకొల్పుతామని బీజేపీ వాగ్దానం చేసింది. గత ఐదేండ్లలో ఈ హామీల్లో ఏ ఒక్కదానిని నెరవేర్చలేదు. వామపక్ష ప్రభుత్వ హయాంలో, గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని చాలా విజయవంతంగా అమలుచేశారు. ప్రతి పంచాయతీలో జాబ్‌ కార్డ్‌ హౌల్డర్‌లకు సగటున 92రోజుల పని కల్పించారు. ఈ విషయంలో త్రిపుర రాష్ట్రం వరుసగా 7ఏండ్లు దేశంలోనే అగ్రస్థానంలో ఉంది. బీజేపీ ప్రభుత్వ హయాంలో ప్రతి పంచాయతీకి కేవలం అంటే కేవలం 8రోజుల పని మాత్రమే కల్పించారు. అదికూడా తక్కువ మందికే అందుబాటులోకి వచ్చింది. వారికి ఇవాల్సిన వేతనాలు సైతం చెల్లించలేదు.
2009లో లెఫ్ట్‌ ఫ్రంట్‌ ప్రభుత్వం లబ్ధిదారులకు 50రోజుల పని కల్పిస్తూ పట్టణ ఉపాధి హామీ పథకాన్ని కూడా మొదలుపెట్టింది. ఆ తరువాత 2017లో నాటికి దీన్ని 75కు పెంచి, సగటున 65 రోజుల పని కల్పించారు. బీజేపీ ప్రభుత్వ హయాంలో, తక్కువమంది లబ్ధిదారులకు అతి కష్టమీద 30రోజుల పనిని కూడా కల్పించలేకపోయారు. త్రిపుర చాలా పేద రాష్ట్రం అయినప్పటికీ, లెఫ్ట్‌ ఫ్రంట్‌ ప్రభుత్వ హయాంలో 100శాతం అక్షరాస్యతను సాధించింది. స్త్రీల అక్షరాస్యత కూడా 90శాతం పైగా ఉంది. ఉపాధ్యాయులను నియమించకుండా, విద్యార్థి, ఉపాధ్యాయుల నిష్పత్తి పెరిగిందని, ప్రభుత్వ పాఠశాలల్లో నమోదు తగ్గిందని బీజేపీ ప్రభుత్వం వాదిస్తున్నది. ప్రభుత్వం విద్యా ప్రయివేటీకరణను ప్రోత్సహిస్తోంది. ఇటీవల ప్రవేశపెట్టిన ”మిషన్‌ 100 విద్యాజ్యోతి పథకం”లో ప్రభుత్వ పాఠశాలల్లో కూడా సంవత్సరానికొకసారి ఫీజు ప్రవేశపెట్టింది. దీంతో తల్లిదండ్రులపై ఆర్థిక భారం పడడంతో విద్యార్థుల నమోదు కూడా తగ్గుతోంది. గత ఆరు నెలలుగా మహిళలపై దాడులు విపరీతంగా పెరిగాయి. బీజేపీ ముఖ్యమంత్రి కూడా నవంబర్‌ 22, 2022న దీనిపై వ్యాఖ్యానించవలసిన పరిస్థితి ఏర్పడింది. 36.7లక్షల జనాభా కలిగి, దేశంలోని అనేక జిల్లాల కంటే తక్కువ జనాభా ఉన్న చిన్న రాష్ట్రం త్రిపురలో, 2020 జనవరి నుండి 26 సామూహిక అత్యాచారాలతో సహా 407 అత్యాచార ఘటనలు జరిగాయి. ఈ ఘటనల్లో బాధితులు ఏడుగురు హత్యకు గురయ్యారు. దారుణమైన విషయం ఏమిటంటే, ఈ నేరాల కొన్నింటిలో బీజేపీ కార్యకర్తల ప్రమేయం ఉంది. మైనర్‌ గిరిజన బాలికపై సామూహిక అత్యాచారం కేసులో బీజేపీ పంచాయతీ సభ్యుడు నిందితుడిగా ఉన్నాడు. ఉనకోటి జిల్లాలో యువతిపై జరిగిన సామూహిక అత్యాచార ఘటనలో కార్మికశాఖ మంత్రి కుమారుడి ప్రమేయం ఉంది. గిరిజన ప్రజల దిగ్గజ నాయకుడు, మాజీ ముఖ్యమంత్రి దశరథ్‌ దేబ్‌ ప్రతిమను ధ్వంసం చేశారు. అక్కడ ఏర్పాటు చేసిన సీఆర్పీఎఫ్‌ గార్డులను తొలగించారు. సీపీఐ(ఎం) మద్దతుదారులకు చెందిన 67ఇళ్లు, దుకాణాలను లూటీ చేసి తగులబెట్టడంతో పాటు పదుల సంఖ్యలో దాడులు చేశారు.
అసెంబ్లీ ఎన్నికలదాకా ఈ భయానక వాతావరణాన్ని కొనసాగించే ఉద్దేశ్యంతో, సిపాహిజాల జిల్లాలోని చరిలం వద్ద సీపీఐ(ఎం) ప్రదర్శనపై బీజేపీ గూండాలు దాడి చేశారు. ఈ దాడిలో కామ్రేడ్‌ సాహిద్‌ మియాన్‌ అనే వృద్ద రైతు చనిపోయాడు. ఈ క్లిష్ట పరిస్థితుల్లోనే త్రిపురలో సీపీఐ(ఎం) ఇతర వామపక్ష, లౌకిక పార్టీలను కలుపుకుని హౌరాహౌరీగా ఎన్నికల పోరులో నిమగమై ఉంది. వారిని ఆదుకోవడానికి, వారికి సంఘీభావంగా ఉండటానికి ప్రజాతంత్ర వామపక్ష శక్తులన్నీ కృషి చేయాలి.
భయోత్పాత వాతావరణం
ఐదేండ్ల బీజేపీ పాలనలో ప్రతిపక్షాలపై నిరంతరం దాడులు జరుగుతూనే ఉన్నాయి, అందులోనూ సీపీఐ(ఎం)పై అత్యధికంగా హింసాత్మక దాడులు జరిగాయి. మార్చి 2018 – జూన్‌ 2021 మధ్య, 667 వామపక్ష పార్టీల ఆఫీసులు, 204 వామపక్షాలకు చెందిన ప్రజా సంఘాల కార్యాలయాలు, 3363 మంది సీపీఐ(ఎం) సభ్యులు, మద్దతుదారుల ఇళ్ళు, వారికి చెందిన 659 దుకాణాలు తగులబబెట్టటమో ధ్వంసం చేయటామో జరిగింది. బీజేపీ దాడులలో 1500లకు పైగా చేపల చెరువులు, రబ్బరు చెట్లు నాశనమయ్యాయి.సెప్టెంబరు 7 – 8, 2021 తేదీలలో, సీపీఐ(ఎం)కి చెందిన 42, ఆర్‌ఎస్‌పి, సీపీఐ(ఎంఎల్‌)కి చెందిన ఒక్కొక్కటి మొత్తం 44 పార్టీ ఆఫీసులను తగులబెట్టారు. అగర్తలాలో సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యాలయంపై కూడా దాడి చేశారు.

Spread the love