వేలానికి వేళాయే!

– డబ్ల్యూపీఎల్‌ క్రికెటర్ల వేలం నేడు
– 90 స్థానాల రేసులో 409 మంది క్రికెటర్లు
– 2023 మహిళల ప్రీమియర్‌ లీగ్‌
ఐదు జట్లు, రూ.60 కోట్ల డబ్బు, 90 స్థానాలు.. మహిళల ప్రీమియర్‌ లీగ్‌ (డబ్ల్యూపీఎల్‌) ఆరంభ సీజన్‌ క్రికెటర్ల వేలానికి రంగం సిద్ధం. ముంబయిలోని జియో వరల్డ్‌ సెంటర్‌లో మెగా మహిళా క్రికెటర్ల వేలం.. ప్రపంచ క్రికెట్‌లో ఎంతోమంది మహిళా క్రికెటర్లను కోటీశ్వరులు చేయనుంది. భారత స్టార్‌ క్రికెటర్లకు సహజంగానే వేలంలో భారీ డిమాండ్‌ ఉండనుండగా.. సుమారు 90 మంది మహిళా క్రికెటర్ల జీవితాలు ఆర్థికంగా గొప్ప మలుపు తీసుకునే అవకాశం కనిపిస్తోంది.
డబ్ల్యూపీఎల్‌ క్రికెటర్ల వేలం నేడు.
ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ (ఐపీఎల్‌) ఆటగాళ్ల జరిగిన 15 ఏండ్ల తర్వాత మహిళల క్రికెట్‌లో ఓ మలుపు!. దేశవాళీ, విదేశీ మహిళా క్రికెటర్లు ఎన్నో ఏండ్లుగా ఎదురుచూస్తున్న క్షణం రానే వచ్చింది. మహిళల ప్రీమియర్‌ లీగ్‌ (డబ్ల్యూపీఎల్‌) క్రికెటర్ల మెగా వేలం నేడు జరుగనుంది. ముంబయిలోని జియో వరల్డ్‌ సెంటర్‌లో 409 మంది దేశ, విదేశీ మహిళా క్రికెటర్లు వేలంలోకి రానున్నారు. ప్రపంచ మహిళా క్రికెట్‌లో డబ్ల్యూపీఎల్‌ క్రికెటర్ల వేలం ఓ మైలురాయిగా నిలిచిపోనుంది. నేడు మధ్యాహ్నాం 1.30 నుంచి క్రికెటర్ల వేలం ప్రక్రియ ఆరంభం కానుంది.
బరిలో 409, ఉన్నవి 90
మహిళల ప్రీమియర్‌ లీగ్‌ (డబ్ల్యూపీఎల్‌) ఆరంభ సీజన్‌ మెగా క్రికెటర్ల వేలంలో 409 మంది అమ్మాయిలు అదృష్టం పరీక్షించుకోనున్నారు. వేలంలో నిలిచేందుకు 1525 మంది క్రికెటర్లు దరఖాస్తు చేసుకున్నారు. బీసీసీఐ 409 మంది మాత్రమే వేలానికి ఎంపిక చేసింది. ఇందులో 246 మంది భారత క్రికెటర్లు ఉండగా, 163 మంది విదేశీ క్రికెటర్లు ఉన్నారు. అందులో 8 మంది మహిళా క్రికెటర్లు అసోసియేట్‌ దేశాల వారు కావటం విశేషం. అంతర్జాతీయ అరంగేట్రం చేసిన క్రికెటర్లు 202 మంది ఉండగా, దేశవాళీ క్రికెటర్లు 199 మంది ఉన్నారు. వేలంలో మొత్తం 90 స్థానాలు మాత్రమే అందుబాటులో ఉన్నాయి. అందులో విదేశీ క్రికెటర్లకు 30 ఉండగా.. భారత క్రికెటర్లకు 60 స్థానాలు కేటాయించారు. విదేశీ క్రికెటర్లను వద్దనుకుంటే ప్రాంఛైజీలు భారత క్రికెటర్లనే ఎక్కువ మందిని ఎంచుకోవచ్చు. అందుకు ఎటువంటి పరిమితి ఉండదు. వేలంలో క్రికెటర్లను ఐదు విభాగాలు చేశారు. రూ.50 లక్షల కనీస ధరకు 24 మంది, రూ.40 లక్షల కనీస ధరకు 30 మంది క్రికెటర్లు ఉన్నారు. రూ. 30 లక్షలు, రూ.20 లక్షలు, రూ.10 లక్షల కనీస ధరకు సైతం క్రికెటర్లను జాబితాలో చేర్చారు.
ఐదు జట్లు, 60 కోట్లు
డబ్ల్యూపీఎల్‌ మెగా క్రికెటర్ల వేలంలో ఐదు ప్రాంఛైజీలు క్రికెటర్లను కొనుగోలు చేయనున్నాయి. ఢిల్లీ క్యాపిటల్స్‌, గుజరాత్‌ జెయింట్స్‌, ముంబయి ఇండియన్స్‌, రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూర్‌, యూపీ వారియర్స్‌లు 15-18 మంది క్రికెటర్లను వేలంలో తీసుకోనున్నాయి. ఆరంభ సీజన్‌ వేలంలో ప్రతి జట్టుకు రూ.12 కోట్ల పర్సును కేటాయించారు. ఈ సొమ్ముతోనే 15 నుంచి 18 మంది క్రికెటర్లను కొనుగోలు చేయాలి. ఐదు జట్లు ఓవరాల్‌గా రూ.60 కోట్లను నేడు ఖర్చు చేయనున్నాయి.
మంధానకు రూ.3 కోట్లు?
ఐపీఎల్‌ తొలి వేలంలో ఎం.ఎస్‌ ధోని రికార్డు ధర సొంతం చేసుకున్నాడు. అతడికి దక్కించుకునేందుకు ప్రతి ప్రాంఛైజీ కోట్లు కుమ్మరించేందుకు సిద్ధమైంది. ఇప్పుడు మహిళల క్రికెట్‌లోనూ అటువంటి ఓ రికార్డును దక్కించుకునే ముందు నిలిచింది స్మృతీ మంధాన. భారత క్రికెట్‌లో మంధాన ఓ సంచలనం. కండ్లుచెదిరే ఆటతీరుతో కోట్లాది అభిమానులను సొంతం చేసుకుంది. మంధానను తీసుకుంటే క్రికెట్‌ పరంగా, మార్కెట్‌ (బ్రాండ్లను ఆకర్షించేందుకు) పరంగా ప్రాంఛైజీలకు గొప్ప లబ్ది ఉండనుంది. ప్రాంఛైజీలు తమకు కేటాయించిన రూ.12 కోట్ల నుంచి రూ.3 కోట్లను మంధానపై కుమ్మరించేందుకు సిద్దంగా ఉన్నాయి. మంధానతో పాటు భారత క్రికెట్‌ జట్టు స్టార్స్‌ ఆకర్షణీయ మొత్తంలో ధరను దక్కించుకునే అవకాశం కనిపిస్తోంది.
స్పిన్నర్లకు డిమాండ్‌
డబ్ల్యూపీల్‌ ఆరంభ సీజన్‌ ముంబయిలోనే జరుగనుంది. బ్రబౌర్న్‌, డివై పాటిల్‌ స్టేడియంలోనే 23 మ్యాచులు జరుగుతాయి. సంప్రదాయంగా ఈ రెండు మైదానాలు స్పిన్‌కు అనుకూలం. దీంతో భారత, విదేశీ స్పిన్నర్లకు వేలంలో మంచి డిమాండ్‌ ఉండనుంది. వైట్‌బాల్‌ క్రికెట్‌లో ఇంగ్లాండ్‌ స్పిన్నర్‌ సోఫీ ఎకెల్‌స్టోన్‌ ఉత్తమం. ఆమె కోసం ప్రాంఛైజీలు గట్టిగానే వెచ్చించనున్నారు. భారత క్రికెట్‌ సర్కిల్‌లోని స్పిన్నర్లపైనా కాసుల వర్షం కురవనుంది.
ఐపీఎల్‌ నేర్పిన పాఠాలతో..!
మహిళల ప్రీమియర్‌ లీగ్‌ (డబ్ల్యూపీఎల్‌) ఆరంభ వేలానికి ఐపీఎల్‌ అనుభవం కలిసిరానుంది. కొన్ని ప్రాంఛైజీలు ఇప్పటికి సహాయక సిబ్బందిని ప్రకటించాల్సి ఉంది. గణాంకాలు, భారత పరిస్థితుల్లో రాణించగల సామర్థ్యంపై ఇప్పటికే క్రికెటర్లపై ప్రాంఛైజీలు చిన్నపాటి పరిశోధన చేశాయి. ఐపీఎల్‌ వేలంలో నేర్చుకున్న పాఠాలను ఈ వేలంలో ప్రాంఛైజీలకు కలిసి రానున్నాయి. మెన్స్‌ క్రికెట్‌తో పోల్చితే మహిళా క్రికెట్‌లో ఆల్‌రౌండర్లు ఎక్కువ. టాప్‌ ఆర్డర్‌ బ్యాటర్లు సైతం నాణ్యమైన బౌలింగ్‌ చేయగలరు. దీంతో ఆల్‌రౌండర్ల కోసం ప్రత్యేక డిమాండ్‌ ఉండటం కాస్త తక్కువే కానుంది!. ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్‌, న్యూజిలాండ్‌, దక్షిణాఫ్రికా, వెస్టిండీస్‌ క్రికెటర్లకు వేలంలో డిమాండ్‌ కనిపిస్తుంది. అసోసియేట్‌ దేశాల నుంచి ఓ క్రికెటర్‌ను తుది జట్టులోకి తీసుకునే వెసులుబాటును ప్రాంఛైజీలు సద్వినియోగం చేసుకునే వీలుంది. థారులాండ్‌ నుంచి ప్రతిభావంతులైన క్రికెటర్లు వేలం బరిలో నిలిచారు.
మనోళ్లు ఐదుగురు
మహిళల ప్రీమియర్‌ లీగ్‌ క్రికెటర్ల వేలంలో బరిలో మనోళ్లు ఐదుగురు నిలిచారు. హైదరాబాద్‌ క్రికెట్‌ సంఘం (హెచ్‌సీఏ) తరఫున ఐదుగురు అమ్మాయిలు నేడు వేలానికి రానున్నారు. ఐసీసీ అండర్‌-19 టీ20 ప్రపంచకప్‌ విజయంలో కీలక భూమిక పోషించిన భద్రాచలం అమ్మాయి గొంగడి త్రిష సహా యశశ్రీలు రూ.10 లక్షల కనీస ధర జాబితాలో ఉన్నారు. మమత, వెలగపూడి ప్రణవి, కోడూరి ఇషితలు సైతం రూ.10 లక్షల కనీస ధర జాబితాలో నిలిచారు. గొంగడి త్రిష కోసం వేలంలో ప్రాంఛైజీలు ఆసక్తి చూపించనున్నాయి.

మహిళల ప్రీమియర్‌ లీగ్‌ ప్రపంచ క్రికెట్‌ను పూర్తిగా మార్చివేయనుంది. మహిళల క్రికెట్‌లో డబ్బు రావటంతో ప్రపంచవ్యాప్తంగా ఆటకు భిన్నమైన రూపం రానుంది. వేలంలో ఎంతోమంది క్రికెటర్ల జీవితాలు మారనున్నాయి’- హీథర్‌ నైట్‌ ఇంగ్లాండ్‌ కెప్టెన్‌

Spread the love