ఫైనల్లో ప్రణయ్

– సెమీస్‌లో ఓడిన పి.వి సింధు
– మలేషియా మాస్టర్స్‌ టోర్నీ
కౌలాలంపూర్‌ (మలేషియా)
మలేషియా మాస్టర్స్‌లో భారత్‌కు మిశ్రమ ఫలితాలు లభించాయి. టైటిల్‌ ఫేవరేట్‌, అగ్రశ్రేణి షట్లర్‌ పి.వి సింధు మహిళల సింగిల్స్‌ సెమీఫైనల్లో పరాజయం పాలవగా.. మెన్స్‌ సింగిల్స్‌లో సీనియర్‌ షట్లర్‌ హెచ్‌.ఎస్‌ ప్రణయ్ ఫైనల్లోకి దూసుకెళ్లాడు. క్వార్టర్‌ఫైనల్స్‌ వరకు ఎదురులేని విజయాలతో పతక ఆశలు రేపిన మహిళల సింగిల్స్‌ మాజీ వరల్డ్‌ నం.2 సెమీస్‌ సమరంలో అనూహ్య పరాజయం చవిచూసింది. ఏడో సీడ్‌ గ్రెగోరియ టన్‌జంగ్‌ (ఇండోనేషియా) చేతిలో వరుస గేముల్లో ఓటమి చెందింది. హెచ్‌.ఎస్‌ ప్రణయ్ సెమీఫైనల్లో ప్రత్యర్థి వాకోవర్‌తో నేరుగా టైటిల్‌ పోరుకు చేరుకున్నాడు. నేడు అంతిమ సమరంలో చైనా షట్లర్‌ వెంగ్‌ హాంగ్‌ యంగ్‌తో పోటీపడనున్నాడు.
చెమట పట్టకుండా!
పురుషుల సింగిల్స్‌ సెమీఫైనల్లో హెచ్‌.ఎస్‌ ప్రణయ్ తుది పోరుకు చేరుకున్నాడు. క్వార్టర్‌ఫైనల్లో కిదాంబి శ్రీకాంత్‌పై మెరుపు విజయం సాధించిన క్వాలిఫయర్‌ క్రిస్టియన్‌ (ఇండోనేషియా) శనివారం సెమీఫైనల్లో ప్రణయ్తో తలపడ్డాడు. క్రిస్టియన్‌పై ఆరంభం నుంచీ ఆధిపత్యం చూపించాడు ప్రణయ్. 11-2తో విరామ సమయానికి తొలి గేమ్‌లో తిరుగులేని ఆధిక్యం సంపాదించాడు. ద్వితీయార్థంలో క్రిస్టియన్‌ పుంజుకుని 15-15 వద్ద స్కోరు సమం చేసి ఉత్కంఠకు తెరతీశాడు. 19-17తో ప్రణరు తొలి గేమ్‌ సొంతం చేసుకునే క్రమంలో.. క్రిస్టియన్‌ మోకాలి గాయానికి గురయ్యాడు. నొప్పితోనే కోర్టును వీడిన క్రిస్టియన్‌ మళ్లీ రాకెట్‌ పట్టలేదు. తీవ్రమైన నొప్పితో క్రిస్టియన్‌ సెమీఫైనల్స్‌ నుంచి వాకోవర్‌ ఇచ్చాడు. అప్పటికే తొలి గేమ్‌లో ఆధిపత్యం చెలాయించిన హెచ్‌.ఎస్‌ ప్రణయ్ మరో గేమ్‌లో ఆడాల్సిన అవసరం లేకుండానే ఫైనల్లోకి దూసుకెళ్లాడు. మరో సెమీఫైనల్లో చైనా షట్లర్‌ వెంగ్‌ హాంగ్‌ యంగ్‌ 21-13, 21-19తో చైనీస్‌ తైపీ షట్లర్‌ లిన్‌ చున్‌ యిపై అలవోక విజయం నమోదు చేశాడు.
మహిళల సింగిల్స్‌లో పి.వి సింధు నిరాశపరిచింది. సుదీర్ఘ విరామం అనంతరం ప్రత్యర్థులపై ఎదురుదాడితో హడలెత్తించిన సింధు.. సెమీఫైనల్లో నిలకడ లేమి ఆటతీరుతో టోర్నీ నుంచి నిష్క్రమించింది. 44 నిమిషాల సెమీఫైనల్‌ పోరులో ఇండోనేషియా అమ్మాయి గ్రెగోరియ టన్‌జంగ్‌ సాధికారిక విజయం సాధించింది. 14-21, 17-21తో పి.వి సింధు వరుస గేముల్లో ఇండోనేషియా షట్లర్‌కు తలొగ్గింది. తొలి గేమ్‌లో సింధు 3-0తో శుభారంభం చేసింది. కానీ ఇండోనేషియా షట్లర్‌ వేగంగా పుంజుకుంది. 7-7తో స్కోరు సమం చేసింది. 11-8తో ముందంజ వేసిన సింధు.. విరామం అనంతరం ఆధిక్యం నిలుపుకోలేదు. 12-12 వద్ద స్కోరు సమం చేసిన గ్రెగోరియ..16-13తో దూసుకెళ్లింది. అదే ఊపులో 21-14తో తొలి గేమ్‌ను కైవసం చేసుకుంది. ఇక చావోరేవో తేల్చుకోవాల్సిన రెండో గేమ్‌లో సింధు అంచనాలను అందుకోలేదు. విరామ సమయానికి 9-11తో వెనుంకంజ వేసిన సింధు.. ఆ తర్వాత ఏ దశలోనూ ఇండోనేషియా షట్లర్‌ను అందుకోలేదు. ఆధిక్యం నిలుపుకుంటూ ముందుకెళ్లిన గ్రెగోరియ 21-17తో రెండో గేమ్‌ను, ఫైనల్స్‌ బెర్త్‌ను ఖాతాలో వేసుకుంది. నేడు జరిగే తుది పోరులో జపాన్‌ స్టార్‌, టాప్‌ సీడ్‌ అకానె యమగూచితో టైటిల్‌ కోసం గ్రెగోరియ తలపడనుంది.

Spread the love