సిఎం కప్‌.. యువజన క్రీడోత్సవం

– శాట్స్‌ చైర్మెన్‌ డాక్టర్‌ ఆంజనేయ గౌడ్‌
– నేటి నుంచి రాష్ట్ర స్థాయి పోటీలు
– పోటీపడనున్న 7500 మంది అథ్లెట్లు
నవతెలంగాణ-హైదరాబాద్‌
సిఎం కప్‌ 2023 పోటీలను తెలంగాణ యువజన క్రీడోత్సవంగా రాష్ట్ర క్రీడా ప్రాధికార సంస్థ చైర్మెన్‌ డాక్టర్‌ ఆంజనేయ గౌడ్‌ అభివర్ణించారు. తెలంగాణ రాష్ట్రంలో తొలిసారి ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న సిఎం కప్‌ పోటీలు అంతిమ ఘట్టానికి చేరుకున్నాయి. మండల, జిల్లా స్థాయి పోటీలు విజయవంతంగా ముగియగా, నేటి నుంచి రాష్ట్ర స్థాయి పోటీలు షురూ కానున్నాయి. మండల స్థాయి పోటీల్లో 2 లక్షల మంది క్రీడాకారులు పోటీపడగా, జిల్లా స్థాయి పోటీల్లో 85 వేల మంది అథ్లెట్లు సత్తా చాటారు. నేటి నుంచి రాష్ట్ర స్థాయిలో జరిగే 18 క్రీడాంశాల్లో 7500 మందికి పైగా క్రీడాకారులు పోటీపడనున్నారు. నాలుగు రోజుల పాటు నిర్వహించే సిఎం కప్‌ పోటీలకు శాట్స్‌ యంత్రాంగం ముమ్మర ఏర్పాట్లు చేస్తోంది. ఆరంభోత్సవ ఏర్పాట్లు, క్రీడాకారులకు వసతి, భోజన, రవాణా ఏర్పాట్లను పర్యవేక్షించిన శాట్స్‌ చైర్మెన్‌ ఆంజనేయ గౌడ్‌ ‘నవ తెలంగాణ’తో ప్రత్యేకంగా మాట్లాడారు. సిఎం కప్‌ పోటీల ప్రత్యేకత, ఏర్పాట్లపై ఆయన మాటల్లోనే..
గుర్తుండిపోయేలా ఆరంభ వేడుకలు
సిఎం కప్‌ రాష్ట్ర స్థాయి పోటీలు ఆదివారమే మొదలు కానున్నాయి. ఆరంభ వేడుకలను సోమవారం నిర్వహిస్తున్నాం. తెలంగాణ రాష్ట్ర సంస్కృతి, సంప్రదాయాలు, సాంస్కృతిక సౌందర్యం ఉట్టిపడేలా ప్రారంభోత్సవ వేడుక ఉండనుంది. ఆస్కార్‌ వేదికపై మెరిసిన నాటు నాటు గాయకుడు రాహుల్‌ సిప్లిగంజ్‌ సిఎం కప్‌ వేదికపై గాత్రం వినిపించనున్నాడు. ఆరంభ వేడుకకు ఐటీ శాఖ మంత్రి కెటిఆర్‌ ముఖ్య అతిథిగా రానున్నారు. తెలంగాణ రాష్ట్ర స్టార్‌ క్రీడాకారులు, వెటరన్‌ అథ్లెట్లు, క్రీడా పురస్కార గ్రహీతలు ఆరంభ వేడుకలకు హాజరు కానున్నారు. తెలంగాణ రాష్ట్రంలో నిర్వహిస్తున్న తొలి సిఎం కప్‌ పోటీల ఆరంభ వేడుకలు గుర్తుండిపోయేలా ప్రణాళిక చేస్తున్నాం.
క్షేత్ర స్థాయిలో అపూర్వ స్పందన
మండల, జిల్లా స్థాయి పోటీల పర్యవేక్షణకు రాష్ట్ర వ్యాప్తంగా పర్యటించాను. ఎక్కడికి వెళ్లినా గ్రామీణ క్రీడాకారుల నుంచి సిఎం కప్‌ పోటీలకు అపూర్వ స్పందన లభించింది. రెండు లక్షల మంది క్రీడాకారులు పోటీపడటం సాధారణ విషయం కాదు. ఏటూరు నాగారం వంటి ఏజెన్సీ ప్రాంతంలోనూ మండల స్థాయి పోటీలకు సుమారు ఐదు వేల మంది క్రీడాకారులు తరలివచ్చారు. 615 మండలాల్లో, 33 జిల్లాల్లో సిఎం కప్‌ పోటీలు పండుగ వాతావరణంలో విజయవంతం కావటం ఎంతగానో సంతృప్తినిచ్చింది.
పోటీల్లో బాలికల ముందంజ
సిఎం కప్‌ పోటీలను ప్రత్యక్షంగా చూసిన తర్వాత.. తల్లిదండ్రులు అమ్మాయిలను క్రీడల వైపు ప్రోత్సహించరనే అభిప్రాయమే పూర్తిగా మారిపోయింది. వాస్తవానికి మండల, జిల్లా స్థాయి పోటీల్లో అమ్మాయిల భాగస్వామ్యమే ఎక్కువ!. మండల స్థాయిలో ఫుట్‌బాల్‌ను పురుషులకు మాత్రమే నిర్వహించగా.. మహిళలకు సైతం నిర్వహించాలని పెద్ద ఎత్తున వినతులు వచ్చాయి. ఫుట్‌బాల్‌ పోటీలను అమ్మాయిలకు సైతం షెడ్యూల్‌ చేశాం. వ్యక్తిగత, జట్టు ఈవెంట్లలో పురుషులతో సమానంగా మహిళలు ప్రతిభ చాటారు. సిఎం కప్‌లో బాలికల భాగస్వామ్యం తెలంగాణలో క్రీడా ప్రగతికి నిదర్శనం.
అందుబాటులో మౌళిక సదుపాయాలు
తెలంగాణ రాష్ట్రంలో మాత్రమే సిఎం కప్‌ పోటీలను మండల స్థాయి నుంచి నిర్వహిస్తున్నాం. అందుకు కారణం లేకపోలేదు. ప్రతిభావంతులైన గ్రామీణ క్రీడాకారులను వెలుగులోకి తీసుకు రావటంతో పాటు క్షేత్ర స్థాయిలో క్రీడా సముదా యాలు, మైదానాలు, మౌళిక సదుపాయాలను రాష్ట్ర వ్యాప్తంగా ఏకకాలంలో వినియోగంలోకి తీసుకు వచ్చాం. మండల స్థాయిలో క్రీడా ప్రాంగణాలను ఇక నుంచి శాట్స్‌ పర్యవేక్షించనుంది. సిఎం కప్‌ పోటీలతో 615 మండలాలు, 33 జిల్లాల్లో క్రీడా మైదానాలు, క్రీడా సదుపాయాలు పూర్తి స్థాయిలో అందుబాటులోకి వచ్చాయి!.
పకడ్బందిగా ఏర్పాట్లు
రాష్ట్ర పోటీలకు ఏర్పాట్లు పకడ్బందిగా చేస్తున్నాం. 33 జిల్లాల నుంచి క్రీడాకారులు ఇప్పటికే నగరానికి చేరుకున్నారు. క్రీడాకారులకు ఎటువంటి ఇబ్బంది రాకుండా వసతి, భోజనం, రవాణా, త్రాగునీరు, పారిశుద్ద్యం, పోలీసు, ఆరోగ్యం విభాగాలకు సబ్‌ కమిటీలు వేశాం. మహిళా అథ్లెట్ల వసతి కేంద్రం, ఈవెంట్లు జరిగే స్టేడియం, ప్రయాణించే బస్సులో మహిళా కానిస్టేబుల్‌ విధిగా ఉండనున్నారు. పోటీల సందర్భంగా సాంస్కృతిక కార్యక్రమాలు సైతం నిర్వహించనున్నామని శాట్స్‌ చైర్మెన్‌ ఆంజనేయ గౌడ్‌ తెలిపారు.

Spread the love