ఇగా స్వైటెక్‌ ముందంజ

– ఇండియన్‌ వెల్స్‌ మాస్టర్స్‌
ఇండియన్‌వెల్స్‌ : మహిళల సింగిల్స్‌ టాప్‌ సీడ్‌, అగ్రశ్రేణి క్రీడాకారిణి ఇగా స్వైటెక్‌ (పొలాండ్‌) ఇండియన్‌వెల్స్‌ మాస్టర్స్‌లో ముందంజ వేసింది. ఆదివారం జరిగిన మహిళల సింగిల్స్‌ రెండో రౌండ్లో స్వైటెక్‌ అలవోక విజయం నమోదు చేసింది. అమెరికా అమ్మాయి క్లేరీ లీయుపై 6-0, 6-1తో అలవోక విజయం సాధించింది. ఐదు బ్రేక్‌ పాయింట్లు సాధించిన స్వైటెక్‌ అమెరికా అమ్మాయిని చిత్తు చేసింది. ఐదో సీడ్‌ కరొలినా గార్సియా (ఫ్రాన్స్‌) సైతం మూడో రౌండ్లోకి ప్రవేశించింది. దాల్మా గాల్ఫీపై 6-1, 6-7(4-7), 6-4తో కరొలినా గార్సియా గెలుపొందింది. దాల్మా 14 ఏస్‌లతో మెరిసినా.. మూడు సెట్ల పోరులో గార్సియా పైచేయి సాధించింది. జర్మనీ అమ్మాయి మరియ వరుస సెట్లలో ఓటమి చెందింది. రష్యా అమ్మాయి డరియా కసట్కినా 6-2, 6-1తో వరుస సెట్లలో విజయం సాధించింది. ఎలెనా రెబకానా 7-6(8-6), 7-6(7-5)తో సోఫియ కెనిన్‌పై విజయంతో మూడో రౌండ్‌కు చేరుకుంది. అమెరికా వెటరన్‌ స్టార్‌ మడిసన్‌ కీస్‌ కథ రెండో రౌండ్లోనే ముగిసింది. 1-6తో సోరొన సిర్సెటీ చేతిలో తొలి సెట్‌ చేజార్చుకున్న మడిసన్‌.. వాకోవర్‌తో టోర్నీ నుంచి నిష్క్రమించింది. మెన్స్‌ సింగిల్స్‌లో టాప్‌ సీడ్‌ కార్లోస్‌ అల్కరాజ్‌ (స్పెయిన్‌) వరుస సెట్లలో గెలుపొందాడు. 6-3, 6-3తో ఆస్ట్రేలియా ఆటగాడు కొక్కినాస్‌పై విజయం సాధించాడు. అమెరికా ఆటగాడు టేలర్‌ ఫ్రిట్జ్‌ 4-6, 6-4, 6-6తో రెండో రౌండ్లో సహచర ఆటగాడు బెన్‌ షెల్టన్‌ను ఓడించాడు. ఏడో సీడ్‌ హౌల్గర్‌ రూనె 7-5, 6-3తో మెక్‌డొనాల్డ్‌ను ఓడించి మూడో రౌండ్‌కు చేరుకున్నాడు. బ్రిటన్‌ స్టార్‌ ఆండీ ముర్రే 6-4, 6-3తో రాడు అల్బోట్‌పై వరుస సెట్లలో విజయం సాధించాడు. స్విస్‌ ఆటగాడు స్టానిస్లాస్‌ వావ్రింకా 7-6(10-6), 6-4తో మిమోమిర్‌పై టైబ్రేకర్‌కు దారితీసిన మ్యాచ్‌లో విజయం సాధించాడు.

Spread the love