ఆల్‌రౌండర్లు కావలెను!

– భారత జట్టులో లోపించిన వైవిధ్యం
– లోతైన టెయిలెండర్లతో తలనొప్పి
– దృష్టి సారించని జట్టు మేనేజ్‌మెంట్‌
పొట్టి క్రికెట్‌లో చాలా జట్లు విభిన్న ప్రణాళికలు, వ్యూహలతో విజయవంతం అయ్యాయి. కానీ ఏ జట్టు సైతం లోతైన బ్యాటింగ్‌ లైనప్‌ లేకుండా ఆ ఘనత సాధించలేదు. అటువంటి కీలక అంశాన్ని భారత క్రికెట్‌ విస్మరిస్తోంది. బౌలింగ్‌ చేయగల స్పెషలిస్ట్‌ బ్యాటర్లు, బ్యాటింగ్‌ చేయగల స్పెషలిస్ట్‌ బౌలర్లు భారత జట్టులో కరువయ్యారు. ఫలితంగా జట్టు సమతూకం కోల్పోయింది. కరీబియన్‌ టూర్‌లో టీమ్‌ ఇండియా వైఫల్యానికి ప్రధాన కారణం ఇదే!.
నవతెలంగాణ క్రీడావిభాగం
బ్యాటింగ్‌ లైనప్‌లో నం.8 నుంచే టెయిలెండర్లు మొదలైతే ఏ జట్టూ ప్రత్యర్థులపై పైచేయి సాధించలేదు. ప్రధాన బ్యాటర్లు నిలకడగా రాణంచటం లేదు. టాప్‌ ఆర్డర్‌లో భారీ భాగస్వామ్యాలు లేవు. అయినా, ఏకంగా నలుగురు నం.11 బ్యాటర్లతో తుది జట్టు కూర్పు సిద్ధం చేయటం భారత క్రికెట్‌ మేనేజ్‌మెంట్‌కే చెల్లింది. వెస్టిండీస్‌తో తొలి టీ20లో భారత్‌ విజయానికి 30 బంతుల్లో 37 పరుగులు అవసరం. చేతిలో ఆరు వికెట్లు ఉన్నాయి. విజయం దాదాపుగా ఖాయం అనుకున్న దవ. కానీ తర్వాతి మూడు బంతుల్లో హార్దిక్‌ పాండ్య, సంజు శాంసన్‌ పెవిలియన్‌కు చేరటంతో.. టెయిలెండర్ల రాక మొదలైంది. 27 బంతుల్లో 37 పరుగులు చేయాల్సిన స్థితిలో నాలుగు వికెట్లు చేతిలో ఉన్నప్పటికీ భారత్‌ పరాజయం పాలైంది. మరోవైపు రెండో టీ20లో వెస్టిండీస్‌ బ్యాటింగ్‌ లైనప్‌ నం.7తోనే ముగిసింది. కానీ కరీబియన్‌ నం.9 బ్యాటర్‌ అకీల్‌ హోసేన్‌, నం.10 బ్యాటర్‌ అల్జారీ జొసెఫ్‌ ఆతిథ్య జట్టుకు ఎటువంటి ఇబ్బంది రానీయలేదు. అలవోకగా భారీ షాట్లు ఆడగలమనే దీమాతో ఆ ఇద్దరు మరో ఓవర్‌ మిగిలి ఉండగానే ఛేదనను పూర్తి చేశారు. బ్యాటింగ్‌ లైనప్‌ పూర్తిగా పెవిలియన్‌కు చేరినా.. బౌండరీలు బాదగల సత్తా బౌలర్లకు సైతం ఉండటం వెస్టిండీస్‌ బలం. భారత జట్టు కూర్పులో లోపించిన వైవిధ్యం ఇదే. వైట్‌బాల్‌ ఫార్మాట్‌లో టీమ్‌ ఇండియా ఎదుర్కొంటున్న సమస్యం.. బ్యాటర్లు బౌలింగ్‌ చేయటం లేదు, బౌలర్లు బ్యాటింగ్‌ చేయటం లేదు. 2024 టీ20 ప్రపంచకప్‌తో పాటు రానున్న 2023 వన్డే వరల్డ్‌కప్‌ ముంగిట టీమ్‌ ఇండియా సరిదిద్దుకోవాల్సిన అత్యంత కీలకమైన బలహీనత ఇది.
గాయాల బెడద
వైట్‌బాల్‌ ఫార్మాట్‌లో ఈ దుస్థితికి విపరీత గాయాలు ఓ కారణం. శార్దుల్‌ ఠాకూర్‌, దీపక్‌ చాహర్‌ సహా భువనేశ్వర్‌ కుమార్‌లు భారత టెయిలెండర్లలో నమ్మకమైన బ్యాటర్లు. కానీ గాయాలు, ఫామ్‌తో ఈ ముగ్గురు తరచుగా జట్టుకు దూరంగానే ఉంటున్నారు. శార్దుల్‌ ఠాకూర్‌ వన్డే జట్టులో నిలిచినా.. పొట్టి ఫార్మాట్‌లో ఆడలేదు. టీ20ల్లో ప్రధానంగా మెరిసే దీపక్‌ చాహర్‌ మ్యాచ్‌ ఫిట్‌నెస్‌ సాధించలేదు. స్వింగ్‌స్టర్‌ భువనేశ్వర్‌ కుమార్‌ సెలక్షన్‌ కమిటీ ప్రణాళికల నుంచి వైదొలిగినట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో యువ పేసర్లలో బ్యాటింగ్‌ చేయగల నైపుణ్యం ఉన్న క్రికెటర్‌ కనిపించటం లేదు. వన్డే జట్టులో మహ్మద్‌ షమి, మహ్మద్‌ సిరాజ్‌లు ఫర్వాలేదనే ప్రదర్శన చేయగలరు, కానీ ఒత్తిడిలో నమ్మకం ఉంచలేం. ఇక స్పిన్‌ ఆల్‌రౌండర్‌ అక్షర్‌ పటేల్‌ పాత్రపై స్పష్టత లేదు. బ్యాటర్‌గా, బౌలర్‌గా అతడికి నిర్దిష్ట బాధ్యతలు ఏవీ టీ20 సిరీస్‌లో ఇవ్వలేదు. నాణ్యమైన ఆల్‌రౌండర్‌ అందుబాటులో ఉన్నప్పటికీ కెప్టెన్‌ హార్దిక్‌ పాండ్య సద్వినియోగం చేసుకోలేదు. హార్దిక్‌ పాండ్య సైతం స్వీయ ఆల్‌రౌండ్‌ నైపుణ్యాలను జట్టుకు ఉపయోగపడేలా చేయలేదు. అందుకు సైతం గాయమే కారణం, అది వేరే సంగతి!.
యువ యువీ ‘తిలక్‌’
చీకట్లో చిరుదీపంలా భారత జట్టుకు అందుబాటులో ఉన్న యువ క్రికెటర్‌ తిలక్‌ వర్మ. కరీబియన్‌ పర్యటనలోనే జాతీయ జట్టుకు అరంగేట్రం చేసిన హైదరాబాదీ స్టయిలీష్‌ బ్యాటర్‌ ఐదు మ్యాచుల్లో నిలకడగా రాణించాడు. భారత జట్టు తరఫున అత్యధిక పరుగులు సాధించాడు. 57.66 సగటు, 140.65 స్ట్రయిక్‌రేట్‌తో కదం తొక్కాడు. ఇక చివరి టీ20లో బంతితో సైతం మాయ చేసిన తిలక్‌ వర్మ.. ఓ వికెట్‌ సైతం ఖాతాలో వేసుకున్నాడు. వైట్‌బాల్‌ ఫార్మాట్‌లో ఆల్‌రౌండర్ల కొరత వేధిస్తున్న వేళ.. తిలక్‌ వర్మ ఆ సమస్యలకు సమాధానం కాగలడు. యువరాజ్‌ సింగ్‌, సురేశ్‌ రైనాల శకం ముగిసిన అనంతరం.. భారత జట్టు మిడిల్‌ ఆర్డర్‌లో కుడి-ఎడమ కూర్పు లోపించింది. నాణ్యమైన పార్ట్‌టైమ్‌ స్పిన్‌ వేయగల బ్యాటర్‌ సైతం కరువయ్యాడు. ఎంతో పరిణతితో ఆడుతున్న తిలక్‌ వర్మ రానున్న 2023 వన్డే వరల్డ్‌కప్‌లో సైతం భారత్‌కు ఉపయుక్తం కాగలడు. మిడిల్‌ ఆర్డర్‌లో నమ్మకమైన బ్యాటర్‌గా.. కుడి-ఎడమ కాంబినేషన్‌ సైతం కుదిరేలా.. నాణ్యమైన స్పిన్‌ బౌలర్‌గా తిలక్‌ వర్మ అసమాన ప్రతిభావంతుడు. 2011 వరల్డ్‌కప్‌తో యువరాజ్‌ మ్యాజిక్‌ చివరగా చూసిన భారత్‌.. అన్నీ కుదిరితే 2023 వరల్డ్‌కప్‌తో యువ యువీ ‘తిలక్‌ వర్మ’ మ్యాజిక్‌ మెరుపులు చూడటం ఖాయం!.

Spread the love