– కెనడా ఓపెన్ ఫైనల్లో ఢ
– సెమీస్‌లో సేన్ అలవోక విజయం
– పి.వి సింధుకు తప్పని భంగపాటు
లక్ష్యసేన్ జోరందుకున్నాడు. ఏడాది విరామానికి తెరదించుతూ బిడబ్ల్యూఎఫ్ సూపర్ 500 టోర్నీ ఫైనల్లోకి దూసుకెళ్లాడు. టైటిల్ ఫేవరేట్, నాల్గో సీడ్ జపాన్ షట్లర్ కెంటా నిషిమోటపై వరుస గేముల్లో గెలుపొందిన లక్ష్యసేన్.. కెనడా ఓపెన్ టైటిల్ పోరుకు సిద్ధమయ్యాడు. ఆల్ ఇంగ్లాండ్ చాంపియన్ లి షి ఫెంగ్ (చైనా)తో నేడు టైటిల్ వేటలో అమీతుమీ తేల్చుకోనున్నాడు. భారత అగ్రశ్రేణి షట్లర్ పి.వి సింధు పోరాటానికి సెమీఫైనల్లోనే తెరపడింది.
కాల్గరీ (కెనడా)
భారత యువ షట్లర్ లక్ష్యసేన్ అదరగొట్టాడు. సుదీర్ఘ విరామం అనంతరం ఓ టైటిల్ పోరుకు సిద్ధమయ్యాడు. ఆదివారం జరిగిన (భారత కాలమానం ప్రకారం) పురుషుల సింగిల్స్ సెమీఫైనల్లో వరుస గేముల్లో గెలుపొందిన లక్ష్యసేన్ కెనడా ఓపెన్ ఫైనల్లోకి దూసుకెళ్లాడు. జపాన్ షట్లర్, నాల్గో సీడ్ కెంటా నిషిమోటపై 21-17, 21-14తో లక్ష్యసేన్ సులువైన విజయం సాధించాడు. మహిళల సింగిల్స్ సెమీఫైనల్లో తెలుగు తేజం, మాజీ వరల్డ్ నం.2 పి.వి సింధు పరాజయం పాలైంది. టాప్ సీడ్, జపాన్ అమ్మాయి అకానె యమగూచి 21-14, 21-15తో సింధుపై వరుస గేముల్లో పైచేయి సాధించింది. సెమీఫైనల్లో ఓటమితో కెనడా ఓపెన్ నుంచి పి.వి సింధు నిష్క్రమించగా.. పురుషుల సింగిల్స్ టైటిల్ కోసం లక్ష్యసేన్ అంతిమ సమరానికి రంగం సిద్ధం చేసుకున్నాడు.
సేన్ సూపర్
వరల్డ్ నం.19 లక్ష్యసేన్ ఈ ఏడాది నిలకడగా నిరాశపరిచాడు. ఒక్క టోర్నీలోనూ ఫైనల్స్‌కు చేరలేదు. 2022 ఆల్ ఇంగ్లాండ్ చాంపియన్‌షిప్ ఫైనలే లక్ష్యసేన్ తలపడిన చివరి టైటిల్ పోరు. 2022 బర్మింగ్‌హామ్ కామన్‌వెల్త్ క్రీడల్లో చివరగా లక్ష్యసేన్ స్వర్ణ పతకం సాధించాడు. గాయాలు, ఫిట్‌నెస్ సమస్యలతో ఫామ్ కోల్పోయిన లక్ష్యసేన్ ఈ ఏడాది బిడబ్ల్యూఎఫ్ సీజన్‌లో అంచనాలను అందుకోలేదు. కెనడా ఓపెన్ 500 టోర్నీలో గత వైభవం దిశగా ఓ అడుగు వేసిన లక్ష్యసేన్.. ఇక్కడ సెమీఫైనల్స్ వరకు అలవోక విజయాలే సాధించాడు. బలమైన ప్రత్యర్థులు ఎదురైనా.. దీటైన ప్రదర్శనతో మెప్పించాడు.లక్ష్యసేన్ జోరందుకున్నాడు. ఏడాది విరామానికి తెరదించుతూ బిడబ్ల్యూఎఫ్ సూపర్ 500 టోర్నీ ఫైనల్లోకి దూసుకెళ్లాడు. టైటిల్ ఫేవరేట్, నాల్గో సీడ్ జపాన్ షట్లర్ కెంటా నిషిమోటపై వరుస గేముల్లో గెలుపొందిన లక్ష్యసేన్ సెమీఫైనల్లో నాల్గో సీడ్, టైటిల్ ఫేవరేట్ కెంటా నిషిమోట (జపాన్)ను సైతం లక్ష్యసేన్ చిత్తు చేశాడు. 44 నిమిషాల్లోనే జపాన్ షట్లర్‌ను ఓడించిన లక్ష్యసేన్.. టైటిల్ పోరుకు సమర శంఖం పూరించాడు. తొలి గేమ్ ఆరంభంలో లక్ష్యసేన్ వెనుకంజ వేశాడు. 2-4తో తడబాటుకు లోనయ్యాడు. 8-8తో లక్ష్యసేన్ స్కోరు సమం చేసినా.. 11-10తో విరామ సమయానికి నిషిమోట ఓ పాయింట్ ఆధిక్యం సాధించాడు. ద్వితీయార్థంలో వరుసగా ఆరు పాయింట్లు సాధించిన లక్ష్యసేన్ 16-11తో జపాన్ షట్లర్‌ను వెనక్కి నెట్టాడు. 17-15తో నిషిమోట అంతరం తగ్గించే ప్రయత్నం చేసినా.. లక్ష్యసేన్ 21-17తో తొలి గేమ్‌ను సొంతం చేసుకున్నాడు. ఇక రెండో గేమ్‌లో ఆది నుంచీ లక్ష్యసేన్ హవా నడిచింది. 4-4 అనంతరం 7-4, 9-6, 11-10తో లక్ష్యసేన్ ఆధిక్యంలో కొనసాగాడు. విరామం అనంతరం మరోసారి వరుసగా ఆరు పాయింట్లు సొంతం చేసుకున్న లక్ష్యసేన్.. నిషిమోటను రేసులో వెనక్కి నెట్టేశాడు. 21-14తో అలవోకగా రెండో గేమ్‌ను, ఫైనల్స్ బెర్త్‌ను దక్కించుకున్నాడు.
మహిళల సింగిల్స్ సెమీఫైనల్లో పి.వి సింధు అంచనాలను అందుకోలేదు. టాప్ సీడ్, జపాన్ స్టార్ అకానె యమగూచికి గట్టి పోటీ ఇవ్వలేకపోయింది. 14-21, 15-21తో 43 నిమిషాల్లోనే ఫైనల్స్ బెర్త్ కోల్పోయింది. తొలి గేమ్‌లో 1-4 నుంచి పుంజుకున్న సింధు 4-4తో స్కోరు సమం చేసింది. కానీ ఆ తర్వాత పోరాట పటిమ కనబరచలేదు. సింధుపై స్పష్టమైన ఆధిపత్యం సాధించిన యయగూచి సులువుగా తొలి గేమ్ నెగ్గింది. రెండో గేమ్‌లో సింధు కాస్త ప్రతిఘటన చూపించే ప్రయత్నం చేసింది. 13-13, 14-14తో స్కోరు సమం చేసిన సింధు.. ఆ తర్వాత తడబాటుకు గురైంది. వరుసగా పాయింట్లు కోల్పోయి రెండో గేమ్‌పైనా ఆశలు వదులుకుంది. సెమీఫైనల్లో పరాజయంతో కెనడా ఓపెన్ నుంచి ఇంటిబాట పట్టింది.
టైటిల్ ఫేవరేట్‌గా..
కెనడా ఓపెన్ టైటిల్‌పై కన్నేసిన లక్ష్యసేన్ నేడు పురుషుల సింగిల్స్ ఫైనల్లో ఫేవరేట్‌గా బరిలోకి దిగుతున్నాడు. టైటిల్ పోరులో చైనా షట్లర్ లి షి ఫెంగ్‌తో లక్ష్యసేన్ పోటీపడనున్నాడు. ఐదో సీడ్ లి షి ఫెంగ్ ఈ ఏడాది ఆల్ ఇంగ్లాండ్ చాంపియన్‌షిప్ విజేతగా నిలిచాడు. ఆ తర్వాత ఫెంగ్ సైతం ఫామ్ కోల్పోయినా.. ప్రస్తుతం కెనడా ఓపెన్‌లో దూకుడుగా రాణిస్తున్నాడు. మరో సెమీఫైనల్లో జపాన్ షట్లర్ కొడారు నరోకపై 21-18, 21-11తో 33 నిమిషాల్లోనే విజయం సాధించాడు. ఫెంగ్‌తో ముఖాముఖి పోరులో లక్ష్యసేన్ 4-2తో పైచేయి సాధించాడు. చివరగా థారులాండ్ ఓపెన్‌లోనూ ఫెంగ్‌పై లక్ష్యసేన్ విజయం సాధించాడు. కెనడా ఓపెన్ టైటిల్‌తో ఏడాది అనంతరం తొలి విజయం అందుకునేందుకు లక్ష్యసేన్ చూస్తుండగా.. ఆల్ ఇంగ్లాండ్ విజయానికి కొనసాగింపుగా మరో టైటిల్ అందుకోవాలని ఫెంగ్ భావిస్తున్నాడు.