విరాట్‌.. మళ్లీ అదే తప్పు!

– బలహీనతగా ఆఫ్‌ సైడ్‌ ఆవల బంతి
– రాణించిన యశస్వి జైస్వాల్‌
– విండీస్‌లో భారత్‌ ప్రాక్టీస్‌ గేమ్‌
ఐసీసీ 2025 ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్‌ వేటను మొదలుపెట్టే వేళ టీమ్‌ ఇండియా స్టార్‌ బ్యాటర్‌ ఫామ్‌ ఆందోళనకు గురి చేస్తోంది. టెస్టు క్రికెట్‌లో విరాట్‌ కోహ్లి నిష్క్రమణలు ఇటీవల ఒకే తరహాలో ఉంటున్నాయి. తాజాగా టీమ్‌ ఇండియా అంతర్గత ప్రాక్టీస్‌ గేమ్‌లోనూ విరాట్‌ కోహ్లి పాత బలహీనతను బయటపెట్టుకున్నాడు. యువ బ్యాటర్‌ యశస్వి జైస్వాల్‌ సాధికారిక ఇన్నింగ్స్‌తో అరంగేట్రానికి రంగం సిద్ధం చేసుకున్నాడు.
నవతెలంగాణ-బ్రిడ్జ్‌టౌన్‌
ఆఫ్‌ సైడ్‌ ఆవల బంతిని ఎదుర్కొవటంలో విరాట్‌ కోహ్లి వైఫల్యం కొనసాగుతుంది. వెస్టిండీస్‌తో రెండు టెస్టుల సిరీస్‌కు ముందు భారత జట్టు బ్రిడ్జ్‌టౌన్‌లో (బార్బడోస్‌) రెండు రోజుల అంతర్గత వార్మప్‌ మ్యాచ్‌ ఆడుతోంది. 16 మంది భారత ఆటగాళ్లు, కొందరు స్థానిక క్రికెట్‌ క్లబ్‌ క్రికెటర్లతో కలిసి టీమ్‌ ఇండియా రెండు బృందాలుగా విడిపోయి ప్రాక్టీస్‌ గేమ్‌ ఆడుతుంది. ప్రాక్టీస్‌ గేమ్‌లో జైదేవ్‌ ఉనద్కత్‌ ఆఫ్‌ సైడ్‌కు ఆవలగా సంధించిన బంతిని ఆడేందుకు ప్రయత్నించిన విరాట్‌ కోహ్లి తొలి స్లిప్స్‌లో క్యాచౌట్‌గా దొరికిపోయాడు. ఆఫ్‌ స్టంప్‌కు దూరంగా వెళ్తోన్న బంతిని వెంటాడి కోహ్లి వికెట్‌ కోల్పోవటం ఇది తొలిసారి కాదు. విరాట్‌ కోహ్లి ట్రేడ్‌ మార్క్‌ షాట్‌ కవర్‌ డ్రైవ్‌. నాలో, ఐదో స్టంప్‌ మీదుగా వెళ్తోన్న బంతులను విరాట్‌ కోహ్లి కవర్‌ డ్రైవ్‌లు కొడితే చూడముచ్చటగా ఉంటుంది. ఆ బలహీనతే కోహ్లిని ఆఫ్‌ సైడ్‌కు ఆవలగా వెళ్తోన్న బంతులను ఆడేందుకు ఉసి గొల్పుతుంది. ఇష్టమైన షాట్‌కు కొట్టే ప్రయత్నంలో.. విరాట్‌ కోహ్లి పదేపదే ఒకే తరహాలో వికెట్‌ పారేసుకుంటున్నాడు. ప్రాక్టీస్‌ గేమ్‌లో ఉనద్కత్‌ వేసిన బంతిని కోహ్లి సరైన ఫుట్‌వర్క్‌ లేకుండా ఆడాడు. అందుకు మూల్యం చెల్లించాడు. లోకల్‌ ఫీల్డర్‌ చేతికి చిక్కి నిష్క్రమించాడు. విరాట్‌ కోహ్లి బలహీనత తెలిసిన జైదేవ్‌ ఉనద్కత్‌ పక్కా లైన్‌, లెంగ్త్‌తో బంతిని సంధించాడు. విరాట్‌ కోహ్లి వికెట్‌ను పడగొట్టిన ఘనతను సొంతం చేసుకున్నాడు. వెస్టిండీస్‌తో టెస్టుల్లో విరాట్‌ కోహ్లి కవర్‌ డ్రైవ్‌ షాట్‌ ఆచితూచి ఆడతాడా? లేదా ఆఫ్‌ సైడ్‌ ఆవల బంతులను వెంటాడి పెవిలియన్‌ బాట పడతాడా? అనేది ఆసక్తికరం.
జైస్వాల్‌ జోరు : యువ బ్యాటర్‌ యశస్వి జైస్వాల్‌ (20) ప్రాక్టీస్‌ గేమ్‌లో మెరిశాడు. టీమ్‌ ఇండియా టాప్‌ ఆర్డర్‌ బ్యాటర్లు అందరూ ఓ జట్టులో ఉండగా.. ప్రధాన బౌలర్లు అందరూ మరో జట్టులో నిలిచారు. కెప్టెన్‌ రోహిత్‌ శర్మతో కలిసి ఓపెనర్‌గా బ్యాటింగ్‌కు వచ్చిన యశస్వి జైస్వాల్‌ ఆకట్టుకునే ఇన్నింగ్స్‌ నమోదు చేశాడు. మహ్మద్‌ సిరాజ్‌ ఓవర్లో ఆన్‌ డ్రైవ్‌, జైదేవ్‌ ఉనద్కత్‌పై స్కేర్‌ కట్‌తో కదం తొక్కిన యశస్వి జైస్వాల్‌ 76 బంతుల్లో అజేయంగా 54 పరుగులు చేశాడు. అజేయ అర్థ శతక ఇన్నింగ్స్‌లో స్వేచ్ఛగా బ్యాటింగ్‌ చేసిన జైస్వాల్‌.. ఎటువంటి అసౌకర్యానికి గురి కాలేదు. కెప్టెన్‌ రోహిత్‌ శర్మ 67 బంతులు ఎదుర్కొన్న అనంతరం రిటైర్డ్‌ హర్ట్‌గా వెనుదిరిగగా.. జైస్వాల్‌ 76 బంతుల తర్తాత విరామం తీసుకున్నాడు. బ్యాటర్లు అందరూ 50-70 బంతులు ఆడిన అనంతరం ఇతరులకు అవకాశం ఇచ్చేందుకు వెనుదిరిగారు.
  నం.3గా గిల్‌? : భారత టెస్టు జట్టులో నం.3 స్థానంలో సుదీర్ఘ కాలం రాణించిన బ్యాటర్‌ చతేశ్వర్‌ పుజార. ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్‌ ఫైనల్‌ అనంతరం సెలక్టర్లు పుజారాపై వేటు వేశారు. దీంతో నం.3 స్థానంలో యువ క్రికెటర్‌ అరంగేట్రానికి రంగం సిద్ధమైంది. యశస్వి జైస్వాల్‌ సహజంగా ఓపెనింగ్‌ బ్యాటర్‌. దీంతో అతడిని ఆ స్థానంలోనే ఆడించేందుకు జట్టు మేనేజ్‌మెంట్‌ సిద్ధమవుతోంది. ఇదే సమయంలో అండర్‌-19 క్రికెట్‌, భారత్‌-ఏ తరఫున శుభ్‌మన్‌ గిల్‌ నం.3 బ్యాటర్‌గా, మిడిల్‌ ఆర్డర్‌ బ్యాటర్‌గా ఆడాడు. దీంతో శుభ్‌మన్‌ గిల్‌ను మిడిల్‌ ఆర్డర్‌ బ్యాటర్‌గా ప్రయోగించేందుకు చీఫ్‌ కోచ్‌ రాహుల్‌ ద్రవిడ్‌ ప్రణాళికలు సిద్ధం చేశారు. అందుకే ప్రాక్టీస్‌ గేమ్‌లో జైస్వాల్‌ను ఓపెనర్‌గా, గిల్‌ను మిడిల్‌ ఆర్డర్‌లో పంపించారు. దీర్ఘకాలిక ప్రణాళికలను దృష్టిలో ఉంచుకుని జట్టు మేనేజ్‌మెంట్‌ ఈ ప్రయోగానికి సిద్ధమవుతోంది.
ఐసీసీ ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్‌ ఫైనల్లో శుభ్‌మన్‌ గిల్‌ ఓపెనర్‌గా బరిలోకి దిగాడు. విరాట్‌ కోహ్లి నం.4, అజింక్య రహానె నం.5, రవీంద్ర జడేజా నం.6, కె.ఎస్‌ భరత్‌ నం.7 స్థానాల్లో బ్యాటింగ్‌కు రావటం లాంఛనమే. దీంతో బ్యాటింగ్‌ ఆర్డర్‌లో నం.3, ఓ ఓపెనింగ్‌ స్థానంపైనే స్పష్టత రావాల్సి ఉంది.
ఆ ఒక్క స్థానమే : బ్యాటింగ్‌ విభాగంలో తుది జట్టులో నిలిచే ఆటగాళ్లు ఖాయం. ఏ స్థానంలో ఆడతారనేది కొంత సస్పెన్స్‌ ఉంది. కానీ బౌలింగ్‌ విభాగంలో ఓ స్థానంపై ఉత్కంఠ కొనసాగుతుంది. రెండో స్పిన్నర్‌ రవిచంద్రన్‌ అశ్విన్‌ నిలువనుండగా.. పేస్‌ ఆల్‌రౌండర్‌ శార్దుల్‌ ఠాకూర్‌ చోటు సాధించనున్నాడు. హైదరాబాదీ పేసర్‌ మహ్మద్‌ సిరాజ్‌ నూతన పేస్‌ దళపతి. సిరాజ్‌, శార్దుల్‌కు తోడుగా పేస్‌ బాధ్యతలు పంచుకునే రెండో సీమర్‌ ఎవరనేది ప్రశ్నార్థకం. ముకేశ్‌ కుమార్‌ సీమ్‌ బౌలింగ్‌, నవదీస్‌ సైని అదనపు పేస్‌తో రేసులో నిలువగా.. జైదేవ్‌ ఉనద్కత్‌ లెఫ్ట్‌ ఆర్మ్‌ పేస్‌ వైవిధ్యంతో రెండో స్థానం కోసం పోటీపడుతున్నాడు.

Spread the love