క్రీడలకు నవోత్సాహం

– సిఎం కప్‌ పోటీలతో జోష్‌
–  జాతీయ క్రీడల తరహాలో నిర్వహణ
నిఖత్‌ జరీన్‌, హుస్సాముద్దీన్‌, ఇషా సింగ్‌, ఉప్పల ప్రణీత్‌, సిక్కిరెడ్డి, ఆకుల శ్రీజ.. అంతర్జాతీయ వేదికలపై అదరగొడుతున్న తెలంగాణ క్రీడాకారులు. కామెన్‌వెల్త్‌ క్రీడల్లోనూ పతకాలు సాధించిన జాబితాలో తెలంగాణ అథ్లెట్లు ఎక్కువగా ఉన్నారు!. మన అథ్లెట్లు బయట దుమ్మురేపుతున్నా.. ఇంట మాత్రం ఆ స్థాయి ఊపు లేదు. తొలిసారి సిఎం కప్‌ పోటీల నిర్వహణతో తెలంగాణలో క్రీడా వాతావరణమే మారింది. జాతీయ క్రీడల తరహాలో భారీ స్థాయిలో నిర్వహించిన సిఎం కప్‌తో క్రీడలకు సరికొత్త ఉత్సాహం సంతరించుకుంది.
సిఎం కప్‌ పోటీలు నిర్వహించటం బాగుంది. ఈ పోటీలు జరుగటం ఇది తొలిసారి. గతంలో హ్యాండ్‌బాల్‌ టోర్నీల్లో పాల్గొన్నాను. కానీ ఎప్పుడూ ఇటువంటి వాతావరణం కనిపించలేదు. రెగ్యులర్‌ చాంపియన్‌షిప్స్‌లలో వసతి, భోజనం విషయంలో ఇబ్బందులు ఎదురయ్యేవి. సిఎం కప్‌ పోటీల్లో భోజనం, వసతి ఏర్పాట్లు చాలా బాగున్నాయి. సిఎం కప్‌ పోటీలను ఇలాగే ప్రతి ఏడాది నిర్వహించాలి’
– రిషిక, హ్యాండ్‌బాల్‌ క్రీడాకారిణి (సిల్వర్‌ మెడలిస్ట్‌)
సిఎం కప్‌ పోటీలు చాలా బాగున్నాయి. తొలిసారి బాక్సింగ్‌లో వయో పరిమితి లేకుండా పోటీలు జరిగాయి. ఇప్పటివరకు మా ఏజ్‌ గ్రూప్‌ బాక్సర్లతోనే పోటీపడ్డాను. సిఎం కప్‌లో సీనియర్‌ బాక్సర్లతో పోటీపడటం గొప్ప అనుభూతిని మిగిల్చింది. ఓపెన్‌ కాంపిటిషన్‌లో పోటీ అనుభవం బాగుంది. నేను సీనియర్లతో పోటీపడి కాంస్య పతకం సాధించాను. ఏర్పాట్లు బాగున్నాయి, పోటీలు సంబురంగా జరిగాయి’
– మాలిక్‌, బాక్సర్‌ (ఆదిలాబాద్‌)
‘బాస్కెట్‌బాల్‌ను 33 జిల్లాల్లో మహిళలకు సైతం నిర్వహించాలని సూచించారు. తొలుత అన్ని జిల్లాల నుంచి జట్లు రావని అనుకున్నాం. మహిళల విభాగంలో ఐదు జట్లు వచ్చినా గొప్పే అనిపించింది. కానీ బాస్కెట్‌బాల్‌లో ఇన్నేండ్ల మా అనుభవం తలకిందులైంది. మహిళా అథ్లెట్లు అద్భుత ప్రదర్శన చేశారు. మహిళల విభాగంలో పోటీలు ఉత్కంఠభరితంగా సాగాయి. గ్రామీణ క్రీడాకారులు పెద్ద సంఖ్యలో పోటీపడ్డారు. ఈ స్థాయి ఆదరణ, స్పందన ఊహించలేదు. సిఎం కప్‌ పోటీలు రాష్ట్ర క్రీడా చరిత్రలో నిలిచిపోతాయి’
– బాస్కెట్‌బాల్‌ సంఘం అధికారి.
కరోనా మహమ్మారి, అనంతరం పరిస్థితుల్లో క్రీడా రంగంలో ఆశించిన జోష్‌ కనిపించలేదు. సంబంధిత క్రీడాంశాల్లో జిల్లా స్థాయి, రాష్ట్ర స్థాయి చాంపియన్‌షిప్‌ పోటీలు జరిగినా.. ఎక్కడా స్పోర్ట్స్‌ ఫెస్టివల్‌ వాతావరణం కనిపించలేదు. ఇటీవల జాతీయ క్రీడలకు తెలంగాణ నుంచి జంబో జట్టు వెళ్లినా.. ముందస్తు శిక్షణ శిబిరాల లేమి, సమన్వయ లోపం స్పష్టంగా కనిపించింది. సిఎం కప్‌ 2023 పోటీలతో రాష్ట్ర క్రీడా రంగ వాతావరణంలో విప్లవాత్మక మార్పు వచ్చింది. 18 క్రీడాంశాల్లో పది రోజుల పాటు ఏకకాలంలో నిర్వహించిన పోటీలతో.. హైదరాబాద్‌లో జాతీయ క్రీడల వాతావరణం నెలకొందని చెప్పటం అతిశయోక్తి కాదు. రానున్న గోవా జాతీయ క్రీడల నేపథ్యంలో సిఎం కప్‌తో తెలంగాణలో క్రీడలకు ఆ ఊపు ముందే వచ్చినట్టు అయ్యింది!.
ఎందుకీ ప్రత్యేకత
ఒలింపిక్‌ క్రీడల్లో ప్రతి ఏడాది జిల్లా, రాష్ట్ర స్థాయిలో పోటీలు జరుగటం సాధారణం. అయినా, సిఎం కప్‌కు ఓ ప్రత్యేకత ఉంది. సాధారణంగా క్రీడా సంఘాలు నిర్వహించే పోటీలకు పెద్దగా ప్రచారం ఉండదు. ఆ పోటీలకు ఎక్కువగా క్రీడా పాఠశాలలు, గురుకుల పాఠశాలల విద్యార్థులే హాజరువుతారు!. సిఎం కప్‌ పోటీల్లో ఓపెన్‌ కాంపిటిషన్‌ నిర్వహించారు. దీంతో క్రీడా, విద్యా రంగాలకు అతీతంగా క్రీడాకారులు పోటీపడ్డారు. ఓపెన్‌ కాంపిటీషన్‌తో వాస్తవిక సామర్థ్యం సైతం వెలుగులోకి వచ్చింది. 615 మండల కేంద్రాల్లో జరిగిన సిఎం కప్‌ పోటీల్లో సుమారు 2 లక్షల మంది క్రీడాకారులు పోటీపడ్డారు. 33 జిల్లా కేంద్రాల్లో జరిగిన సిఎం కప్‌ టోర్నీలో సుమారు 85 వేల మంది క్రీడాకారులు తలపడ్డారు. సిఎం కప్‌ రాష్ట్ర స్థాయిలో పోటీలకు సైతం 7500 క్రీడాకారులు హాజరయ్యారు. రెండు లక్షల మంది క్రీడాకారులు, 12769 గ్రామాలు, 615 మండలాలు, 33 జిల్లాలు క్రీడా పండుగ చేసుకోవటం రాష్ట్ర చరిత్రలోనే ఇది ప్రథమం.
మూడు లక్ష్యాలతో..
సిఎం కప్‌ 2023 పోటీలను ప్రధానంగా మూడు లక్ష్యాలతో మొదలెట్టారు. తెలంగాణ స్ఫూర్తి చాటుతూ యువతలో ఐక్యత, ప్రతిభావంతులైన గ్రామీణ క్రీడాకారులను వెలుగులోకి తీసుకురావటం. ఇక చివరగా.. రానున్న కాలంలో జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో మల్టీస్పోర్ట్స్‌ ఈవెంట్లను నిర్వహించేందుకు సన్నద్ధత. శాట్స్‌ యంత్రాంగం సిఎం కప్‌ టోర్నీ నిర్వహణతో మూడు లక్ష్యాలను సాధించింది!. 12768 గ్రామాలు, 615 మండలాలు, 33 జిల్లాల్లో పక్షం రోజుల పాటు యువత జాతర జరిగింది. రాష్ట్ర స్థాయి పోటీల్లో పతకాలు సాధించిన అథ్లెట్లలో సగానికి పైగా గ్రామీణ క్రీడాకారులు ఉన్నారు. గతంలో క్రీడా సంఘాలు నిర్వహించిన ఏ పోటీలకు హాజరు కాని అథ్లెట్లు.. సిఎం కప్‌ పోటీలతో వెలుగులోకి వచ్చారు. మండల స్థాయి నుంచి క్రీడా పోటీలు నిర్వహించటంతో ఇది సాధ్యపడింది. ఇక ఏకకాలంలో 18 క్రీడాంశాల్లో 7500 మంది అథ్లెట్లకు పోటీలు నిర్వహించిన శాట్స్‌ యంత్రాంగం ఆ దిశగా విజయవంతమైంది. ఐదు స్టేడియాల్లో పోటీల నిర్వహణతో భవిష్యత్‌లో జాతీయ, అంతర్జాతీయ మల్టీస్పోర్ట్స్‌ ఈవెంట్‌కు సక్సెస్‌ఫుల్‌గా నిర్వహించగలమే దీమా తీసుకొచ్చారు.
భారీ ప్రైజ్‌మనీ
సిఎం కప్‌ పోటీల రాష్ట్ర స్థాయి చాంపియన్లకు భారీ ప్రైజ్‌మనీ అందించారు. సాధారణంగా రాష్ట్ర స్థాయి చాంపియన్‌షిప్‌లకు నగదు బహుమతి ప్రకటించటం అరుదు. సిఎం కప్‌లో 18 క్రీడాంశాల్లో జట్టు, వ్యక్తిగత విభాగాల్లో విజేతలకు నగదు బహుమానాలు ఇచ్చారు. జట్టు విభాగంలో విజేతకు రూ. 1 లక్ష, రన్నరప్‌కు రూ.75 వేలు, మూడో స్థానంలో నిలిచిన జట్టుకు రూ.50 వేలు ప్రదానం చేశారు. వ్యక్తిగత పోటీల విభాగంలో పసిడికి రూ.20 వేలు, సిల్వర్‌కు రూ.15 వేలు, కాంస్యానికి రూ.10 వేలు అందజేశారు. 18 క్రీడాంశాల్లో జట్టు, వ్యక్తిగత విభాగాల్లో పసిడి, రజత, కాంస్య పతక విజేతలకు కలిపి సుమారు రూ.1.20 కోట్ల నగదు బహుమతిగా అందించారు.
సిఎం కప్‌ సక్సెస్‌
సిఎం కప్‌ రాష్ట్ర స్థాయి పోటీలకు క్రీడాకారులు, అధికారులు, కోచ్‌లతో కలిపి పది వేల మంది వసతి, భోజనం, రవాణా ఏర్పాట్లు చేశారు. గ్రామీణ ప్రాంతాలకు చెందిన మహిళా అథ్లెట్లు కొందరు తొలిసారి రాష్ట్ర రాజధానికి వచ్చారు. మహిళా అథ్లెట్లు వసతి భవనంలో, ప్రయాణించే బస్సులో, పోటీపడే స్టేడియంలో మహిళా పోలీసు కానిస్టేబుల్‌ను మొహరించారు. భోజనం విషయంలో శాట్స్‌ యంత్రాంగం ఎక్కడా రాజీ పడలేదు. క్రీడాకారులకు పోషక విలువలతో కూడిన భోజనం ఏర్పాటు చేశారు. అధిక ఉష్ణోగ్రతల నేపథ్యంలో పోటీలను ఉదయం, సాయంత్రం సెషన్లోనే నిర్వహించారు. క్రీడాకారులు డిహైడ్రేషన్‌కు గురికాకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. పదికి పైగా విభాగాలతో సమన్వయం చేసుకున్న శాట్స్‌ చైర్మెన్‌ ఆంజనేయ గౌడ్‌ సిఎం కప్‌ 2023 పోటీలను విజయవంతం చేశారు. 2024 సిఎం కప్‌ పోటీల్లో క్రీడాంశాలు 18 నుంచి 25 వరకు పెరిగే అవకాశం ఉంది. తెలంగాణ క్రీడా పండుగగా జరిగిన సిఎం కప్‌కు అపూర్వ స్పందన రావటంతో వచ్చే ఏడాది మరింత ప్రతిష్టాత్మకంగా నిర్వహించేందుకు అవకాశం ఏర్పడింది.

Spread the love