– అజేయ అర్థ సెంచరీల బాదిన ఓపెనర్లు
– భారత్ తొలి ఇన్నింగ్స్ 146/0
– తొలి టెస్టులో భారీ స్కోరు దిశగా భారత్
– వెస్టిండీస్ తొలి ఇన్నింగ్స్ 150/0
తొలి టెస్టుపై టీమ్ ఇండియా పట్టు బిగిస్తోంది. ఓపెనర్లు రోహిత్ శర్మ (68 బ్యాటింగ్), యశస్వి జైస్వాల్ (62 బ్యాటింగ్) అజేయ అర్థ సెంచరీలతో కదం తొక్కగా.. తొలి ఇన్నింగ్స్‌లో భారత్ భారీ స్కోరుపై కన్నేసింది. స్పిన్నర్లు అశ్విన్ (5/60), జడేజా (3/26) మాయజాలంతో తొలి ఇన్నింగ్స్‌లో వెస్టిండీస్ 150 పరుగులకే కుప్పకూలింది. రెండో రోజు లంచ్ విరామ సమయానికి భారత్ 146/0తో నిలిచింది.
నవతెలంగాణ-రొజొ
ఓపెనర్లు కదం తొక్కగా తొలి ఇన్నింగ్స్‌లో భారత్ భారీ స్కోరు దిశగా సాగుతోంది. కెప్టెన్ రోహిత్ శర్మ (68 బ్యాటింగ్, 163 బంతుల్లో 6 ఫోర్లు, 2 సిక్స్‌లు)కు తోడు అరంగేట్ర బ్యాటర్ యశస్వి జైస్వాల్ (62 బ్యాటింగ్, 167 బంతుల్లో 7 ఫోర్లు) అజేయ అర్థ సెంచరీతో విరుచుకుపడ్డాడు. ఓపెనర్ల మెరుపులతో తొలి ఇన్నింగ్స్‌లో విండీస్ స్కోరును దాదాపు సమం చేసిన టీమ్ ఇండియా.. రెండో రోజు ఆట చివరి రెండు సెషన్లలో భారీ ఆధిక్యం సాధించేందుకు రంగం సిద్ధం చేసుకుంది. అంతకుముందు తొలి రోజు ఆటలో వెస్టిండీస్ తొలి ఇన్నింగ్స్‌లో 150 పరుగులకే కుప్పకూలింది.
ఓపెనర్లే ఆడేస్తున్నారు : తొలి టెస్టుకు పచ్చిక లేని పిచ్‌ను సిద్ధం చేయగా భారత ఓపెనర్లు ఆడుకుంటున్నారు. తొలి రోజు చివరి సెషన్లో అజేయంగా 80 పరుగులు జోడించిన రోహిత్, యశస్వి.. రెండో రోజూ జోరు కొనసాగించారు. రెండో రోజు ఉదయం సెషన్లో కరీబియన్లు స్పిన్ ఎక్కువగా ప్రయోగించగా రన్‌రేట్ కాస్త తగ్గింది!. యశస్వి జైస్వాల్ సహజశైలిలో దూకుడుగా ఆడగా.. రోహిత్ శర్మ సమయోచితంగా బౌలర్లను దండించాడు. 104 బంతుల్లో ఏడు ఫోర్లతో యశస్వి కెరీర్ తొలి టెస్టు ఇన్నింగ్స్‌లో అర్థ సెంచరీ పూర్తి చేయగా.. మరో ఎండ్‌లో కెప్టెన్ రోహిత్ శర్మ నాలుగు ఫోర్లు, రెండు సిక్సర్లతో 106 బంతుల్లో అర్థ సెంచరీ సాధించాడు. విండీస్ స్పిన్నర్ రహీం కార్న్‌వాల్ యశస్వి, రోహిత్‌లను ఇరకాటంలో పడేసేందుకు విఫల ప్రయత్నం చేశాడు. తొలి సెషన్లో 32 ఓవర్లలో భారత్ వికెట్ నష్టపోకుండా 66 పరుగులు పిండుకుంది. విండీస్ తొలి ఇన్నింగ్స్‌కు భారత్ 4 పరుగుల చేరువలో నిలిచింది.
అశ్విన్‌కు ఐదు : ఆఫ్ స్పిన్నర్ అశ్విన్ (5/60) ఐదు వికెట్ల ప్రదర్శన చేశాడు. లెఫ్టార్మ్ స్పిన్నర్ రవీంద్ర జడేజా (3/26) సైతం మూడు వికెట్లతో మాయ చేయగా వెస్టిండీస్ తొలి ఇన్నింగ్స్‌లో 150 పరుగులకే కుప్పకూలింది. టీ విరామ సమయానికి 138/8తో నిలిచిన కరీబియన్లు.. చివరి సెషన్ ఆరంభంలోనే చేతులెత్తేశారు. 64.3 ఓవర్లలోనే ఆతిథ్య జట్టు ఆలౌటైంది. అరంగేట్ర బ్యాటర్ అలిక్ అతానెజ్ (47, 99 బంతుల్లో 6 ఫోర్లు, 1 సిక్స్) ఒక్కడే విండీస్ తరఫున ఆకట్టుకున్నాడు. జేసన్ హోల్డర్ (18), కార్న్‌వాల్ (19) చివర్లో విండీస్‌కు గౌరవప్రద పరుగులు జోడించారు. అనంతరం మూడో సెషన్లో బ్యాటింగ్‌కు వచ్చిన టీమ్ ఇండియా 23 ఓవర్లలో వికెట్ నష్టపోకుండా 80 పరుగులు చేసింది. తొలి రోజు ఆట ముగిసే సమయానికి ఓపెనర్లు యశస్వి జైస్వాల్ (40), రోహిత్ శర్మ (30) అజేయంగా నిలిచారు.
వెస్టిండీస్ తొలి ఇన్నింగ్స్ : బ్రాత్‌వేట్ (సి) రోహిత్ (బి) అశ్విన్ 20, చందర్‌పాల్ (బి) అశ్విన్ 12, రీఫర్ (సి) కిషన్ (బి) ఠాకూర్ 2, బ్లాక్‌వుడ్ (సి) సిరాజ్ (బి) జడేజా 14, అతానెజ్ (సి) ఠాకూర్ (బి) అశ్విన్ 47, జోషువ (సి) కిషన్ (బి) జడేజా 2, హోల్డర్ (సి) ఠాకూర్ (బి) సిరాజ్ 18, అల్జారీ (సి) జైదేవ్ (బి) అశ్విన్ 4, కార్న్‌వాల్ నాటౌట్ 19, రోచ్ (ఎల్బీ) జడేజా 1, వారికన్ (సి) గిల్ (బి) అశ్విన్ 1, ఎక్స్‌ట్రాలు : 10, మొత్తం : (64.3 ఓవర్లలో ఆలౌట్) 150. బౌలింగ్ : సిరాజ్ 12-2-25-1, జైదేవ్ 7-2-17-0, అశ్విన్ 24.3-2-60-5, ఠాకూర్ 7-3-15-1, జడేజా 14-7-26-3.
భారత్ తొలి ఇన్నింగ్స్ : యశస్వి జైస్వాల్ 62 బ్యాటింగ్ , రోహిత్ శర్మ బ్యాటింగ్ 68, ఎక్స్‌ట్రాలు : 16, మొత్తం : (55 ఓవర్లలో) 146.
బౌలింగ్ : రోచ్ 8-1-15-0, అల్జారీ 8-1-42-0, కార్న్‌వాల్ 11-3-22-0, వారికన్ 14-2-34-0, హోల్డర్ 9-4-13-0, బ్రాత్‌వేట్ 4-0-7-0, అతానెజ్ 1-0-2-0.