– అభిమానులకు ఇదే నా బహుమతి
– సూపర్‌కింగ్స్ సారథి ఎం.ఎస్ ధోని
ఐపీఎల్ వేదికల్లో అభిమానుల నీరాజనం. బెంగళూర్, అహ్మదాబాద్, ముంబయి, కోల్‌కత, లక్నో, ఢిల్లీ సహా ఎక్కడికెళ్లినా మైదానంలో పసుపు జెర్సీలే దర్శనమిచ్చాయి. ఆతిథ్య జట్టు విజయం కంటే చెన్నై సూపర్‌కింగ్స్ గెలుపు కోసం అభిమానులు తపించారు. అందుకు ఒకే ఒక్క కారణం.. ఇంద్రజాలకుడు ఎం.ఎస్ ధోని. మరో నెల రోజుల్లో 42వ వసంతంలోకి అడుగుపెట్టనున్న ధోని..అభిమానుల కోసం మరో సీజన్‌లో అలరించేందుకు సిద్ధమని ప్రకటించాడు. ఐపీఎల్ 17లో మహి మాయ అభిమానుల కోసం మిగిలే ఉంది!!.
నవతెలంగాణ-అహ్మదాబాద్
మిస్టర్ కూల్ అభిమానులకు తీయటి కబురు. ఎం.ఎస్ ధోని ఐపీఎల్ 17లోనూ అలరించేందుకు సిద్ధమవుతున్నాడు. చెన్నై సూపర్‌కింగ్స్‌కు రికార్డు ఐదో ఐపీఎల్ టైటిల్ అందించిన మహి.. మూడు రోజుల పాటు సాగిన (టెక్నికల్‌గా) ఐపీఎల్16 ఫైనల్లో గుజరాత్ టైటాన్స్‌ను మట్టికరిపించిన సంగతి తెలిసిందే. ఐపీఎల్ టైటిల్ విజయంతో క్రికెట్‌కు గుడ్‌బై చెబుతాడని అందరూ అంచనా వేయగా.. ధోని మాత్రం అభిమానులకు గిఫ్ట్ ప్రకటించాడు. తనపై చూపించిన ప్రేమాభిమానులకు బహుమతిగా వచ్చే ఐపీఎల్ సీజన్‌లోనూ ఆడేందుకు సిద్ధమని తెలిపాడు. ఐపీఎల్ ఫైనల్స్ అనంతరం ప్రసారదారు వ్యాఖ్యాత హర్ష భోగ్లేతో మాట్లాడిన ఎం.ఎస్ ధోని పలు విషయాలపై స్పందించాడు. ఈ విషయాలు ఇవిగో..
ఉత్తమ సమయమే..!
‘పరిస్థితుల పరంగా చూసినప్పుడు రిటైర్మెంట్‌కు ఇదే ఉత్తమ సమయం. ఈ ఏడాది ఐపీఎల్‌లో ఎక్కడికి వెళ్లినా అభిమానులు నాపై అపారమైన ప్రేమ, అభిమానం చూపించారు. ఇంత గొప్ప అనుభూతి ఆస్వాదించిన అనంతరం.. ‘అందరికీ ధన్యవాదాలు’ అని ఓ మాట చెప్పి ముగించవచ్చు. కానీ ఇందులో కఠిన పని ఏంటంటే.. మరో తొమ్మిది నెలల పాటు కష్టపడి వచ్చే సీజన్‌కు సిద్ధమవటం. అభిమానులకు ఇదే నా బహుమతి. ఈ వయసులో ఇది నాకు ఏమంత సాధారణ విషయం కాదు. అభిమానులు నాపై ఎంతో ప్రేమ, ఆప్యాయత చూపించారు. అభిమానుల కోసం నేనూ చేయాల్సింది ఉంది’ అని ధోని అన్నాడు.
భావోద్వేగం సహజం
‘భావోద్వేగానికి లోనవుతాను. అందుకు గల కారణం ఒక్కటే.. ఇది నా కెరీర్‌లో చివరి అంకం. ఐపీఎల్ 2023లో తొలి మ్యాచ్ ఆడేందుకు అహ్మదాబాద్ వచ్చినప్పుడు.. నిండుకుండను తలపించిన స్టేడియం నా పేరుతో మార్మోగినప్పుడు కండ్లలో నీళ్లు తిరిగాయి. డగౌట్‌లో కాసేపు కూర్చున్నాను. కాస్త సమయం తర్వాత ఇది ఒత్తిడికి లోనయ్యే సన్నివేశం కాదు.. విజయాన్ని ఆస్వాదించే సమయమని గ్రహించాను. చెపాక్‌లో చివరి లీగ్ మ్యాచ్ ఆడినప్పుడు చెన్నైలోనూ ఇదే జరిగింది. చెపాక్‌లో మళ్లీ ఆడనుండటం గొప్ప భావన కలిగిస్తుందని’ ధోని తెలిపాడు.
అలా చేయలేను
‘అభిమానులు ఇంతలా అభిమానించడానికి నేను నాలాగా ఉండటమే కారణమని భావిస్తాను. ఏ సమయంలోనైనా ఒదిగి ఉంటాననే అభిమానులు ఇష్టపడుతున్నారు. నేను మైదానంలో ఆడే క్రికెట్ సైతం అందుకు ఓ కారణం. నేను ఆడే షాట్లను అభిమానులు సైతం ఆడగలమని అనుకుంటారు. ఎందుకంటే, నేను సంప్రదాయ క్రికెట్ షాట్లను ఆడను. అభిమానులు తమను నాలో చూసుకుంటున్నారని అనుకుంటున్నాను. ఇదే సమయంలో నేను ఎన్నడూ నా శైలి మార్చుకోవాలని అనుకోను, నేను కాని పాత్ర, స్వభావంలో నన్ను చూపించాలనుకోలేదు. అంతా సింపుల్‌గా ఉంచాను’ అని మహి అన్నాడు.
కోపం వస్తుంది!
‘కోపం నాకు కూడా వస్తుంది. నేనూ మానవ మాత్రుడనే. కానీ నేను పొరపాటు జరిగినప్పుడు ఏం జరిగిందనే విషయాన్ని.. అవతలి వ్యక్తి కోణంలో నుంచి చూస్తాను. ఒత్తిడిని ఒక్కొక్కరు ఒకలా మేనేజ్ చేస్తారు. మనం ఆటగాళ్లకు మద్దతు నిలిచి ప్రోత్సహిస్తే మనం ఉన్నప్పుడూ రాణిస్తారు. మనం లేకపోయినా.. అదే స్థాయిలో మెప్పిస్తారు. అజింక్య రహానె అనుభవజ్ఞుడు. జట్టులో ఇంకొందరు సైతం అనుభవం కలిగి ఉన్నారు. వారి గురించి ఆందోళన చెందను, బాధ్యత తీసుకోవాలని వారికి చెబుతాను. ఏమైనా సందేహం ఉంటే.. నా వద్దకు రావాలని చెబుతాను. ఓవరాల్‌గా ఫైనల్లో అందరూ బాధ్యత తీసుకున్నారని’ ఎంఎస్‌డి చెప్పాడు.
రాయుడుతో ఆ అవార్డు రాదు!
‘అంబటి రాయుడు జట్టులో ఉండగా నేను ఫెయిర్‌ప్లే అవార్డు సాధించలేను. ఎందుకంటే అతడు దేనికైనా వేగంగా స్పందిస్తాడు. (నవ్వుతూ. ఈ సమయంలో రాయుడు సైతం నవ్వుతూ కనిపించాడు). కానీ రాయుడు మైదానంలోకి అడుగుపెడితే 100 శాతం ప్రదర్శన చేస్తాడు. అతడు జట్టు ఆటగాడు.. భారత్-ఏకు ఆడిన రోజుల నుంచి రాయుడు అద్భుతమైన క్రికెటర్. స్పిన్, పేస్ సమర్థవం తంగా ఆడే క్రికెటర్లలో రాయుడు ఒకడు. ఫైనల్ మ్యాచ్‌లో రాయుడు ప్రత్యేక ప్రదర్శన చేస్తాడని అనుకున్నాను. రాయుడి పట్ల ఎంతో సంతో షంగా ఉంది. ఈ మ్యాచ్‌ను అతడు కొన్నాండ్ల పాటు గుర్తుంచుకుంటాడు. రాయుడు కూడా నాలాగే ఎక్కువగా ఫోన్ వాడడు. రాయుడు జీవితంలో తర్వాతి అంకాన్ని సైతం ఆస్వాదిం చాలని కోరుకుంటున్నాను’ అని ధోని అన్నాడు.