టెస్టుల్లో ఇక కొత్తగా!

– 2025 డబ్ల్యూటీసీ రేసుకు సిద్ధమైన భారత్‌
– విండీస్‌తో తొలి టెస్టు నేటి నుంచి
రాత్రి 7.30 నుంచి డిడి స్పోర్ట్స్‌లో..
నవతెలంగాణ-రొజొ
టీమ్‌ ఇండియా టెస్టు క్రికెట్‌ ప్రయాణం సరికొత్తగా ఆరంభం కానుంది. వరుసగా రెండు ఐసీసీ ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్‌ ఫైనల్స్‌లో రన్నరప్‌గా నిలిచిన భారత్‌.. 2025లోనైనా ఐసీసీ డబ్ల్యూటీసీ టైటిల్‌ నెగ్గే జట్టును సిద్ధం చేయాలనే సంకల్పంతో కనిపిస్తుంది. యువ క్రికెటర్లను జట్టులోకి రావటంతో ఇటు బ్యాటింగ్‌, అటు బౌలింగ్‌ విభాగాలు కాస్త కొత్తగా కనిపించనున్నాయి. భారత్‌, వెస్టిండీస్‌ తొలి టెస్టు నేటి నుంచి ఆరంభం కానుండగా.. ఐసీసీ 2025 డబ్ల్యూటీసీ వేటను భారత్‌ ఇక్కడి నుంచే షురూ చేయనుంది.
2021, 2023 ఐసీసీ ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్‌ ఫైనల్లో భంగపడిన భారత్‌.. ఇప్పుడు మిషన్‌ 2025 డబ్ల్యూటీసీ దిశగా అడుగులు వేస్తోంది. గత నాలుగేండ్లలో అత్యంత నిలకడగా ఐదు రోజుల ఆటలో రాణించినా.. చివరకు రన్నరప్‌ ట్యాగ్‌తోనే సరిపెట్టుకోవాల్సి వచ్చింది. టెస్టు క్రికెట్‌ అంతిమ సమరం విదేశీ గడ్డపై జరుగనుండటంతో.. ఇంగ్లీష్‌ పరిస్థితుల్లో రాణించగల క్రికెటర్లతో కూడిన జట్టును సిద్ధం చేసే పనిలో భారత్‌ నిమగమైంది. అందులో తొలి అడుగు.. నేడు వెస్టిండీస్‌తో తొలి టెస్టు సవాల్‌. కరీబియన్లపై సిరీస్‌ విజయం రోహిత్‌సేనకు పెద్ద సమస్య కాదు. కానీ రానున్న రెండేండ్లలో బలమైన జట్టుకు ఇక్కడ గట్టి పునాది వేయటమే ద్రవిడ్‌, రోహిత్‌ ద్వయం ప్రణాళిక. మరోవైపు దక్షిణాఫ్రికాతో సిరీస్‌లో చతికిల పడిన కరీబియన్లు భారత్‌తో సిరీస్‌కు జట్టు ఎంపికలో కీలక నిర్ణయాలు తీసుకుంది. దీంతో ఇటు భారత్‌, ఇటు వెస్టిండీస్‌ టెస్టు క్రికెట్లో సరికొత్త ప్రయాణానికి సిద్ధపడుతూ నేటి నుంచి తొలి టెస్టులో తలపడనున్నాయి.
యశస్వి అరంగేట్రం!
యువ బ్యాటర్‌ యశస్వి జైస్వాల్‌ టెస్టు అరంగేట్రం లాంఛనంగా కనిపిస్తుంది. వార్మప్‌ గేముల్లో ఓపెనర్‌గా మెరిసిన యశస్వి జైస్వాల్‌ ఫస్ట్‌ క్లాస్‌ క్రికెట్‌లో 80కి పైగా సగటుతో పరుగులు సాధించాడు. యశస్వి జైస్వాల్‌ ఓపెనర్‌గా వస్తాడా? నం.3 స్థానంలో బ్యాటింగ్‌ చేస్తాడా? అనేది తెలియాల్సి ఉంది. చతేశ్వర్‌ పుజారాపై వేటు పడటంతో నం.3 స్థానం లోటు పూడ్చేందుకు శుభ్‌మన్‌ గిల్‌ను సిద్ధం చేస్తున్నారు. కెరీర్‌లో ఎక్కువగా మిడిల్‌ ఆర్డర్‌లోనే ఆడిన గిల్‌.. టెస్టు ఫార్మాట్‌లో ఇక నుంచి మూడో స్థానంలో బ్యాటింగ్‌ చేసే అవకాశం ఉంది. కెప్టెన్‌ రోహిత్‌ శర్మ పేసర్లపై బాగానే ఆడుతున్నా.. మంచి ఆరంభాలను భారీ స్కోర్లుగా మలచటం లేదు. స్టార్‌ బ్యాటర్‌ విరాట్‌ కోహ్లి కొంతకాలంగా నిరాశపరుస్తున్నాడు. అతడి టెస్టు సగటు సైతం పడిపోతుంది. అరకొర ఇన్నింగ్స్‌లతో విరాట్‌ కోహ్లి ఎంతోకాలం నెట్టుకురాలేడు. స్థాయికి తగ్గ ప్రదర్శనలు చేయడానికి విరాట్‌ కోహ్లికి ఇదే మంచి తరుణం. ఇక అజింక్య రహానె కెరీర్‌లో రెండో ఇన్నింగ్స్‌ ఆడుతున్నాడు. యువ జట్టును సిద్ధం చేస్తుండటంతో అతడి స్థానం ప్రశ్నార్థకమే. నిలకడగా విలువైన ఇన్నింగ్స్‌లు నమోదు చేస్తేనే.. అజింక్య రహానె జట్టులో ఉండగలడు. ఆ విషయం అతడీ తెలుసు, దీంతో కరీబియన్లతో సిరీస్‌ రహానెకు సైతం అత్యంత కీలకం.
ఆల్‌రౌండర్లుగా రవీంద్ర జడేజా, శార్దుల్‌ ఠాకూర్‌ తుది జట్టులో నిలువనున్నారు. ఇక్కడి పిచ్‌ స్పిన్‌కు అనుకూలం. దీంతో రవిచంద్రన్‌ అశ్విన్‌ రెండో స్పిన్నర్‌గా తుది జట్టులోకి రానున్నాడు. మహ్మద్‌ షమి లేని వేళ హైదరాబాదీ పేసర్‌ మహ్మద్‌ సిరాజ్‌ పేస్‌ విభాగాన్ని ముందుండి నడిపించనున్నాడు. జైదేవ్‌ ఉనద్కత్‌, నవదీప్‌ సైనిలలో ఒకరు సిరాజ్‌, శార్దుల్‌తో కలిసి పేస్‌ బాధ్యతలు పంచుకోనున్నారు.
పోటీ ఇస్తారా?
వెస్టిండీస్‌ జట్టు మరీ తీసికట్టుగా తయారవుతోంది. ఇటీవల 2023 వన్డే వరల్డ్‌కప్‌కు అర్హత సాధించటంలో విఫలం కాగా.. రెడ్‌ బాల్‌ ఫార్మాట్‌లో విండీస్‌ చాన్నాండ్ల నుంచి పేలవంగా ఆడుతున్నారు. కరీబియన్‌ పర్యటనలో భారత జట్టు గత నాలుగు పర్యటనల్లో టెస్టు సిరీస్‌లు సొంతం చేసుకుంది. ఇప్పుడు సిరీస్‌ చేజారితే.. భారత్‌ వరుసగా ఐదోసారి టెస్టు సిరీస్‌ను కైవసం చేసుకోనుంది. సఫారీతో సిరీస్‌ అనంతరం విండీస్‌ జట్టులో మార్పులు చేశారు. రోస్టన్‌ ఛేజ్‌ సహా పలువురు ఆటగాళ్లపై సెలక్షన్‌ కమిటీ వేటు వేసింది. దీంతో భారత్‌తో సిరీస్‌కు కొందరు యువ ఆటగాళ్లు జట్టులోకి వచ్చారు. క్రెయిగ్‌ బ్రాత్‌వేట్‌, రేమన్‌ రీఫర్‌, బ్లాక్‌వుడ్‌, డ సిల్వ సహా జేసన్‌ హోల్డర్‌ కీలకం కానున్నారు. కీమర్‌ రోచ్‌, అల్జారీ జొసెఫ్‌, గాబ్రియెల్‌తో కూడిన పేస్‌ దళం రోహిత్‌సేనకు ఏ మేరకు సవాల్‌ విసరగలదో చూడాలి.
పిచ్‌, వాతావరణం
విండ్‌సోర్‌ పార్క్‌ గణాంకాల ప్రకారం ఇక్కడ స్పిన్‌కు మొగ్గు ఎక్కువ. స్పిన్నర్లు 23.35 సగటుతో 87 వికెట్లు పడగొట్టగా.. పేసర్లు 28.43 సగటుతో 80 వికెట్లు కూల్చారు. స్పిన్నర్ల స్ట్రయిక్‌రేట్‌ 48.5 కాగా, పేసర్లది 68.5గా ఉంది. బ్యాటింగ్‌కు అనువుగా ఉండే ఇక్కడ టెస్టు మ్యాచ్‌ సమయంలో చిరుజల్లులతో కూడిన వర్షం సూచనలు ఉన్నాయి. తుది జట్టు ఎంపికలో వాతావరణ పరిస్థితులు ప్రభావం చూపే అవకాశం ఉంది. టాస్‌ నెగ్గిన జట్టు తొలుత బ్యాటింగ్‌ ఎంచుకునేందుకు మొగ్గు చూపవచ్చు.
తుది జట్లు (అంచనా)
భారత్‌ : శుభ్‌మన్‌ గిల్‌, రోహిత్‌ శర్మ, యశస్వి జైస్వాల్‌, విరాట్‌ కోహ్లి, అజింక్య రహానె, రవీంద్ర జడేజా, కె.ఎస్‌ భరత్‌, రవిచంద్రన్‌ అశ్విన్‌, శార్దుల్‌ ఠాకూర్‌, మహ్మద్‌ సిరాజ్‌, జైదేవ్‌ ఉనద్కత్‌.
వెస్టిండీస్‌ : క్రెయిగ్‌ బ్రాత్‌వేట్‌, టాగెనరైన్‌ చందర్‌పాల్‌, రేమన్‌ రీఫర్‌, జెర్మెన్‌ బ్లాక్‌వుడ్‌, అలిక్‌ అల్తానాజె, జోషువ డ సిల్వ, జేసన్‌ హోల్డర్‌, రహీం కార్న్‌వాల్‌, అల్జారీ జొసెఫ్‌, కీమర్‌ రోచ్‌, షానన్‌ గాబ్రియల్‌.
వెస్టిండీస్‌తో రవిచంద్రన్‌ అశ్విన్‌ సాధించిన శతకాలు నాలుగు. ప్రస్తుత జట్టులో మరో బ్యాటర్‌కు కరీబియన్లపై శతకాల పరంగా ఈ రికార్డు లేదు. రహానె మూడు అర్థ సెంచరీలు, రెండు శతకాలు సాధించాడు.

36.59
పేస్‌ బౌలింగ్‌పై రోహిత్‌ శర్మ సగటు 36.59. 2020 నుంచి టెస్టుల్లో పేస్‌ను సమర్థవంతంగా ఎదుర్కొంటున్న ఉత్తమ భారత బ్యాటర్‌ హిట్‌మ్యానే.

Spread the love