– బంగ్లాపై భారత్ ఘన విజయం
– 2-0తో టీ20 సిరీస్ కైవసం
మీర్పూర్ (బంగ్లాదేశ్)
పొట్టి ఫార్మాట్‌లో టీమ్ ఇండియా అమ్మాయిలకు ఎదురు లేదు. వరుసగా రెండో టీ20లో ఆతిథ్య బంగ్లాదేశ్‌ను చిత్తుచేసిన హర్మన్‌ప్రీత్ కౌర్‌సేన.. మూడు టీ20ల సిరీస్‌ను మరో మ్యాచ్ ఉండగానే 2-0తో సొంతం చేసుకుంది. మంగళవారం మీర్పూర్‌లో జరిగిన రెండో టీ20లో బంగ్లాదేశ్‌పై భారత్ 8 పరుగుల తేడాతో గెలుపొందింది. స్పిన్ సవాల్‌గా మారిన మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ 20 ఓవర్లలో 8 వికెట్లకు 95 పరుగులే చేసింది. ఓపెనర్లు స్మృతీ మంధాన (13), షెఫాలీ వర్మ (19), యస్టికా భాటియా (11), దీప్తి శర్మ (10), ఆమన్‌జోత్ కౌర్ (14) రెండెంకల స్కోరు సాధించారు. రొడ్రిగస్ (8), హర్మన్‌ప్రీత్ కౌర్ (0), హర్లీన్ డియోల్ (6) నిరాశపరిచారు. స్పిన్ మాయజాలంలో పరుగుల వేట గగనమైంది. 96 పరుగుల సవాల్‌తో కూడిన లక్ష్యాన్ని బంగ్లాదేశ్ ఛేదించటంలో చతికిల పడింది. 20 ఓవర్లలో కుప్పకూలిన ఆతిథ్య జట్టు 87 పరుగులే చేసింది. నిగార్ సుల్తానా (38, 55 బంతుల్లో 2 ఫోర్లు) ఛేదనలో కెప్టెన్సీ ఇన్నింగ్స్ నమోదు చేసినా.. సహచరుల నుంచి సహకారం లభించలేదు. భారత స్పిన్నర్ దీప్తి శర్మ (3/12), షెఫాలీ వర్మ (3/15) మూడు వికెట్ల మ్యాజిక్‌తో బంగ్లాదేశ్‌ను కట్టడి చేశారు. మిన్నూ మణి (2/9) రెండు వికెట్ల ప్రదర్శనతో రాణించింది. దీప్తి శర్మ ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డు అందుకుంది. సిరీస్‌లో నామమాత్రపు మూడో టీ20 గురువారం మీర్పూర్‌లోనే జరుగనుంది.