ఇంకో 194 పరుగులు!

– సౌత్‌ జోన్‌ ముంగిట కఠిన సవాల్‌
– నార్త్‌ జోన్‌తో దులీప్‌ ట్రోఫీ సెమీఫైనల్‌
బెంగళూర్‌ : నార్త్‌జోన్‌తో సౌత్‌ జోన్‌ దులీప్‌ ట్రోఫీ సెమీఫైనల్‌ రసవత్తర ముగింపుకు చేరుకుంది. తొలి ఇన్నింగ్స్‌లో 3 పరుగుల ఆధిక్యం సాధించిన నార్త్‌ జోన్‌.. రెండో ఇన్నింగ్స్‌లో 211 పరుగులకు కుప్పకూలింది. సౌత్‌ జోన్‌కు 215 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించిన నార్త్‌ జోన్‌.. నేడు చివరి రోజు ఆటలో పది వికెట్లు పడగొట్టాల్సి ఉంది. ఇక సౌత్‌ జోన్‌ మూడో రోజు ఆట ముగిసే సమయానికి ఛేదనలో 21/0తో ఆడుతోంది. ఓపెనర్లు సాయి సుదర్శన్‌ (5 నాటౌట్‌), మయాంక్‌ అగర్వాల్‌ (15 నాటౌట్‌) అజేయంగా ఆడుతున్నారు. కెప్టెన్‌ హనుమ విహారి, రికీ భురు సహా తిలక్‌ వర్మ నేడు ఛేదనలో కఠిన సవాల్‌ ఎదుర్కొనున్నారు. తొలి ఇన్నింగ్స్‌లో విఫలమైన హనుమ విహారి చివరి రోజు ఆటలో మెరుస్తాడేమో చూడాలి. అంతకుముందు పేసర్‌ విజరు కుమార్‌ వైశాక్‌ (5/76) ఐదు వికెట్ల ప్రదర్శనతో చెలరేగాడు. సాయి కిశోర్‌ (3/28), కవేరప్ప (2/47) సైతం రాణించటంతో నార్త్‌జోన్‌ రెండో ఇన్నింగ్స్‌లో 211 పరుగులకే కుప్పకూలింది. ప్రభుసిమ్రన్‌ సింగ్‌ (63) అర్థ సెంచరీతో నార్త్‌ జోన్‌ను ఆదుకున్నాడు.
మరోవైపు వెస్ట్‌ జోన్‌ 384 పరుగుల భారీ ఆధిక్యంలో కొనసాగుతుంది. చతేశ్వర్‌ పుజారా (133) అజేయ సెంచరీ మెరుపులతో వెస్ట్‌ జోన్‌ రెండో ఇన్నింగ్స్‌లో 292/9తో నిలిచింది. ఓవర్‌నైట్‌ డిక్లరేషన్‌ ప్రకటించినా.. సెంట్రల్‌ జోన్‌ 385 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించాల్సి ఉంటుంది. వెస్ట్‌జోన్‌ తొలి ఇన్నింగ్స్‌లో 220 పరుగులు చేయగా, సెంట్రల్‌ జోన్‌ 128 పరుగులకే కుప్పకూలింది.

Spread the love