వీడ్కోలుపై యూ టర్న్‌

– ప్రధాని జోక్యంతో వెనక్కి తగ్గిన తమీమ్‌ ఇక్బాల్‌
ఢాకా : భావోద్వేగ పరిణామాల నేపథ్యంలో అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికిన బంగ్లాదేశ్‌ కెప్టెన్‌ తమీమ్‌ ఇక్బాల్‌.. ఒక్క రోజు వ్యవధిలోనే రిటైర్మెంట్‌పై యూ టర్న్‌ తీసుకున్నాడు. అఫ్గనిస్థాన్‌తో తొలి వన్డేలో బంగ్లాదేశ్‌కు సారథ్యం వహించిన తమీమ్‌ ఇక్బాల్‌.. గురువారం వీడ్కోలు ప్రకటనలో కంటతడి పెట్టిన సంగతి తెలిసిందే. బంగ్లాదేశ్‌ మాజీ కెప్టెన్‌, ఎంపీ మష్రఫె మొర్తజా ఈ విషయంలో చొరవ తీసుకున్నారు. దీంతో శుక్రవారం బంగ్లాదేశ్‌ ప్రధాని షేక్‌ హసీనాను ఆమె అధికారిక నివాసంలో తమీమ్‌ ఇక్బాల్‌ కుటుంబంతో కలిశాడు. ఈ సందర్భంగా రిటైర్మెంట్‌ను వెనక్కి తీసుకోవాలని ప్రధాని సూచించటంతో తమీమ్‌.. బంగ్లాకు మళ్లీ ప్రాతినిథ్యం వహించేందుకు సముఖత వ్యక్తం చేశాడు. ‘ప్రధాని ఆహ్వానం మేరకు ఇక్కడకు వచ్చాను. ప్రధానితో సుదీర్ఘంగా చర్చ జరిగింది. ఆమె సూచన మేరకు వీడ్కోలు నిర్ణయాన్ని మార్చుకుంటున్నాను. నేను ఎవరికైనా నో చెప్పగలను, కానీ దేశంలో అత్యంత ముఖ్యమైన వ్యక్తికి నో చెప్పటం అసాధ్యం’ అని తమీమ్‌ ఇక్బాల్‌ అన్నాడు. ఫిట్‌నెస్‌ సమస్యలు ఎదుర్కొంటున్న తమీమ్‌ ఇక్బాల్‌ ఓ ఆరు వారాల విరామం అనంతరం తిరిగి జాతీయ జట్టులోకి రానున్నాడు. ప్రధానితో తమీమ్‌ సమావేశంలో బంగ్లా క్రికెట్‌ బోర్డు చైర్మెన్‌ నజ్ముల్‌ హసన్‌, మష్రఫె మొర్తజా సైతం పాల్గొన్నారు.

Spread the love