అందరూ బ్రిజ్‌భూషణ్‌ పక్షమే!!

అతడి అనుచరుడికే రెజ్లింగ్‌ సమాఖ్య పగ్గాలు
జులై 6న డబ్ల్యూఎఫ్‌ఐ ఎన్నికలు
నవతెలంగాణ-న్యూఢిల్లీ
భారతీయ జనతా పార్టీ (బిజెపి) ఎంపీ, భారత రెజ్లింగ్‌ సమాఖ్య (డబ్ల్యూఎఫ్‌ఐ) మాజీ అధ్యక్షుడు బ్రిజ్‌ భూషణ్‌ శరణ్‌ సింగ్‌ కుస్తీ సమాఖ్యపై పట్టు కొనసాగించేందుకు పావులు కదుపుతున్నాడు. మహిళా రెజ్లర్లను లైంగిక వేధింపులకు గురి చేసిన బ్రిజ్‌భూషణ్‌ శరణ్‌ సింగ్‌పై చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలని ఈ ఏడాది జనవరి నుంచి భారత రెజ్లింగ్‌ క్రీడాకారులు అటు న్యాయస్థానంలో, ఇటు జంతర్‌మంతర్‌ వద్ద చేస్తున్న ఆందోళనకు అర్థమే లేకుండా పోయే ప్రమాదం ఏర్పడింది!. జులై 6న భారత రెజ్లింగ్‌ సమాఖ్యకు ఎన్నికలు నిర్వహించనుండగా.. బ్రిజ్‌ భూషణ్‌ శరణ్‌ సింగ్‌ తన సన్నిహితులు, అనుచరులను డబ్ల్యూఎఫ్‌ఐ ఎగ్జిక్యూటివ్‌ కమిటీలో కూర్చోబెట్టేందుకు అడుగులు వేస్తున్నాడు.
మంత్రి హామీ ఇచ్చినా..!
రానున్న రెజ్లింగ్‌ సమాఖ్య ఎన్నికల్లో బ్రిజ్‌ భూషణ్‌ శరణ్‌ సింగ్‌ కుటుంబ సభ్యులు పోటీ చేయకుండా చూస్తామని రెజ్లర్లకు క్రీడాశాఖ మంత్రి అనురాగ్‌ ఠాకూర్‌ హామీ ఇచ్చారు. బ్రిజ్‌ భూషణ్‌ కుమారుడు కరణ్‌ భూషణ్‌ సింగ్‌, ఇద్దరు అల్లుళ్లు విశాల్‌ సింగ్‌, ఆదిత్య సింగ్‌లు ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం లేదు. స్పోర్ట్స్‌ కోడ్‌ నిబంధనల కారణంగా బ్రిజ్‌ భూషణ్‌ పోటీకి అనర్హుడు. బ్రిజ్‌ భూషణ్‌ అత్యంత సన్నిహితుడు, మాజీ ఒలింపిక్‌ సత్యపాల్‌ సింగ్‌ దేశ్వాల్‌ ఈ పర్యాయం డబ్ల్యూఎఫ్‌ఐ అధ్యక్ష బరిలో నిలిచే అవకాశం కనిపిస్తుంది.
తిరుగులేని పట్టు
భారత రెజ్లింగ్‌ సమాఖ్యలో 25 అనుబంధ సంఘాలు ఉన్నాయి. ప్రత్యేక సర్వ సభ్య సమావేశంలో నిర్వహించే ఎన్నికలకు ప్రతి రాష్ట్ర సంఘం ఇద్దరు ప్రతినిధులను పంపిస్తాయి. 25 అనుబంధ సంఘాల నుంచి 50 మందికి ఓటు హక్కు ఉంటుంది. పంజాబ్‌, మహారాష్ట్ర రాష్ట్ర రెజ్లింగ్‌ సంఘాలు మినహా 23 రాష్ట్ర సంఘాలు బ్రిజ్‌ భూషణ్‌ శరణ్‌ సింగ్‌కు అనుకూలంగా ఉన్నాయి. 23 రాష్ట్ర సంఘాల మద్దతు ఉండటంతో బ్రిజ్‌ భూషణ్‌ శరణ్‌ సింగ్‌ బలపరిచిన అభ్యర్థే రెజ్లింగ్‌ సమాఖ్య అధ్యక్షుడిగా, ఆఫీస్‌ బేరర్లుగా ఎన్నిక కానున్నారు.
ఢిల్లీ పోలీసుల ఛార్జ్‌షీట్‌లో బ్రిజ్‌ భూషణ్‌ శరణ్‌ సింగ్‌పై పోక్సో చట్టం ఉపసంహరించారు. లైంగిక వేధింపుల కేసులో కచ్చితంగా అరెస్టు చేయాల్సిన అవసరం ఉండదు. రెజ్లర్లు జనవరి నుంచి చేస్తున్న న్యాయ పోరాటంతో బ్రిజ్‌ భూషణ్‌ను అరెస్టు చేసే పరిస్థితి లేదు. ఇదే సమయంలో భారత రెజ్లింగ్‌ సమాఖ్యలో అతడి ప్రాబల్యాన్ని తొలగించే ప్రయత్నం జరుగలేదు. దీంతో రానున్న భారత రెజ్లింగ్‌ సమాఖ్య ఎన్నికలు మరోసారి బ్రిజ్‌భూషణ్‌ శరణ్‌ సింగ్‌ బల ప్రదర్శనకు వేదికగా మారనుందని చెప్పవచ్చు!.

Spread the love