ఫైనల్లో సాత్విక్‌ జోడీ

– సెమీస్‌లో కొరియా జోడీపై గెలుపు
– పోరాడి ఓడిన హెచ్‌ఎస్‌ ప్రణరు
– ఇండోనేషియా ఓపెన్‌ సూపర్‌ సిరీస్‌
జకర్తా (ఇండోనేషియా) : భారత బ్యాడ్మింటన్‌ డబుల్స్‌ స్టార్స్‌ సాత్విక్‌సాయిరాజ్‌ రాంకిరెడ్డి, చిరాగ్‌ శెట్టి జోడీ మరో టోర్నీలో టైటిల్‌ పోరుకు చేరుకున్నారు. దక్షిణ కొరియా జోడీతో సెమీఫైనల్లో 2-1తో గెలుపొందిన సాత్విక్‌, చిరాగ్‌ జోడీ ఆదివారం జరిగే తుది పోరులో అమీతుమీ తేల్చుకోనున్నారు. 17-21, 21-19 21-18తో మనోళ్లు మెరుపు విజయం నమోదు చేశారు. పురుషుల సింగిల్స్‌లో హెచ్‌.ఎస్‌ ప్రణరుకి నిరాశే ఎదురైంది. టాప్‌ సీడ్‌ విక్టర్‌ అక్సల్సెన్‌తో సెమీఫైనల్లో పరాజయం పాలయ్యాడు. తొలి గేమ్‌లో 15-21తో ఓటమి చెందిన ప్రణరు.. కీలక రెండో గేమ్‌లోనూ పుంజుకునే ప్రయత్నం చేయలేదు. 45 నిమిషాల మ్యాచ్‌లో రెండో గేమ్‌ను సైతం 21-15తో చేజార్చుకున్నాడు. సెమీఫైనల్లో ఓటమితో ఇండోనేషియా ఓపెన్‌ నుంచి నిష్క్రమించాడు.
పురుషుల డబుల్స్‌లో సాత్విక్‌, చిరాగ్‌లు మెరుపు ప్రదర్శన చేశారు. క్వార్టర్‌ఫైనల్లో టాప్‌ సీడ్‌ ఇండోనేషియా జోడీపై గెలుపొందిన సాత్విక్‌, చిరాగ్‌లు.. తాజాగా సెమీఫైనల్లో దక్షిణ కొరియా ద్వయంపై దండయాత్ర చేశారు. మూడు గేముల మ్యాచ్‌ను 67 నిమిషాల్లోనే గెలుపొందారు. తొలి గేమ్‌లో సాత్విక్‌, చిరాగ్‌లు అంచనాలు అందుకోలేదు. 2-2 అనంతరం దక్షిణ కొరియా జోడీ 11-6తో ఆధిక్యం సాధించారు. విరామం అనంతరం సైతం సాత్విక్‌, చిరాగ్‌ పుంజుకోలేదు. ఇక చావోరేవో తేల్చుకోవాల్సిన రెండో గేమ్‌లో సాత్విక్‌, చిరాగ్‌లు అద్భుతంగా ఆడారు. 4-1, 7-3, 11-4తో మనోళ్లు విరామ సమయానికి ఆధిక్యం సాధించారు. సెకండ్‌ హాఫ్‌లో ప్రత్యర్థికి ఎటువంటి అవకాశం ఇవ్వని భారత జోడీ.. రెండో గేమ్‌ను 21-19తో సొంతం చేసుకుని మ్యాచ్‌ను నిర్ణయాత్మక మూడో గేమ్‌కు తీసుకెళ్లింది. ఫైనల్‌ బెర్త్‌ను నిర్ణయించే మూడో గేమ్‌ అత్యంత ఉత్కంఠగా సాగింది. 5-5 నుంచి 11-6తో సాత్విక్‌, చిరాగ్‌ జోడీ ఆరు పాయింట్ల ఆధిక్యంలో నిలిచింది. ద్వితీయార్థంలో పుంజుకున్న కొరియా జోడీ 16-16తో సమం చేసింది. వరుసగా మూడు పాయింట్లు సాధించిన భారత స్టార్స్‌ 19-16తో ముందంజ వేశారు. 21-18తో నిర్ణయాత్మక గేమ్‌ సొంతం చేసుకుని ఫైనల్లోకి ప్రవేశించారు.
…………………………………….

 

Spread the love