క్వార్టర్స్‌లో కిరణ్‌ జార్జ్‌

–  లక్ష్యసేన్‌ ముందంజ
–  థాయ్ లాండ్‌ ఓపెన్‌
బ్యాంకాక్‌ : భారత యువ షట్లర్‌ కిరణ్‌ జార్జ్‌ సంచలన మోత మోగిస్తున్నాడు. ప్రపంచ చాంపియన్‌షిప్స్‌ సిల్వర్‌ మెడలిస్ట్‌పై విజయంతో ప్రీ క్వార్టర్స్‌లో కాలుమోపిన కిరణ్‌ జార్జ్‌.. తాజాగా వెంగ్‌ హాంగ్‌ యాంగ్‌పై విజయంతో క్వార్టర్‌ఫైనల్లోకి ప్రవేశించాడు. పురుషుల సింగిల్స్‌ ప్రీ క్వార్టర్‌ఫైనల్లో చైనా షట్లర్‌ వెంగ్‌ హాంగ్‌ యాంగ్‌పై 21-11, 21-19తో వరుస గేముల్లో కిరణ్‌ జార్జ్‌ గెలుపొందాడు. వరుసగా ఇద్దరు స్టార్‌ చైనా షట్లర్లపై విజయం సాధించిన కిరణ్‌ జార్జ్‌ నేడు సెమీస్‌ బెర్త్‌ కోసం ఫ్రాన్స్‌ ఆటగాడు తోమ జూనియర్‌తో పోటీపడనున్నాడు. మెన్స్‌ సింగిల్స్‌ యువ కెరటం లక్ష్యసేన్‌ సైతం ముందంజ వేశాడు. నాల్గో సీడ, చైనా షట్లర్‌ లి షి ఫెంగ్‌పై లక్ష్యసేన్‌ మెరుపు విజయం సాధించాడు. 21-17, 21-15తో టైటిల్‌ ఫేవరేట్‌ను మట్టికరిపించిన లక్ష్యసేన్‌ క్వార్టర్‌ఫైనల్లోకి దూసుకెళ్లాడు. మహిళల సింగిల్స్‌లో సైనా నెహ్వాల్‌ 11-21, 14-21తో మూడో సీడ్‌ హీ బింగ్జియావో (చైనా) చేతిలో ఓటమి చెందింది. అష్మిత చాలిహ 18-21, 13-21తో స్పెయిన్‌ స్టార్‌ కరొలినా మారిన్‌తో పోరాడి ఓడింది. పురుషుల డబుల్స్‌లో టాప్‌ సీడ్‌ సాత్విక్‌సాయిరాజ్‌ రాంకిరెడ్డి, చిరాగ్‌ శెట్టి జోడీ అనూహ్య పరాజయం చవిచూసింది. 26-24, 11-21, 17-21తో ఇండోనేషియా జోడీ మహ్మద్‌ ఫిక్రి, మౌలానా బగాస్‌తో మూడు గేముల పోరులో నిష్క్రమించారు.

Spread the love