అహ్మదాబాద్‌లో ఓటు వేసిన ప్రధాని మోడీ

నవతెలంగాణ-హైదరాబాద్ : లోక్‌సభ ఎన్నికలు-2024లో భాగంగా నేడు (మంగళవారం) కొనసాగుతున్న మూడో దశ పోలింగ్‌లో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ తన ఓటు హక్కుని వినియోగించుకున్నారు. అహ్మదాబాద్‌ నగరంలోని రాణిప్ ప్రాంతంలో ఉన్న నిషాన్ హయ్యర్ సెకండరీ స్కూల్‌లో ఏర్పాటు చేసిన పోలింగ్ బూత్‌లో ఆయన ఓటు వేశారు. ఉదయం 7:30 గంటల సమయంలో ప్రధాని పోలింగ్ కేంద్రానికి చేరుకుని ఓటు వేశారు. మోడీకి కేంద్ర మంత్రి అమిత్ షా స్వాగతం పలకగా.. ఇద్దరు నేతలు బూత్ వద్దకు వెళ్లారు. బూత్ వెలుపల పెద్ద సంఖ్యలో గుమికూడిన జనాలను ఉద్దేశిస్తూ ప్రధాని మాట్లాడారు. ప్రజాస్వామ్యంలో ఓటుకు చాలా ప్రాధాన్యత ఉందని, కాబట్టి అందరూ తరలి వచ్చి ఓటు వేయాలని దేశ పౌరులను కోరారు. దేశంలో దానానికి చాలా ప్రాముఖ్యత ఉందని, ఇదే స్ఫూర్తితో దేశ ప్రజలు వీలైనంత ఎక్కువ మంది ఓటు వేయాలని సూచించారు. ఇంకా నాలుగు దశల పోలింగ్ మిగిలివుందని ప్రధాని మోడీ పేర్కొన్నారు. ప్రతి ఒక్కరూ ఓటు వేసి ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేయాలని కోరారు.

Spread the love