ప్రయాణికులకు తెలంగాణ ఆర్టీసీ మరో శుభవార్త..

నవతెలంగాణ-హైదరాబాద్ : తెలంగాణ ఆర్టీసీ ఎండీగా బాధ్యతలు చేపట్టిన దగ్గర నుంచి వీసీ సజ్జనార్.. ప్రతీసారి ఏదొక సరికొత్త ప్లాన్‌తో ఆర్టీసీ ఆదాయాన్ని పెంచేందుకు తీవ్రంగా కృషి చేస్తున్నారు. ఈ కోవలోనే ఆర్టీసీ ప్రయాణీకులకు మరో తీపికబురు అందించారు. మొన్నటికి మొన్న హైదరాబాద్-విజయవాడ ప్రతీ పది నిమిషాలకో బస్సు పెట్టేలా చర్యలు తీసుకున్న టీఎస్ఆర్టీసీ. ఆ తర్వాత ముందస్తు రిజర్వేషన్ చేయించుకున్నవారికి పదిశాతం తగ్గింపు ప్రకటించింది. ఇక ఇప్పుడు మరో రాయితీని ప్రయాణీకులకు తీసుకొచ్చారు. ఎక్స్‌ప్రెస్ మంత్లీ సీజన్ టికెట్ పాసింజర్లకు శుభవార్తనిచ్చారు. ఈ పాస్ ఉన్నవారు ఇకపై డీలక్స్ బస్సుల్లోనూ ప్రయాణించేలా సౌకర్యాన్ని కల్పిస్తున్నారు. రూ.20 కాంబినేషన్‌ టికెట్‌ తీసుకుని డీలక్స్‌ బస్సుల్లో వీరంతా ప్రయాణించవచ్చునని సజ్జనార్ తెలిపారు. ఈ మేరకు ట్విట్టర్‌లో పేర్కొన్నారు. 100 కిలోమీటర్ల పరిధిలో జారీ చేసే ఈ ఎక్స్‌ప్రెస్ పాస్ కావాలనుకునేవారు.. స్థానిక టీఎస్ఆర్టీసీ బస్ పాస్ కౌంటర్లకు వెళ్లి సంప్రదించాలని కోరారు. ఇకపై కాంబినేషన్ టికెట్‌తో ఎక్స్‌ప్రెస్ మంత్లీ పాస్ హోల్డర్స్.. డీలక్స్ బస్సుల్లో ప్రయాణించవచ్చునన్న మాట. రాష్ట్రమంతా ఉన్న డీలక్స్ బస్సులకు ఇది వర్తిస్తుంది. కానీ సమ్మర్ వరకునా.. లేక ఆ తర్వాత కొనసాగుతుందా అనేది తెలియాల్సి ఉంది.

Spread the love