– ఛేదనలో బ్రూక్, క్రావ్లీ, వోక్స్ మెరుపుల్
– మూడో టెస్టులో ఇంగ్లాండ్ గెలుపు
– యాషెస్ సిరీస్‌పై ఆశలు సజీవం
యాషెస్ సిరీస్‌లో ఎట్టకేలకు బజ్‌బాల్ పైచేయి సాధించింది. గెలుపు వేటలో అత్యంత దూకుడుగా ఆడుతూ ఓడినా ఫర్వాలేదనే ఫార్ములాతో ఇంగ్లాండ్ జట్టు టెస్టు క్రికెట్‌లో సంచలనం రేపుతున్న సంగతి తెలిసిందే. బజ్‌బాల్ ఆటతో తొలి రెండు టెస్టుల్లో ఓడినా.. ఆతిథ్య జట్టు ఆట మాత్రం విశేషంగా అలరించింది. సిరీస్‌లో కీలక మూడో టెస్టులో బజ్‌బాల్ జోరుతో 3 వికెట్ల తేడాతో గెలుపొందిన ఇంగ్లాండ్.. టెస్టు క్రికెట్ ఛేదనలో మరో చారిత్రక విజయం సొంతం చేసుకుంది. ఐదు టెస్టుల యాషెస్ సిరీస్‌లో ఆశలు సజీవంగా నిలుపుకుంది.
లీడ్స్ (ఇంగ్లాండ్)
యాషెస్ సిరీస్ రెండో టెస్టులో 371 పరుగుల ఛేదనలో విజయానికి అత్యంత చేరువగా వచ్చిన ఇంగ్లాండ్.. దూకుడుగా ఆడినందుకు పశ్చాత్తాపం చెందలేదు. తర్వాతి టెస్టు లీడ్స్‌లో అంతకుమించిన దూకుడుతో బజ్‌బాల్ మెరుపుల్ మెరిపించి.. 3 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. 251 పరుగుల సవాల్‌తో కూడిన లక్ష్యాన్ని ఇంగ్లాండ్ 50 ఓవర్లలో ఏడు వికెట్లు కోల్పోయి ఛేదించింది. ఇంగ్లాండ్ తరఫున యువ బ్యాటర్ హ్యారీ బ్రూక్ (75, 93 బంతుల్లో 9 ఫోర్లు) అర్థ సెంచరీకి తోడు ఓపెనర్ జాక్ క్రావ్లీ (44, 55 బంతుల్లో 5 ఫోర్లు), క్రిస్ వోక్స్ (32 నాటౌట్, 47 బంతుల్లో 4 ఫోర్లు), మార్క్‌వుడ్ (16 నాటౌట్, 8 బంతుల్లో 1 ఫోర్, 1 సిక్స్) రాణించారు. ఆస్ట్రేలియా పేసర్ మిచెల్ స్టార్క్ (5/78) ఐదు వికెట్ల ప్రదర్శనతో ఆకట్టుకున్నాడు. రెండు ఇన్నింగ్స్‌ల్లో కలిపి ఏడు వికెట్లతో పాటు బ్యాట్‌తో కీలక పాత్ర పోషించిన మార్క్‌వుడ్ ‘మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డు అందుకున్నాడు. లీడ్స్ టెస్టులో ఇంగ్లాండ్ విజయం సాధించగా యాషెస్ సిరీస్‌లో ఆ జట్టు 1-2తో నిలిచింది. మరో రెండు టెస్టులు మిగిలి ఉండగా.. సిరీస్‌పై ఆతిథ్య జట్టు ఆశలు సజీవంగా నిలుపుకుంది. జులై 19 నుంచి మాంచెస్టర్‌లో యాషెస్ నాల్గో టెస్టు జరుగనుంది.
ఆద్యంతం రసవత్తరం
పేసర్ల స్వర్గధామం లీడ్స్‌లో నాలుగు రోజుల్లోనే ఫలితం తేలింది. ఆసీస్ నిర్దేశించిన 251 పరుగుల ఛేదనలో.. ఇంగ్లాండ్ మూడో రోజే 27/0 పరుగులు చేసింది. దీంతో నాల్గో రోజు ఉదయం సెషన్‌కు మరో 224 పరుగుల వేటకు బరిలోకి దిగింది. రెండో టెస్టులో ఇంగ్లాండ్ బ్యాటర్లు ఏకంగా రికార్డు లక్ష్యాన్నే ఊదేసేలా కనిపించటంతో.. 224 పరుగులు పెద్ద విషయం కాదు అనిపించింది. కానీ ఇంగ్లాండ్ బజ్‌బాల్ మంత్ర పఠించినా.. ఆసీస్ అంత సులువుగా పట్టు విడువలేదు. ఓపెనర్ జాక్ క్రావ్లీ (44), బెన్ డకెట్ (23) తొలి వికెట్‌కు 42 పరుగులతో శుభారంభం అందించారు. మోయిన్ అలీ (5), జో రూట్ (21) నిరాశపరిచారు. దీంతో 131/4తో ఇంగ్లాండ్ కాస్త ఒత్తిడిలో పడింది. ఈ సమయంలో యువ బ్యాటర్ హ్యారీ బ్రూక్ (75) బాధ్యత తీసుకున్నాడు. కెప్టెన్ బెన్ స్టోక్స్ (13), జానీ బెయిర్‌స్టో (5)సైతం చేతులెత్తేయగా.. భారం అంతా బ్రూక్ మోశాడు. క్రిస్ వోక్స్ (32 నాటౌట్) జతగా కీలక భాగస్వామ్యం నిర్మించాడు. ఆరు ఫోర్లతో 67 బంతుల్లో అర్థ సెంచరీ సాధించిన బ్రూక్.. స్టార్క్ ఓవర్లో నిష్క్రమించటంతో కాస్త హైడ్రామాకు అవకాశం కనిపించింది. కానీ మార్క్‌వుడ్ (16 నాటౌట్) ఓ సిక్సర్, ఫోర్‌తో సమీకరణాలను మార్చివేశాడు. ఉత్కంఠను తొలగించి ఇంగ్లాండ్‌కు విజయాన్ని కట్టబెట్టాడు.
ఉదయం సెషన్ అనంతరం ఇంగ్లాండ్ 153/4తో నిలువగా.. ఆ జట్టు విజయానికి మరో 98 పరుగులు అవసరం. ఆస్ట్రేలియాకు మరో వికెట్లు అవసరం. ఈ దశలో ఇంగ్లాండ్ ఆచితూచి ఆడుతుందా? సహజశైలిలో బజ్‌బాల్ మెరుపులు చూపిస్తుందా? అనే చర్చ నడిచింది. ఈ ఛేదనలో ఇరు జట్లు అనుసరించే వ్యూహంపై భవిష్యత్ టెస్టు క్రికెట్ గమనం ఆధారపడి ఉందనే స్థాయిలో చర్చ సాగింది. చివరగా ఇంగ్లాండ్ బజ్‌బాల్ దూకుడుతోనే విజయాన్ని అందుకుంది. చివర్లో మార్క్‌వుడ్ ఒత్తిడిని చిత్తు చేస్తూ స్టార్క్, కమిన్స్ వేసిన బౌన్సర్లను బౌండరీలను తరలించిన విధానం బజ్‌బాల్ మార్క్‌కు నిదర్శనం.
స్కోరు వివరాలు
ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్ : 263/10
ఇంగ్లాండ్ తొలి ఇన్నింగ్స్ : 237/10
ఆస్ట్రేలియా రెండో ఇన్నింగ్స్ : 224/10
ఇంగ్లాండ్ రెండో ఇన్నింగ్స్ : జాక్ క్రావ్లీ (సి) అలెక్స్ (బి) మార్ష్ 44, డకెట్ (ఎల్బీ) స్టార్క్ 23, మోయిన్ (బి) స్టార్క్ 5, రూట్ (సి) అలెక్స్ (బి) కమిన్స్ 21, బ్రూక్ (సి) కమిన్స్ (బి) స్టార్క్ 13, బెయిర్‌స్టో (బి) స్టార్క్ 5, వోక్స్ నాటౌట్ 32, మార్క్‌వుడ్ నాటౌట్ 16, ఎక్స్‌ట్రాలు : 20, మొత్తం : (50 ఓవర్లలో 7 వికెట్లకు) 254.
వికెట్ల పతనం : 1-42, 2-60, 3-93, 4-131, 5-161, 6-171, 7-230.
బౌలింగ్ : పాట్ కమిన్స్ 15-0-77-1, మిచెల్ స్టార్క్ 16-0-78-5, స్కాట్ బొలాండ్ 11-1-49-0, మిచెల్ మార్ష్ 6-0-23-1, టాడ్ మర్ఫీ 2-0-13-0.